Covid:- కోవిడ్ అనే మహమ్మారి మన జీవితాల నుండి పోయింది అని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నా కూడా అది ఏదో ఒక రూపంలో ఆరోగ్యంపై చూపిస్తూనే ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటివరకు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల, ఇదివరకు కోవిడ్ సోకిన వారి ఇతర అనారోగ్య సమస్యల వల్ల పలువురు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కున్నారు. అంతే కాకుండా ఒకప్పుడు కోవిడ్ సోకినవారిలో డయాబెటీస్ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.
కోవిడ్ 19 బారిన పడిన పేషెంట్లలో 3 నుండి 5 శాతం వారికి డయాబెటీస్ సోకుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మామూలుగా చెప్పాలంటే కోవిడ్ సోకిన ప్రతీ 20 మందిలో ఒకరికి డయాబెటీస్ అటాక్ అవుతున్నట్టు తెలుస్తోంది. బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ప్రకారం సార్స్ కోవ్ 2 వైరస్ డయాబెటీస్ రిస్క్‌ను పెంచుతుందని వారు నిర్ధారణకు వచ్చారు. అంతే కాకుండా కొందరి శరీరంలో బ్లడ్, గ్లూకోజ్‌పై కూడా కోవిడ్ అనేది నిరంతరంగా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు.
ఇదివరకు కోవిడ్ సోకిన మహిళల కంటే పురుషులకే డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు బయటపెట్టారు. రెండుకంటే ఎక్కువసార్లు కోవిడ్ సోకి ఆసుపత్రిలో చేరిన వారు కచ్చితంగా డయాబెటీస్ టెస్ట్ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. మూడుకంటే ఎక్కువసార్లు కోవిడ్ తీవ్రంగా అటాక్ అయ్యింటే మాత్రం డయాబెటీస్ సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. ఇప్పటికే డయాబెటీస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమందిని ఇబ్బంది పెడుతున్న వ్యాధిగా ఉండగా.. కోవిడ్ వల్ల కూడా డయాబెటీస్ అటాక్ అవుతుందని తెలిసిందని ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు.
డయాబెటీస్ కేసులు ఎక్కువవ్వడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హెల్త్ కేర్ సిస్టమ్స్‌పై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తుంది. కోవిడ్ కోసం పీసీఆర్ టెస్ట్ చేయించుకున్న 6,29,935 పేషెంట్ల మెడికల్ రికార్డ్స్‌ను శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయిన 17 శాతం మందికి ఏడాదిలోపు డయాబెటీస్ అటాక్ అయ్యే ఛాన్స్ ఉందని వారు హెచ్చరిస్తున్నారు. మగవారిలో ఈ రిస్క్ 22 శాతం ఎక్కువగా ఉంటుందన్నారు. కోవిడ్ వల్ల నిరంతర సమస్యలు ఉంటాయని, వాటికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెల్త్ సిస్టమ్స్‌కు ఇది ఒక హెచ్చరిక లాంటిది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.