Anthropic CEO Dario Amodei: కృత్రిమ మేధ సృష్టిస్తున్న ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ విపణిని అతలాకుతలం చేస్తున్నాయి. నిన్నటి వరకు మనిషి మెదడుకు మాత్రమే సాధ్యమని భావించిన పనులను నేడు ఏఐ టూల్స్ చిటికెలో పూర్తి చేస్తున్నాయి. ఈ క్రమంలో టెక్ పరిశ్రమలో ఇప్పటికే భారీ స్థాయిలో లేఆఫ్‌లు చోటుచేసుకున్నాయి. అయితే, ఏఐ ప్రభావంతో అసలు ఏ రకమైన ఉద్యోగాలు మొదట కనుమరుగవుతాయి? ఏ రంగాల్లో ఏఐ ఆధిపత్యం పెరుగుతుంది? అనే ప్రశ్నలకు ఆంథ్రోపిక్ (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. జిరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా డారియో ఏఐ భవిష్యత్తుపై తన విశ్లేషణను పంచుకున్నారు. ఆ వివరాలతో కూడిన కథనం ఇక్కడ ఉంది.
ఏఐ ఆటోమేషన్ కారణంగా అందరికంటే ముందుగా ప్రభావితమయ్యేది కోడింగ్ ఉద్యోగాలేనని డారియో అమోడెయ్ స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్ రాయడంలో ఏఐ వ్యవస్థలు అసాధారణమైన వేగాన్ని, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం కొన్ని సూచనలతో సంక్లిష్టమైన కోడ్‌ను ఏఐ జనరేట్ చేయగలగడం వల్ల జూనియర్ లెవల్ కోడింగ్ పనులకు మనుషుల అవసరం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అయితే, కోడింగ్‌తో పోలిస్తే సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ సెన్స్, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం వంటి ఇంజినీరింగ్ విభాగాలను ఆటోమేట్ చేయడానికి కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మనుషులు చేస్తున్న చాలా పనులను భవిష్యత్తులో ఏఐ టేకోవర్ చేసినప్పటికీ, మానవ ప్రమేయం పూర్తిగా పోదని డారియో వివరించారు. ఏఐ టూల్స్‌ను సరైన దిశలో నడిపించడం, ఉన్నతస్థాయి వ్యూహాలను రూపొందించడం వంటి పనుల్లో మనుషులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏఐ అద్భుతమైన ఫలితాలను ఇచ్చినప్పటికీ, దానిపై అతిగా ఆధారపడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. దీనివల్ల మనుషులలోని తార్కిక ఆలోచనా శక్తి క్షీణించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యారంగంపై ఏఐ ప్రభావం గురించి కూడా డారియో కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు తమ ఆలోచనా శక్తిని వాడకుండా, అసైన్‌మెంట్లు లేదా ప్రాజెక్టుల కోసం ఏఐని వాడుతూ “థింకింగ్ స్కిల్స్”ను ఔట్‌సోర్స్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐని సరైన పద్ధతిలో వాడుకోకుండా కేవలం సులభమైన దారిగా భావించి దుర్వినియోగం చేస్తే, అది మానవ మూర్ఖత్వానికి దారితీస్తుందని హెచ్చరించారు. భవిష్యత్తులో కేవలం నైపుణ్యాల కంటే కూడా ‘క్రిటికల్ థింకింగ్’ అనేది యువతకు అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారుతుందని ఆయన సలహా ఇచ్చారు.
చివరగా, తన వ్యక్తిగత ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ.. తాను ఆంథ్రోపిక్‌ను స్థాపించడానికి ముందు ఒక బయోలజిస్ట్‌నని, నిరంతర అన్వేషణ, విభిన్న రంగాల పట్ల అవగాహన తనను ఈ స్థాయికి చేర్చాయని డారియో అమోడెయ్ వెల్లడించారు. టెక్ ప్రపంచంలో వస్తున్న ఈ మార్పులను అందిపుచ్చుకోవాలంటే యువత నిరంతరం అప్‌డేట్ అవుతూ, తమలోని విశ్లేషణాత్మక నైపుణ్యాలను పదును పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.