iPhone 20th Anniversary: ఐఫోన్ అభిమానులకు 2027 సంవత్సరం ప్రత్యేకం కానుంది. ఎందుకంటే.. 2007లో స్టీవ్ జాబ్స్ పరిచయం చేసిన ఐఫోన్‌కు అప్పటికి 20 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా యాపిల్ ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకురావాలని చూస్తోందని తాజా లీకులు చెబుతున్నాయి. కంపెనీ నుంచి దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ ఫోన్ డిజైన్‌లో పెద్ద మార్పులు ఉండొచ్చని సమాచారం. ముఖ్యంగా నాలుగు వైపులా వంగిన గ్లాస్, టైటానియం ఫ్రేమ్ ఇందులో కనిపించే అవకాశం ఉంది.
తాజా లీకుల ప్రకారం.. యాపిల్ ప్రస్తుతం 4 ప్రోటోటైప్‌లను పరిశీలిస్తోంది. వీటిలో రెండు ఫోన్లకు సాధారణ ఫ్లాట్ గ్లాస్ ఉంటుంది. మిగతా రెండింటిలో మాత్రం ఫోన్ నాలుగు అంచుల చుట్టూ వంగే క్వాడ్ కర్వ్డ్ గ్లాస్‌ను వాడుతున్నారు. ఈ డిజైన్‌పై కంపెనీ దాదాపు మూడేళ్లుగా పనిచేస్తోందని చెబుతున్నారు. మొదట అంచుల దగ్గర వంపు ఎక్కువగా ఉండేదట. తర్వాత దాన్ని తగ్గిస్తూ ఆకారాన్ని మెరుగుపరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న కొన్ని నమూనాలు పాత ప్రోటోటైప్‌లు కావచ్చని టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ పేర్కొన్నారు. అందువల్ల లీకైన చిత్రాలే తుది డిజైన్ అని భావించకూడదు.
క్వాడ్ కర్వ్డ్ గ్లాస్ ఉన్న మోడల్‌లో స్క్రీన్ చుట్టూ బెజెల్స్ కేవలం ఒక మిల్లీమీటర్ వరకు ఉండొచ్చని అంచనా. గ్లాస్ నాలుగు వైపులా లోపలికి వంగి ఉండటంతో, ముందు నుంచి చూసినప్పుడు అంచులు దాదాపు కనిపించవు. దీంతో స్క్రీన్ మొత్తం ముందు భాగాన్ని ఆక్రమించినట్లు అనిపించవచ్చు. యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్‌గా భావిస్తున్న ఐఫోన్ డ్యుయో కంటే ఈ యానివర్సరీ మోడల్‌పైనే కొందరికి ఎక్కువ ఆసక్తి ఉందట.
మరో టిప్‌స్టర్ ఫిక్స్‌డ్ ఫోకస్ డిజిటల్ ప్రకారం.. యాపిల్ ప్రో మోడళ్లలో టైటానియం ఫ్రేమ్‌ను మళ్లీ తీసుకురావొచ్చు. iPhone 15 Pro సిరీస్ తర్వాత ఈ మెటీరియల్‌ను తిరిగి వాడే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త iPhone 20 Proలో గుండ్రని మూలలు, టైటానియం ఫ్రేమ్ ఉండొచ్చని సమాచారం. ఈ ఫోన్ రూపకల్పనకు iPhone Air డిజైన్ స్ఫూర్తిగా నిలవొచ్చని మరో అంచనా.
ఇటీవల ఐస్ యూనివర్స్ షేర్ చేసిన వీడియోలో క్వాడ్ కర్వ్డ్ గ్లాస్ ప్యానెల్ కనిపించింది. అది మెటల్ ఫ్రేమ్ వరకు విస్తరించినట్లు, ముందు కెమెరా, సెన్సర్ల స్థానాలను సూచించే గుర్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో డైనమిక్ ఐలాండ్ కూడా చిన్నగా కనిపించింది. అయితే, అది అభివృద్ధి దశలోని నమూనా మాత్రమే కావచ్చు. తుది ఫోన్‌లో కూడా మార్పులు ఉండొచ్చు. 2017లో ఐఫోన్ పదో వార్షికోత్సవం సందర్భంగా iPhone Xను విడుదల చేసిన యాపిల్.. హోమ్ బటన్‌ను తొలగించి ఫేస్ ఐడీని తీసుకొచ్చింది. 2027 మోడల్‌లోనూ అలాంటి గుర్తుండిపోయే మార్పు ఉంటుందా అనేది చూడాలి. అప్పటివరకు ఇవన్నీ లీకులుగానే చూడాలి.