Tirupati Tragedy: ఏపీలో మరో విషాదం చోటుచేసుకుంది. స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతు అయ్యారు. తిరుపతి జిల్లా వేదాంతపురం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఆగ్రహారానికి చెందిన ఏడుగురు యువకులు శుక్రవారం తిరుపతి రూరల్ మండలంలోని వేదాంతపురం వద్ద స్వర్ణముఖి నదిలోకి ఈతకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తూ ప్రకాశ్ (17), తేజు (19), బాలు (16), చిన్న (15) నదిలో గల్లంతయ్యారు.
యువకులు నదిలో కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు విష్ణు, మణిరత్నం, కృష్ణను కాపాడారు. గల్లంతైన నలుగురిలో బాలు మృతదేహం లభ్యమైంది. మిగిలిన ముగ్గురి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. డ్రోన్ల సహాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏ చిన్న అవకాశం ఉన్న ఉపయోగించుకోవాలని గాలింపు బృందాలకు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు.
తిరుపతి జిల్లా వేదాంతపురం వద్ద స్వర్ణముఖి నదిలో యువకుల గల్లంతు ఘటన ఆవేదన కలిగించిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నలుగురు యువకులు గల్లంతు కాగా, ఒకరి మృతదేహం లభ్యమైందని అధికారులు సమాచారం ఇచ్చారన్నారు. గల్లంతైన వారి జాడ కోసం చేపట్టిన చర్యలు వివరించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తాయని పవన్ అన్నారు. నదులు, వాగుల్లో ఈతకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికారులు నీటి ప్రవాహాల దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
‘తిరుపతి స్వర్ణముఖి నదిలో నలుగురు బాలురు గల్లంతయ్యారన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుతో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నాను. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్టు ఎస్పీ చెప్పారు. డ్రోన్ సాయంతో గాలింపు చేపట్టారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. భారీ వర్షాల వల్ల నదులు, చెరువులు, కాలువల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను’ అని హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ లో పోస్టు పెట్టారు.