Instagram Story Editing: ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఎంతో ఇష్టంగా ఒక స్టోరీ పోస్ట్ చేస్తాం. కానీ అది లైవ్ అయ్యాక చూస్తే.. టెక్స్ట్‌లో ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ కనిపిస్తుంది లేదా పెట్టిన మ్యూజిక్ అంతగా సెట్ కాలేదనిపిస్తుంది. ఇప్పటివరకు ఇలా జరిగితే, ఆ స్టోరీని పూర్తిగా డిలీట్ చేసి మళ్లీ మొదటి నుంచి అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. దీనివల్ల అప్పటివరకు వచ్చిన వ్యూస్, లైక్స్, రిప్లైస్ అన్నీ పోయేవి. అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ ఒక సూపర్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
కొత్త అప్‌డేట్ ప్రకారం.. మీరు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ చేసిన 15 నిమిషాల లోపు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. స్టోరీలోని టెక్స్ట్ మార్చడం, స్టిక్కర్లు సరిచేయడం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మార్చడం లేదా గీసిన డూడుల్స్‌ను కూడా రీ-డూ చేయడం సాధ్యమవుతుంది. దీనివల్ల మీ స్టోరీకి వచ్చిన ఎంగేజ్‌మెంట్ ఏమాత్రం తగ్గకుండానే కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు.
ఈ ఫీచర్‌ను వాడటం చాలా సులభం. మీరు పోస్ట్ చేసిన స్టోరీని ఓపెన్ చేసి, కుడివైపు కింద ఉన్న మూడు చుక్కల మెనూపై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే Edit Story ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు.. మీకు కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు. అయితే, ఒకసారి స్టోరీని ఎడిట్ చేస్తే, ఆ స్టోరీ పైన చిన్నగా Edited అనే లేబుల్ కనిపిస్తుంది. దీనివల్ల చూసేవాళ్లకు ఇందులో మార్పులు జరిగాయని సులభంగా అర్థమవుతుంది.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర పోస్టులపై మెటా కొరడా.. అల్గారిథమ్‌లో భారీ మార్పులు!
కేవలం ఎడిటింగ్ మాత్రమే కాకుండా.. స్టోరీ ఇంటర్‌ఫేస్‌ను కూడా ఇన్‌స్టాగ్రామ్ మరింత ఆకర్షణీయంగా మార్చింది. బ్లర్, గ్రేడియంట్ బ్యాక్‌గ్రౌండ్‌లతో పాటు కొత్త ఫాంట్లు, కలర్స్‌లో స్టిక్కర్ ఆప్షన్లను జోడించింది. అంతేకాకుండా.. ఒకేసారి మల్టిపుల్ ఫోటోలను సెలెక్ట్ చేసి స్టోరీగా షేర్ చేయడం ఇప్పుడు మరింత సులభమైంది.
ఈ అప్‌డేట్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ మరికొన్ని కీలక మార్పులను కూడా తీసుకొచ్చింది. క్రియేటర్ల వీడియోలను ఇతరులు అనుమతి లేకుండా ఇన్‌స్టా లేదా ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ వచ్చేలా కొత్త టూల్‌ను ప్రవేశపెట్టింది. అలాగే టీనేజర్ల భద్రత కోసం వయసును గుర్తించే ఏఐ టెక్నాలజీని ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
ఇటీవలే మనల్ని ట్యాగ్ చేసిన పోస్టులను నేరుగా మెయిన్ ప్రొఫైల్ గ్రిడ్‌లో పెట్టుకునే సదుపాయాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్ కల్పించిన విషయం తెలిసిందే. మొత్తం మీద ఈ కొత్త అప్‌డేట్స్ కంటెంట్ క్రియేటర్లకు, సాధారణ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.