Shraddha Kapoor:శ్రద్ధా కపూర్ ..‘సాహో’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైన ఈ బాలీవుడ్ బ్యూటీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయిపోతుంది.అయితే ఈసారి రెగ్యులర్ కమర్షియల్ కథతో కాకుండా, ఓ ప్రముఖ కళాకారిణి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు ముందుకు రావడం విశేషం.
మరాఠీ జానపద కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ లావణీ నృత్యకారిణి విఠాబాయి నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఈఠా’ సినిమాలో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్ డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లిందనడంలో సందేహం లేదు.
‘ఈఠా’ సినిమాకు ‘ఛావా’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించడం విశేషం. సాధారణంగా బయోపిక్ సినిమాల్లో వ్యక్తిగత జీవితంతో పాటు వారి విజయాలు, ఎదుర్కొన్న కష్టాలను ప్రధానంగా చూపిస్తుంటారని తెల్సిందే. అయితే ‘ఈఠా’లో మరాఠీ జానపద సంస్కృతి, లావణీ నృత్య సంప్రదాయం, ఓ మహిళా కళాకారిణి జర్నీ కూడా కీలకంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమయిపోతుంది.
విఠాబాయి నారాయణ్ గావ్కర్ అంటే మరాఠీ కళారంగంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. లావణీ నృత్యానికి తనదైన ప్రతిభతో ఆదరణ తీసుకొచ్చిన ఆమె జీవితం ఎన్నో కష్ట నష్టాలని చూసింది. ఒక కళాకారిణిగా ఎదిగే క్రమంలో ఎదురైన సవాళ్లు, కుటుంబ పరిస్థితులు, కళపై ఆమెకు ఉన్న ఇష్టం అన్నీ ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలోనే కనబడే జానపద కళలు, నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడానికి వెనుక ఎంతోమంది కళాకారుల కృషి ఉందనే విషయాన్ని ఇందులో చూపించానున్నాడట డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ .
ఇక ఎక్కువగా ‘ఆషికీ 2’ ‘స్త్రీ’ సిరీస్ వంటి గ్లామర్, రొమాంటిక్, హారర్ కామెడీ చిత్రాల్లో కనిపించిన శ్రద్దా ఈ పాత్ర కోసం ఎలాంటి కష్టపడ్డారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. . మరోవైపు ఈ సినిమాలో రణదీప్ హుడా కూడా కీలక పాత్రలో నటిస్తుండటం విశషం.. ‘సర్బ్జీత్’, ‘హైవే’, ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ వంటి చిత్రాల్లో తన సత్తా చాటిన రణదీప్, ‘ఈఠా’లో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడో చూడాలి. మరి డిసెంబర్ 4న థియేటర్లలో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!
ALSO READ :గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!