ఐఫోన్ రేటు దాదాపుగా లక్ష రూపాయల దగ్గర్లో ఉంటుంది. ఫీచర్లను బట్టి కాస్త అటు ఇటుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ రేటు ఏకంగా 3 లక్షలకు చేరుకుంటుందా..? ఐఫోన్ రేటు మూడు రెట్లు పెరిగిపోతుందా..? తాజా పరిస్థితులను గమనిస్తే ఐఫోన్ రేటు భారీగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వ్యవహారాలను చిందరవందరగా మార్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే దీనికి కూడా కారణం కావడం ఇక్కడ విశేషం.
ట్రంప్ ఉపదేశం..
ఐఫోన్లు తయారు చేసే యాపిల్ సంస్థ అమెరికాకు చెందినది. ఇతర దేశాల్లో కూడా ఈ కంపెనీకి తయారీ యూనిట్లు ఉన్నాయి. ఆయా దేశాలు ఇచ్చే రాయితీలు, మార్కెటింగ్ సౌకర్యాల వల్ల యాపిల్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తుల్లో 80శాతం చైనాలో తయారవుతున్నాయి. అయితే ఈ తయారీలో కొంత భాగాన్ని భారత్ కి మార్చేందుకు యాపిల్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెలుగులోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీన్ లోకి వచ్చారు. యాపిల్ ఉత్పత్తుల్ని ఇకపై అమెరికాలోనే తయారయ్యేలా చూడాలని ఆయన ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ కి సూచించారు. అమెరికా అధ్యక్షుడి సూచన అంటే అది ఆదేశంగానే పరిగణించాలి. అందుకే యాపిల్ ఉత్పత్తి ఇప్పుడు అమెరికాకి తరలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే యాపిల్ సంస్థ ఉత్పత్తుల రేట్లు అమాంతం పెరిగిపోతాయి.
ఆపిల్ సంస్థ గతేడాది 22 బిలియన్ డాలర్లకు పైగా విలువైన ఐఫోన్లను భారత్ లో ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం మన దేశంలో మూడు తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరో రెండు యూనిట్లు మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. అయితే ట్రంప్ నిర్ణయంతో ఈ రెండు యూనిట్ల ఏర్పాటు అయోమయంలో పడింది. ఇండియాలో తయారయ్యే ఐఫోన్ ని ఇక్కడ మనం కొనాలంటే లక్ష రూపాయల వరకు ధర ఉంటుంది. ఇదే ఫోన్ ని అమెరికాలో తయారు చేసి, ఇండియాకు దిగుమతి చేసుకుంటే దాని రేటు దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వెయ్యి డాలర్ల విలువైన ఐ ఫోన్ 3వేల డాలర్లకు చేరుకుంటుందనమాట. ఇక్కడ లాభం కేవలం అమెరికాకు మాత్రమే సొంతమవుతుంది కానీ యాపిల్ కంపెనీకి కలిగే ప్రయోజనం ఏదీ ఉండదు.
తయారీ ఎక్కడ అనేది యాపిల్ సంస్థకు అనవసరం. ఎంత సేల్స్ జరిగాయనేదే యాజమాన్యానికి అవసరం. కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం తమ దేశంలోనే ఉత్పత్తి జరగాలని పట్టుబడుతోంది. ట్యాక్స్ ల ద్వారా వచ్చే ఆదాయం వారికి అవసరం. ఒకవేళ అమెరికాలోనే ఐఫోన్ల ఉత్పత్తి జరగాలంటే అది ఒకరకంగా యాపిల్ సంస్థకు నష్టంకూడా. రేట్లు భారీగా పెంచితే డిమాండ్ తగ్గుతుంది, తద్వారా ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అమెరికా ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోడానికి యాపిల్ నిర్వాహకులు అంత సాహసం చేస్తారా, లేక భారత్ వంటి దేశాల్లో తయారీ యూనిట్లను పెంచుకుని వ్యాపారాన్ని మరింత విస్తరించుకుంటారా..? వేచి చూడాలి.