చైనా ఓ అద్భుతాన్ని సాధించింది. అయితే దాన్ని కాస్త ఆలస్యంగా బాహ్య ప్రపంచానికి చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ 26, 27 మధ్య నిర్వహించిన ఈ ప్రయోగం, భూమి నుండి చంద్రునిపైకి పగటిపూట లేజర్ లైట్ ని పంపించడం. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు తాజాగా చైనా ప్రకటించింది. సాధారణంగా ఇలాంటి ప్రయోగాలను రాత్రివేళ నిర్వహిస్తారు. సూర్యకాంతిలో లేజర్ లైట్ల ప్రామాణికత కచ్చితత్వంతో ఉండదనే ఉద్దేశంతో రాత్రివేళ చంద్రుడిపైకి లేజర్ కాంతి తరంగాల్ని పంపిస్తారు. కానీ చైనా పగటిపూట విజయవంతంగా ఈ ప్రయోగం చేపట్టింది. సెంటీమీటర్ లోపు కచ్చితత్వాన్ని సాధించింది.
80వేల మైళ్లు..
భూమినుంచి చంద్రుడికి సగటు దూరం 2.4 లక్షల మైళ్లు. ఇందులో మూడోవంతు ప్రాంతంలో చైనా ఓ ఉపగ్రహాన్ని ఉంచింది. దానిపేరు టియాండు-1. ఈ ఉపగ్రహాన్ని చంద్రుడిపై ప్రయోగాలకోసం అంతరిక్షంలోకి పంపించింది చైనా. ఈ ఉపగ్రహం పైన లేజర్ రెట్రోఫ్లెక్టార్ ని అమర్చారు. భూమిపైనుంచి లేజర్ ని ఈ రెట్రోఫ్లెక్టార్ పైకి పంపించారు. దానిపై ప్రతిబింబించి, తిరిగి అది ప్రయోగించిన చోటకే రావడం గమనార్హం. పగటిపూట సూర్యకాంతిలో ఈ లేజర్ ప్రయోగం చేయడం ఆసక్తిగా మారింది. లేజర్ లైట్ ప్రయోగం విజయవంతమైందనడానికి ప్రధాన సంకేతం.. మనం పంపించిన కాంతిపుంజం తిరిగి ప్రయోగించిన ప్రాంతానికి రావడం. అంటే మనం ఎక్కడ దాన్ని ప్రయోగించామో, అక్కడ్నుంచి అది కచ్చితంగా పరావర్తనం చెందడం. టియాండు-1 పై ఉన్న రెట్రోఫ్లెక్టార్ ని చైనా లేజర్ కచ్చితంగా గుర్తించడం, అక్కడ్నుంచి తిరిగి పరావర్తనం చెంది DSEL కేంద్రాన్ని చేరడంతో ఈ ప్రయోగం విజయవంతమైనట్టు తెలుస్తోంది.
ఈ ప్రయోగంతో భవిష్యత్ కార్యకలాపాలకు చైనా కొత్త ప్రమాణాలను నిర్దేశించినట్టు తెలుస్తోంది. చంద్రుడిపైకి లేజర్ లైట్ ప్రయోగాలు గతంలో జరిగినా, పగటిపూట దీన్ని నిర్వహించడంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్టయింది చైనా. చైనాకు చెందిన డీప్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ లాబొరేటరీ (DSEL) ఈ ప్రయోగాన్ని చేపట్టింది. చంద్రుడిపై నావిగేషన్, అంతరిక్ష సమాచార మార్పిడిలో ఈ ప్రయోగంతో మరో ముందడుగు పడినట్టయింది.
2030 నాటికి చైనా చంద్రుడిపైకి మానవస సహిత వాహక నౌకను పంపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలోని జిన్హువా ఏజెన్సీ దీనికోసం ప్రయత్నాలు చేస్తోంది. తాజా లేజర్ ప్రయోగంద్వారా మానవ సహిత యాత్రల విషయంలో మరింత పురోగతి సాధించినట్టయింది. మెరుగైన కచ్చితత్వంతో కూడిన ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రుడిపై ల్యాండర్లు, రోవర్లను ట్రాక్ చేయడానికి ఈలేజర్ మిషన్ సాంకేతికత సహాయపడుతుందని అంటున్నారు.
లేజర్ లైట్ ప్రయోగం ద్వారా కచ్చితమైన కక్ష్య కొలతలు, కచ్చితమైన కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. అంతే కాదు, చంద్రుడిపై శాశ్వతంగా నీడలో ఉన్న క్రేటర్ల వైపు కూడా రోవర్లను పంపించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ లోతైన క్రేటర్‌లు మంచుతో కప్పబడి ఉన్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ పరిశోధనలు ఫలవంతం అయితే చంద్రుడిపై కృత్రిమ వాతావరణాన్ని సృష్టించడం సాధ్యమవుతుంది. చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఉన్నాయి. భారత్ కూడా చంద్రుడిపై పరిశోధనలకోసం మరింతగా కృషి చేస్తోంది. ఈ దశలో చైనా ప్రయోగం అన్ని దేశాల అంతరిక్ష పరిశోధనలకు కొత్త ఉత్సాహాన్నిచ్చినట్టయింది.