Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పయనమవుతున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఏఐసీసీ కార్యాలయంలో చర్చ జరగనుంది.
శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే సమావేశంలో.. ఈ అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీల పునర్వ్యవస్థీకరణపై.. గత కొన్ని వారాలుగా చర్చ సాగుతోంది. దాదాపు ప్రతి జిల్లాలో డీసీసీ అధ్యక్ష పదవికి భారీగా దరఖాస్తులు అందాయి. పార్టీ పునర్నిర్మాణం, బలమైన స్థానిక నాయకత్వం ఏర్పరచడమే లక్ష్యంగా సీఎం ప్రత్యేక వ్యూహం రూపొందించారు. ఈ నెలాఖరుకల్లా నియామక ప్రక్రియ పూర్తి చేసేలా.. ఏఐసీసీ ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. ఏఐసీసీ నేతలు రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రతి జిల్లాలో స్థానిక నేతల ప్రభావం, పార్టీ కార్యకలాపాల స్థాయి, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టి వర్గాల ప్రాతినిధ్యం వంటి అంశాలను సమీక్షించారు. ఈ నివేదిక ఆధారంగా తుది జాబితా ఖరారు చేయనున్నారు.
సమావేశంలో ముఖ్యంగా పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పార్టీ ఆర్గనైజేషన్ బలోపేతంపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారని సమాచారం.
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ రేపు ఉదయం హైదరాబాదు నుంచి ఢిల్లీ బయలుదేరనున్నారు. భట్టి విక్రమార్క, మహేష్ గౌడ్ నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.
Also Read: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఈ నెల చివరినాటికి డీసీసీ అధ్యక్షుల నియామక జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి పర్యటనతో రాష్ట్ర కాంగ్రెస్ అంతర్గత సమీకరణాలు, బలపర్చే ప్రయత్నాలు వేగం కానున్నాయి.