భూ భ్రమణానికి, మానవ జీవన గమనానికి సంబంధం ఉంటుందా? కచ్చితంగా ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే భూ భ్రమణం వల్లే రాత్రి, పగలు ఏర్పడతాయి. రోజు అనేది ఏర్పడటానికి కారణం భూ భ్రమణమే. ఆ రోజు వల్లే మన జీవన క్రియలు ప్రభావితం అవుతాయి. పగలు, రాత్రి వేళలు నిర్థారించుకుని మరీ మన జీవన గడియారం పని చేస్తుంది. అయితే భూ భ్రమణ వేగం ఈ పగలు, రాత్రి సమయాలను నిర్దేశిస్తుంది. అంతే కాదు, ఈ వేగం వల్లే భూమిపై ఆక్సిజన్ శాతం కూడా మారిపోతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
తగ్గుతున్న వేగం..
భూమి వేగం క్రమక్రమంగా తగ్గుతోందని శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనల ద్వారా గ్రహించారు. అంటే భూమి ఏర్పడినప్పుడు ఇప్పటిలాగా రోజుకి 24 గంటలు ఉండేవి కావు. కేవలం 18 గంటలు మాత్రమే. అయితే అప్పుడు భూమి వేగం ఎక్కువ. అందుకే 18 గంటల్లోగా భూమి ఒక ఆత్మ భ్రమణం చేసేది. కానీ ఇప్పుడు అదే భ్రమణానికి 24గంటలు సమయం తీసుకుంటోంది. ఇది వెంటనే వచ్చిన మార్పు కాదు. కొన్ని వేల సంవత్సరాల మార్పు. ఒక శతాబ్దానికి భూమి 2 మిల్లీ సెకన్ల వేగాన్ని కోల్పోతుంది, అంటే నెమ్మదిగా తిరుగుతుందన్నమాట. అలా నెమ్మదిగా తిరగడం మొదలు పెట్టి చివరకు వేగం బాగా తగ్గి తన చుట్టూ తాను తిరిగేందుకు 24గంటలు సమయం తీసుకుంటోంది.
ఏం జరుగుతుంది?
భూమి వేగం తగ్గడం వల్ల చాలా మార్పులే గమనించవచ్చు. అందులో ముఖ్యమైనది భూమిపై ఆక్సిజన్ పరిమాణం పెరగడం. అదేంటి? భూ భ్రమణానికి ఆక్సిజన్ పరిణామానికి లింకేంటి అనుకుంటున్నారా? శాస్త్రవేత్తలు ఆ విషయంపైనే ప్రయోగాలు చేసి దాన్ని నిర్థారించారు. భూమి ఏర్పడినప్పుడు సైనో బ్యాక్టీరియా తొలితరం జీవిగా ఉండేది. సుమారు 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం కిరణజన్య సంయోగక్రియ ద్వారా సూర్యరశ్మిని ఆక్సిజన్‌గా మార్చిన మొదటి జీవి సైనోబాక్టీరియా. ఈ పురాతన సూక్ష్మజీవులు.. ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. అలా ఆక్సిజన్ పరిణామం పెరగడం వల్ల సంక్లిష్ట జీవితానికి మార్గం సుగమం అయింది.
సూర్యరశ్మి ద్వారా..
సూర్యరశ్మి ఉన్న సమయంలోనే సైనో బ్యాక్టీరియాలు ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తాయి. రోజుకి 18 గంటలు మాత్రమే సమయం ఉంటే కేవంల 9 గంటలు మాత్రమే అవి ఆక్సిజన్ ని ఉత్పత్తి చేసేవి. కానీ ఆ సమయం పెరిగే కొద్దీ ఆక్సిజన్ ఉత్పత్తి కూడా పెరుగుతోందిట. అలా ఇప్పుడు రోజుకి 12 గంటలపాటు సూర్యరశ్మి ఉన్నంత సేపు సైనో బ్యాక్టీరియా ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తోంది. అంటే భూమి బద్దకించి నెమ్మదిగా తిరగడం వల్ల పరోక్షంగా భూమిపై ఆక్సిజన్ శాతం పెరుగుతోంది. దీనివల్ల సంక్లిష్ట జీవన చర్యలు మరింత మెరుగవుతున్నాయి. అధిక సూర్యరశ్మి వల్ల సైనో బ్యాక్టీరియా సంయోగక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, వాతావరణంలోకి స్థిరంగా ఆక్సిజన్‌ను విడుదల చేస్తోంది. ఆక్సిజన్ స్థాయి పెరగడం అంటే భూమిపై జీవ క్రియల వేగం పెరగడమే అని అర్థం చేసుకోవాలి. దీనివల్ల లాభమే కానీ, నష్టం లేదని అంటున్నారు శాస్త్రవేత్తలు.