Ai+ Smartphone Price Hike: పండగ సీజన్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకొక బ్యాడ్ న్యూస్. Ai+ కంపెనీ తమ పలు స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచుతోంది. నవంబర్ 15 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. మోడల్, స్టోరేజ్ వేరియంట్‌ను బట్టి రూ.1,000 నుంచి రూ.3,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే Ai+ NovaFlip 5G ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఫోన్ కొనాలనుకునే వారు నవంబర్ 14లోపు కొనుగోలు చేస్తే పాత ధరలకే పొందవచ్చు.
Ai+ కంపెనీ అక్టోబర్ 28న విడుదల చేసిన ప్రకటనలో ధరల పెంపు విషయాన్ని వెల్లడించింది. ఫోన్ తయారీకి అవసరమైన విడిభాగాల ధరలు పెరగడంతో పాటు ఇతర ఖర్చులు కూడా ఎక్కువయ్యాయని తెలిపింది. దీంతో కొన్ని మోడళ్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. శాంసంగ్, ఒప్పో, రియల్‌మీ వంటి కంపెనీలు కూడా తమ పలు ఫోన్ల ధరలను పెంచుతున్నాయి. అంటే పెరుగుతున్న తయారీ ఖర్చుల ప్రభావం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై కనిపిస్తోంది.
Also Read: రూ.30,000 లోపు బెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు.. 2026లో టాప్-5 మోడల్స్ ఇవే!
Ai+ Pulse 2 FE, Pulse 2 మోడళ్ల ధరలు రూ.2,000 చొప్పున పెరగనున్నాయి. దీంతో 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్న Pulse 2 FE ధర రూ.8,999 నుంచి రూ.10,999కు చేరుతుంది. Pulse 2లో 4GB + 64GB వేరియంట్ ధర కూడా రూ.10,999 అవుతుంది. 4GB + 128GB వేరియంట్ రూ.11,999కు, 6GB + 128GB వేరియంట్ రూ.12,999కు చేరనున్నాయి. బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకునే వారికి ఈ పెంపు కొంత భారమే.
Ai+ Nova 2 5G ధరలు రూ.2,000 పెరగనున్నాయి. ప్రస్తుతం రూ.11,999 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫోన్ ధర కొత్తగా రూ.13,999 నుంచి మొదలవుతుంది. Nova 2 Neo 5G వేరియంట్లపై రూ.2,000 నుంచి రూ.3,000 వరకు పెంపు ఉంది. Nova 2 Power 5G, Nova 2 Pro 5G, Nova 2 Ultra 5G మోడళ్ల ధరలు కూడా పెరగనున్నాయి. కొన్ని వేరియంట్ల ప్రస్తుత ధరల్లో బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి కాబట్టి.. పోల్చేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
Ai+ NovaFlip 5G ధర మాత్రం యధాతథంగా కొనసాగుతుంది. 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.49,999కే అందుబాటులో ఉంటుంది. మిగతా మోడళ్లలో ఏదైనా కొనాలనుకుంటే నవంబర్ 14లోపు ప్రస్తుత ధరలకు కొనడం మంచిది.
Also Read: రూ.1.75 లక్షల శాంసంగ్ ఫోన్ ఇంత చౌకగానా? రూ.45 వేల డిస్కౌంట్‌తో అదిరిపోయే డీల్!