
Rainbow : ఆకాశాన ఇంద్రధనుస్సు కనిపిస్తే.. చిన్నారులకు ఎక్కడ లేని ఆనందం. దానిని చూసిన పెద్దల మనసులూ దూదిపింజల్లా తేలిపోతాయి. సాధారణంగా ఇంద్రధనుస్సు అర్థ చంద్రాకృతిలో విల్లులా కనిపిస్తుంది. మరి ఎప్పుడైనా సంపూర్ణ వృత్తాకారంలో ఉన్న హరివిల్లును మీరు చూశారా? ఆ అద్భుత, అరుదైన దృశ్యాన్ని సౌత్ వేల్స్ పోలీసులు హెలికాప్టర్ నుంచి వీక్షించారు. అంతేకాదు.. వేల్ ఆఫ్ గ్లామోర్గన్ వద్ద కనిపించిన ఆ సప్తవర్ణశోభిత ఇంద్రచాపాన్ని వారు హెలికాప్టర్ నుంచే చిత్రీకరించారు.
ఇంద్రధనుస్సులో ఎంత భాగం మనకు కనిపిస్తుందనేది.. మనం చూసే ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇంద్రధనుస్సులో.. సగాన్ని మాత్రమే మనం చూడగలుగుతాము. అందుకే అది మనకు అర్థ చంద్రాకారంలో కనిపిస్తుంది. సరైన సమయంలో, సరైన స్థలం నుంచి దీనిని చూడగలిగితే.. ఇది సంపూర్ణ వృత్తాకారంలో మనకు కనిపిస్తుంది.
రెయిన్ బో మధ్యభాగం.. ఆకాశంలోని సూర్యుడికి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. సూర్యుడు క్షితిజరేఖను సమీపిస్తున్న కొద్దీ ఫుల్ సర్కిల్ రెయిన్ బో ఆవిష్కృతమవుతుంటుంది. ఈ కారణంగానే సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో కనిపించే ఇంద్రధనుస్సులు మనకు పెద్దవిగా కనిపిస్తాయి.
మన అబ్జర్వేషన్ పాయింట్ కన్నా దిగువన నీటి బిందువులు ఉన్న పక్షంలో.. వాటిపై పడే సూర్యకాంతి విక్షేపణంతో సంపూర్ణ వృత్తాకారంలో రెయిన్ బోని వీక్షించే అవకాశం ఉంటుంది. స్ప్రింక్లర్ ద్వారా మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు ఫుల్ సర్కిల్ రెయిన్ బోలను చూసే అవకాశం చిక్కుతుందని శాస్త్రవేత్తలు ఉదహరిస్తున్నారు.
రెయిన్ బోకి సంబంధించి ఇలాంటి అరుదైన దృశ్యాలు ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారి కాదు. తిరగబడిన అర్థచంద్రాకృతి ఇంద్రధనుస్సు(inverted rainbow) నిరుడు సిసిలీలో కనిపించింది. ఇటలీకి చెందిన ఆస్ట్రోఫొటోగ్రాఫర్ మార్సెల్లా జూలియా పేస్ తన కెమెరాలో బంధించారు. వాటిని సర్కమ్ జెనితాల్ ఆర్క్(circumzenithal arc)గా వ్యవహరిస్తారు. చాలా మంది ఆమె తీసిన ఫొటో చూసి‘నవ్వుతున్న ఇంద్రచాప’మంటూ మురిసిపోయారు.