Nokia 1100: ఒకప్పుడు చేతిలో ఫోన్ ఉందంటే అదొక గొప్ప ఫీలింగ్. ముఖ్యంగా నోకియా 1100 ఫోన్ వాడిన వాళ్లకు ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ కళ్ల ముందు కదులుతూనే ఉంటాయి. 2003లో మార్కెట్లోకి వచ్చిన ఈ క్లాసిక్ ఫోన్.. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, రోజుల తరబడి వచ్చే బ్యాటరీ బ్యాకప్, సింపుల్ డిజైన్‌తో అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. అయితే మారిన టెక్నాలజీ నేపథ్యంలో ఈ ఫోన్ దాదాపుగా కనుమరుగైంది. అయితే మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఫోన్ పేరు ఆన్‌లైన్‌లో తెగ వినిపిస్తోంది. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకునేవాళ్లు, కలెక్షన్ కోసం ఇష్టపడేవాళ్లు దీని వైపు చూస్తున్నారు.
నిజానికి ఒరిజినల్ నోకియా 1100 తయారీని కంపెనీ ఎప్పుడో ఆపేసింది. అయినా సరే ఇండియాలో కొన్ని ఆన్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్లు ఇంకా కనిపిస్తున్నాయి. కాకపోతే నేటి స్మార్ట్‌ఫోన్ యుగంలో ఇది రోజువారీ పనులకు సరిపోదని తెలిసినా.. పాత జ్ఞాపకాల కోసం, కలెక్షన్ కోసం, కాల్స్, మెసేజ్‌ల కోసం సెకండరీ ఫోన్‌గా వాడుకోవడానికి చాలామంది దీనిపై ఆసక్తి చూపుతున్నారు.
ఈ ఫోన్ ధర అది ఉన్న కండిషన్, అమ్మేవాళ్లను బట్టి మారుతూ ఉంటుంది. పేరున్న సెల్లర్లు ఈ ఫోన్ రిఫర్ బీష్డ్ (Refurbished) చేసి అంటే మరమ్మత్తులు, మంచి స్థితికి తీసుకొచ్చి అమ్ముతున్నారు. వారి దగ్గర ఈ రిఫర్ బీష్డ్ నోకియా 1100 ఫోన్ ధర సుమారు రూ.1,199 నుంచి రూ.1,499 వరకు పలుకుతోంది. కొందరు సెల్లర్లు అయితే దీనిపై ఆరు నెలల వారంటీ, 14 రోజుల రిటర్న్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. అటు సెకండ్‌హ్యాండ్ మార్కెట్లలో వాడిన ఫోన్లు రూ.999 దగ్గర దొరుకుతుండగా.. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన ‘న్యూ ఓల్డ్ స్టాక్’ ఫోన్ల ధర రూ.1,599 వరకు ఉంటోంది.
నోకియా 1100లో 96 × 65 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో సింపుల్ మోనోక్రోమ్ డిస్‌ప్లేతో రూపొందింది. ఇందులో 850mAh బ్యాటరీ (రీమూవబుల్) సింగిల్ సిమ్ సపోర్ట్ ఇచ్చారు. సుమారు 86 గ్రాముల బరువుండే ఈ ఫోన్‌కు వాటర్-రెసిస్టెంట్ కీప్యాడ్, బిల్ట్-ఇన్ టార్చ్, అలారం అందించారు. అలాగే అప్పట్లో అందరినీ అలరించిన సింపుల్ గేమ్స్ కూడా ఇందులో ఉంటాయి. కంపెనీ లెక్కల ప్రకారం ఇది 400 గంటల స్టాండ్‌బై టైమ్, దాదాపు 4.5 గంటల టాక్ టైమ్ ఇస్తుంది. అయితే ఇప్పటి కాలంతో పోలిస్తే ఇందులో ఫీచర్లు చాలా పరిమితం. కెమెరా, బ్లూటూత్, వై-ఫై వంటివి ఇందులో లేవు. 4G, 5G నెట్‌వర్క్‌లకు కూడా ఇది సపోర్ట్ చేయదు. కేవలం 2G కనెక్టివిటీతో పనిచేస్తూ కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లకే యూజ్ అవుతుంది.
ఇండియాలో నోకియా 1100 కొనాలనుకునేవాళ్లు అన్నిటికంటే ముందుగా గమనించాల్సింది నెట్‌వర్క్ సపోర్ట్ గురించే. ఈ ఫోన్ కేవలం 2G నెట్‌వర్క్‌పై మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి తమ ఏరియాలో తమ సిమ్ ఆపరేటర్ ఇంకా 2G సేవలు అందిస్తున్నాడా? లేదా? అనేది చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే కొన్ని టెలికాం సంస్థలు పాత నెట్‌వర్క్ సేవలను క్రమంగా తగ్గించేస్తున్నాయి. అలాంటి చోట ఈ ఫోన్ తీసుకున్నా ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. నోకియా 1100 మెుబైల్ కోసం డబ్బు పెట్టే ముందు నెట్‌వర్క్ ప్రొవైడర్‌ను అడిగి 2G లభ్యత గురించి క్లారిటీ తెచ్చుకోవడం మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న ధరలు, లభ్యత అంచనా మాత్రమే. అమ్మేవారు, ఫోన్ కండిషన్, స్టాక్‌ను బట్టి ఇవి మారవచ్చు. కొనుగోలు చేసే ముందు అన్ని వివరాలను, సెల్లర్ నిబంధనలను జాగ్రత్తగా పరిశీలించండి.
Also Read: బంగారం ధరలకు భారీ షాక్.. ఒక్కరోజు రూ. 5 వేలకు పతనం! ధరలు ఎలా ఉన్నాయి.