iPhone 18e: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఐఫోన్ 18e గురించి వస్తున్న వార్తలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ 2027లో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో కొత్త A20 చిప్, మెరుగైన సెల్ఫీ కెమెరా వంటి అప్‌గ్రేడ్స్ ఉండొచ్చని టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, డిజైన్ విషయంలో మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
యాపిల్ సాధారణంగా తమ తక్కువ ధర ఐఫోన్లను ఏడాది మొదటి భాగంలో విడుదల చేస్తుంటుంది. ఇదే పద్ధతిని కొనసాగిస్తే.. iPhone 18e 2027 మార్చి లేదా ఏప్రిల్‌లో లాంచ్ కావచ్చు. స్టాండర్డ్ iPhone 18, కొత్త iPhone Air మోడల్‌తో పాటు ఈ ఫోన్ కూడా పరిచయం కావచ్చని సమాచారం. అయితే, దీనిపై యాపిల్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: చెవులకు క్లిప్‌లా ఫిట్ చేసుకోవచ్చు.. 32 గంటల బ్యాటరీతో రెడ్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్!
iPhone 18e యాపిల్ బడ్జెట్ ఫోన్ల విభాగంలో కొనసాగనుంది. ప్రస్తుతం iPhone 17e భారత మార్కెట్లో రూ.79,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. కొత్త మోడల్ ధర కూడా ఇదే స్థాయిలో ఉండొచ్చని అంచనా. అయితే, మెమరీ, స్టోరేజ్ విడిభాగాల ధరలు పెరిగితే కొత్త ఫోన్ ధరపై ప్రభావం పడొచ్చు. యాపిల్ ఎలాంటి అప్‌గ్రేడ్స్ ఇస్తుందనే దానిపై కూడా తుది ధర ఆధారపడి ఉంటుంది.
ఐఫోన్ 18eలో కొత్త A20 చిప్ ఉండొచ్చని సమాచారం. ఇది 2nm టెక్నాలజీతో తయారయ్యే అవకాశం ఉంది. ఈ చిప్ వల్ల ఫోన్ వేగంగా పనిచేయడంతో పాటు బ్యాటరీ వినియోగం కూడా మెరుగుపడొచ్చు. ఇందులో 6.12 అంగుళాల OLED డిస్‌ప్లే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, 60Hz రిఫ్రెష్ రేట్‌కే పరిమితం కావచ్చు. డైనమిక్ ఐలాండ్ వస్తుందా, పాత నాచ్ కొనసాగుతుందా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
వెనుకవైపు 48MP సింగిల్ కెమెరానే కొనసాగించవచ్చని సమాచారం. అల్ట్రా వైడ్, టెలిఫోటో కెమెరాలు ఉండకపోవచ్చు. కానీ ముందు కెమెరాలో మాత్రం మంచి అప్‌గ్రేడ్ ఉండొచ్చు. ఐఫోన్ 17eలోని 12MP సెల్ఫీ కెమెరా స్థానంలో 24MP కెమెరా ఇవ్వొచ్చని తెలుస్తోంది. దీంతో సెల్ఫీలు, వీడియో కాల్స్ మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. అయితే, ఇవన్నీ ప్రస్తుతానికి వచ్చిన నివేదికల ఆధారంగానే ఉన్న అంచనాలు. ఫోన్ ఫీచర్లు, ధర, లాంచ్ తేదీపై యాపిల్ అధికారికంగా ప్రకటించిన తర్వాతే పూర్తి స్పష్టత రానుంది.
Also Read: షాకింగ్.. నవంబర్ 15 నుంచి ఆ ఫోన్ల ధరలు భారీగా పెంపు.. కొత్త ధరలు ఇవే!