Nethi Bobbatlu: తెలుగువారి పండగల్లో పిండివంటలకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందులోనూ ఉగాది పండుగ వచ్చిందంటే చాలు.. మొదట గుర్తొచ్చే పిండి వంటకం బొబ్బట్లు. కొంతమంది వీటిని భక్ష్యాలు అంటే, మరికొంతమంది పోలేలు లేదా ఓలిగలు అని పిలుస్తారు. పక్కా కొలతలతో, చిట్కాలతో చేస్తే మన అమ్మమ్మల స్టైల్ అంత రుచిగా, నోట్లో వేస్తే కరిగిపోయేలా బొబ్బట్లను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
శనగపప్పు – ఒక కప్పు
బెల్లం తురుము – ఒక కప్పు (తీపిని బట్టి కొంచెం అటు ఇటుగా)
మైదా పిండి – ఒక కప్పు (లేదా గోధుమపిండి)
నెయ్యి – అర కప్పు
యాలకుల పొడి – ఒక టీస్పూన్
నూనె – 2-3 స్పూన్లు
నీళ్లు – తగినంత
⇒ ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి, చిటికెడు ఉప్పు, కొంచెం నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి. చివరగా పైన కొంచెం నూనె వేసి కనీసం 2 గంటల పాటు నాననివ్వాలి. అప్పుడే బొబ్బట్లు మెత్తగా వస్తాయి.
⇒ శనగపప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు ఉడికాక అందులోని అదనపు నీటిని వడకట్టాలి. ఇప్పుడు ఈ పప్పులో బెల్లం తురుము వేసి చిన్న మంటపై దగ్గర పడేవరకు ఉడికించాలి. చివరగా యాలకుల పొడి కలిపి, చల్లారాక గ్రైండర్ లేదా మిక్సీలో మెత్తగా రుబ్బాలి. దీనినే పూర్ణం అంటారు.
⇒ నానిన మైదా పిండిని చిన్న నిమ్మకాయ సైజులో తీసుకుని అరచేతిలో వెడల్పుగా చేయాలి. అందులో రుబ్బి పెట్టుకున్న పూర్ణం ముద్దను మధ్యలో పెట్టి అంచులను మూసివేయాలి.
⇒ ఒక పాలిథిన్ పేపర్ లేదా అరటి ఆకుపై కొంచెం నెయ్యి రాసి, ఈ ముద్దను పల్చగా ఒత్తుకోవాలి. పెనం వేడి అయ్యాక, దానిపై కొంచెం నెయ్యి వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. ఇలా చేసుకుంటే వేడి వేడి నేతి బొబ్బట్లు సిద్ధం అయినట్టే.
బొబ్బట్లు ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే పిండిలో నూనెను కొంచెం ఎక్కువగా వేసి ఎక్కువ సేపు నాననివ్వాలి. పూర్ణం గట్టిగా ఉంటే బొబ్బట్లు విరగకుండా మంచిగా వస్తాయి. చక్కెర కంటే బెల్లం వాడటం వల్ల బొబ్బట్లు మంచి రంగుతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.