New Covid-19 Symptoms: ఆసియా దేశాలైన హాంకాంగ్ , సింగపూర్‌లలో కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కరోనాతో పాటు అడినోవైరస్ , రైనోవైరస్ వంటి ఇతర శ్వాసకోశ వైరస్‌ల వ్యాప్తి పెరుగుతోంది. ఈ వైరస్‌లు బాధితుల్లో వివిధ లక్షణాలను కలిగిస్తున్నాయి. వీటి తీవ్రత ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి మారుతోంది ఈ లక్షణాలను వివరంగా తెలుసుకోవడం ద్వారా వైరస్‌ను సకాలంలో గుర్తించి చికిత్స పొందడం సాధ్యమవుతుంది.
కరోనా వైరస్ (కోవిడ్-19) లక్షణాలు:
కరోనా వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై ప్రధానంగా ప్రభావం చూపిస్తుంది. హాంకాంగ్, సింగపూర్‌లో నమోదైన కేసులలో కనిపిస్తున్న సాధారణ లక్షణాలు ఇవే..
జ్వరం: శరీర ఉష్ణోగ్రత 102°F లేదా అంతకంటే ఎక్కువగా ఉండటం, తరచూ వణుకుతో జ్వరం రావడం.
దగ్గు: నిరంతర దగ్గు, కొన్ని సందర్భాల్లో శ్లేష్మంతో కూడిన దగ్గు.
గొంతు నొప్పి: గొంతులో మంట, అసౌకర్యం లేదా మింగడంలో ఇబ్బంది.
జలుబు , ముక్కు కారడం: నాసికా స్రావం, ముక్కు దిబ్బడ లేదా ముక్కు కారడం.
శ్వాసకోశ సమస్యలు: ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బరువు లేదా నొప్పి.
ఒళ్లు నొప్పులు, తలనొప్పి: శరీరం మొత్తం నొప్పులు, కండరాల నొప్పి, తీవ్రమైన తలనొప్పి.
అలసట: అసాధారణ అలసట లేదా శక్తి లేకపోవడం.
తీవ్రమైన కేసుల్లో: న్యుమోనియా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు (వాంతులు, డయేరియా), లేదా ఆక్సిజన్ స్థాయిలలో తగ్గుదల.
అడినోవైరస్:
అడినోవైరస్ శ్వాసకోశ వ్యవస్థతో పాటు ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. హాంకాంగ్‌లో ముఖ్యంగా చిన్న పిల్లలలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది.
లక్షణాలు:
జ్వరం: ముఖ్యంగా 13-17 నెలల వయస్సు గల పిల్లలలో సాధారణం.
కండ్లకలక: కళ్లు ఎర్రబడడం, కంజంక్టివైటిస్ లేదా కళ్ల నుండి నీరు కారడం.
శ్వాసకోశ లక్షణాలు: దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, లేదా శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బంది.
గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు: డయేరియా, వాంతులు లేదా కడుపు నొప్పి.
రైనోవైరస్ :
రైనోవైరస్ సాధారణంగా జలుబు లక్షణాలను కలిగిస్తుంది. ఇది కరోనా కంటే తేలికమైన లక్షణాలను కలిగిస్తుంది. సింగపూర్‌లో ఈ వైరస్ కూడా వ్యాప్తిలో ఉంది.
లక్షణాలు:
జలుబు లక్షణాలు: ముక్కు కారడం, గొంతు నొప్పి, తేలికపాటి దగ్గు.
తలనొప్పి: తేలిక నుండి మోస్తరు తలనొప్పి.
శ్వాసకోశ సమస్యలు: కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా గురక.
అలసట: శరీరంలో బలహీనత.
హాంకాంగ్‌లో మే 3, 2025 నుండి కరోనా కేసులు వేగంగా పెరిగాయి. ముఖ్యంగా 13, 17 నెలల చిన్నారులలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఇది అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో వేగంగా వ్యాపిస్తోంది. సింగపూర్‌లో ఒక వారంలో 14,200 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు. ఈ ప్రాంతాల్లో బూస్టర్ డోసులు తీసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని, అంతే కాకుండా శానిటైజేషన్ కొనసాగించాలని సూచనలు జారీ చేశారు.
Also Read: మొలకెత్తిన వేరుశనగ తింటే.. ఆశ్చర్యకర లాభాలు !
పై లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్య సహాయం తీసుకోవడం , PCR లేదా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, బూస్టర్ డోస్ వ్యాక్సిన్ తీసుకోవడం వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడతాయి. వృద్ధులు . దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.