Matti Kusthi 2 review: 2022లో ప్రముఖ డైరెక్టర్ చెల్లా అయ్యావు దర్శకత్వంలో విష్ణు విశాల్ (Vishnu Vishal)హీరోగా, ఐశ్వర్య లక్ష్మీ(Aishwarya Lakshmi) హీరోయిన్ గా కుస్తీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గట్ట కుస్తీ. తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరిట డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ చేసి మంచి ప్రేక్షక ఆదరణ సొంతం చేసుకున్నారు. మూడేళ్ల విరామం తర్వాత గట్ట కుస్తీ 2 పేరుతో సీక్వెల్ తో తమిళంలో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 3వ తేదీన తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది . తెలుగు డబ్బింగ్ వర్షన్ మట్టి కుస్తీ 2 పేరిట ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఓటీటీ ప్రియులను ఏ విధంగా ఆకట్టుకుంది? ఎలాంటి వినోదాన్ని పంచింది? అనే విషయం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మొదటి భాగం ఎక్కడైతే ఎండ్ అయ్యిందో కరెక్ట్ గా అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. తన భార్య కీర్తి (ఐశ్వర్య లక్ష్మి) తో నేషనల్ ఛాంపియన్ చేస్తానని మాట ఇచ్చిన వీర (విష్ణు విశాల్), ఇంటి పనులు, వాళ్ళ ఆరేళ్ల కూతురు మలర్ (జారా) బాధ్యతలను చూసుకుంటూ పక్కా హౌస్ వైఫ్.. అదేనండి పక్కా హౌస్ హస్బెండ్ అయిపోతాడు. కీర్తి ఒక పక్క రైల్వే జాబ్ చేసుకుంటూనే కుస్తీ ప్రాక్టీవ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆమెకి వస్తున్న పేరు చూసి కుళ్ళుకున్న కోచ్ (తారక్ పొన్నప్ప), వీరాని పావుగా వాడుకొని ఆమె కెరీర్ కి బ్రేకులు వేస్తాడు. దీంతో మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు వచ్చి అది కాస్త విడాకుల వరకు వెళుతుంది. మరి తన మీద పడ్డ నిందను వీర ఎలా తుడిపేసుకున్నాడు ? కీర్తి మళ్ళీ కుస్తీ పట్టిందా? వీర ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా? ఆమె నేషనల్ ఛాంపియన్ అయ్యిందా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
also read:రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ఆరంభం!
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ ల నటన చాలా అద్భుతంగా కుదిరింది. పెళ్ళాం కోసం ఇగో పక్కన పెట్టి సపోర్ట్ చేసే మొగుడు క్యారెక్టర్ లో విష్ణు చాలా అద్భుతంగా నటించేశాడు. తండ్రి కూతుర్ల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఆడియన్స్ కి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. కరుణాస్, అతిథి పాత్ర పోషించిన రమ్యకృష్ణ, యోగిబాబు ఎవరికి వారు తమ కామెడీ టైమింగ్ తో గట్టిగానే నవ్వించారు, ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే.. భార్యాభర్తల మధ్య వచ్చే రొమాంటిక్ కుస్తీ ఫైట్ మాత్రం సీట్లలో కూర్చున్న వాళ్లకు ఫుల్ మజా ఇస్తుంది.
డైరెక్షన్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. ఉన్నంతలో ఓవరాక్షన్ చేయకుండా కొత్త ప్రయోగాల జోలికి పోకుండా సేఫ్ గేమ్ ఆడాడు. ఫస్ట్ హాఫ్ లో రొటీన్ ఫ్యామిలీ సీన్లతో కాస్త సాగదీసినా.. ఎప్పుడైతే కథలో విలన్ కుట్రలు మొదలవుతాయో.. అక్కడి నుంచి సినిమా కథ ఆసక్తిని పెంచుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్లని, కోర్టు డ్రామాని బోర్ కొట్టించకుండా కామెడీతో చాలా చక్కగా బ్యాలెన్స్ చేశారు. ముఖ్యంగా మహిళలు ఇంట్లో , బయట ఎదుర్కొనే వేధింపులను తట్టుకొని ఎలా నిలబడాలో ఇచ్చిన మెసేజ్ చాలా అద్భుతంగా ఉంది.
కొత్త కథేం కాదు కానీ ఫ్యామిలీ అంతా కలిసి కడుపుబ్బా నవ్వుకునే క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. రొటీన్ డ్రామానే అయినా సెకండ్ హాఫ్ లో వచ్చే కామెడీ , స్కూల్ టీచర్ తో వీరా చేసే హంగామా సినిమాకు ప్రాణం పోసాయి. డబుల్ మీనింగ్ డైలాగులు, వల్గర్ సీన్లు అసలే లేవు కాబట్టి ఈ ఆదివారం మీ ఫ్యామిలీతో కలిసి ఇంట్లో హ్యాపీగా ఈ సినిమా ఎంజాయ్ చేయొచ్చు.