Little Hearts Movie Review: ప్రస్తుత కాలంలో సినిమా అంటే కేవలం వినోదం అనే నమ్మే దర్శకులు కూడా చాలామంది ఉన్నారు. అయితే అలాంటి దర్శకులు సక్సెస్ కూడా అవుతున్నారు. లాజిక్స్ ఏమీ అవసరం లేదు జస్ట్ మూడు గంటల పాటు ప్రేక్షకుడిని నవ్విస్తే చాలు అని బలంగా నమ్మి కొంతమంది సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అనుదీప్ కె.వి దర్శకత్వంలో వచ్చిన జాతి రత్నాలు సినిమా అలాంటిదే, కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మ్యాడ్ సినిమా కూడా అలాంటిదే. ఇప్పుడు అదే కోవాలోకి చేరుతుంది, సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన లిటిల్ హార్ట్స్ సినిమా. రేపు విడుదల కాబోయే ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఆల్రెడీ కొన్నిచోట్ల మొదలైపోయాయి. ఈ లిటిల్ హార్ట్స్ ఎంతమంది హార్ట్స్ ను గెలిచిందో ఇప్పుడు చూద్దాం.
కథ : వాస్తవానికి పెద్దగా చెప్పుకునే కథ ఈ సినిమాలో మనం కనిపించదు. సైనిక్ పూర్ లో ఉండే అఖిల్ అనే ఒక అబ్బాయి లైఫ్ లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ ని దర్శకుడు కథగా మలిచాడు. ప్రతి తండ్రి కోరుకున్నట్లే సినిమాలో అఖిల్ తండ్రి కూడా తన కొడుకు మంచి ప్రయోజకుడు అవ్వాలి అనుకుంటాడు. బీటెక్ చదివితే మంచి ప్రయోజకుడు అయిపోయినట్లే అనే ఆలోచనతో ఉంటాడు. కానీ అఖిల్ కి సొంత ఇష్టాలు కొన్ని ఉంటాయి. ఎంసెట్లో ఫెయిల్ అయినందువలన అఖిల్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అవుతాడు. అక్కడ కాత్యాయిని పరిచయం అవుతుంది. వీళ్ళిద్దరి మధ్య జరిగే కథ ఈ సినిమా. అఖిల్ (Mouli) క్యాత్యాయిని (Shivani Nagaram) మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.? అది ఎలా ప్రేమకు దారితీసింది.? చివరకు ఇద్దరు ఒకటయ్యారా అనేది సినిమా కథాంశం.
విశ్లేషణ:
ప్రతి దర్శకుడికి సినిమా తీసినప్పుడు మైండ్ లో ఒక ఉద్దేశం ఉంటుంది. అలానే సాయి మార్తాండ్ ఈ సినిమా రాసినప్పుడు కేవలం ప్రేక్షకుడిని నవ్విద్దాం అనే ఉద్దేశాన్ని పెట్టుకున్నట్లు ఉన్నాడు. అదే శైలిలో సినిమాను తెరకెక్కించాడు. 90 స్ కిడ్స్ జీవితాల్లో ఉన్న కొన్ని అంశాలను, వాళ్లు ఎక్స్పీరియన్స్ చేసిన అనుభూతులను వెండితెరపై ఆవిష్కరించాడు. అలా ఆవిష్కరించడంలో కూడా బానే సక్సెస్ అయ్యాడు. అందుకే కథను మొదలుపెట్టేటప్పుడే జియో సిమ్ కు రాకముందు జియో సిమ్ వచ్చిన తర్వాత అంటూ మొదలుపెట్టారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు.
మౌళి యాక్టింగ్ చాలా నేచురల్ గా అనిపించింది. ముఖ్యంగా మౌళి కామిక్ టైమింగ్ చాలా మందికి తెలిసిందే. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే తన యూట్యూబ్ వీడియోస్ తో చాలా మందిని ఆకర్షించాడు మౌళి. ఈ సినిమాలో కూడా అదే స్థాయిలో అందరినీ ఆకట్టుకుని నవ్వించాడు. ఉన్న పరిధిలో శివాని నాగారం బాగా చేసింది. తండ్రి పాత్రలో నటించిన రాజీవ్ కనకాల ఫర్ఫెక్ట్. సినిమా చివరి వరకు రాజీవ్ కనకాల ఉంటారు. మౌళి స్నేహితులుగా నటించిన నిఖిల్ అబ్బూరి, అలానే మధు అనే పాత్రలో చేసిన వ్యక్తి కూడా విపరీతంగా నవ్వించారు. ముఖ్యంగా మధు అనే పాత్ర కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది.
ముఖ్యంగా ఈ సినిమాకి మంచి ప్లస్ పాయింట్ సింజిత్ అందించిన మ్యూజిక్. పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ముఖ్యంగా ఒక సాడ్ సాంగ్ ని ఫన్నీ వేలో కంపోజ్ చేసిన విధానం ప్రేక్షకుడిని విపరీతంగా నవ్వించింది. బాధని ఆనందాన్ని ఒకే పాటలో చెప్పడం కొత్తగా అనిపించింది. ఆశ్చర్యకరంగా ఆ పాటలోని ఇదేం పాట రా అనే లిరిక్ కూడా వస్తుంది.
ఓవరాల్ గా ఈ సినిమా చూస్తుంటే నవ్వుకుంటూ వెళ్లిపోతాం కాబట్టి పెద్దగా తప్పులు ఎవరు కనిపెట్టారు. అలానే అంత పెద్ద తప్పులు కూడా ఈ సినిమాలో ఉండవు. కేవలం ఆడియన్స్ ని నవ్వేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చాలా విషయాలను దాటేశారు.
అయితే సినిమా క్లైమాక్స్ కు ముందు ఫ్రీ క్లైమాక్స్ లో సినిమాను లాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. వాస్తవానికి సినిమాను కొన్ని సందర్భాలలో ఎండ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు చాలా సినిమాల్లో కూడా అలా జరిగాయి. కానీ దర్శకుడు శుభం కార్డు వెయ్యాలి అని నిశ్చయించుకున్నట్లు సినిమాని చివరి వరకు నడిపాడు. కేవలం జియో సిమ్ వచ్చిన తర్వాత ఆపేయకుండా కోవిడ్ దాటిన తర్వాత కూడా సినిమా కథను చూపించాడు. క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా డీల్ చేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో కూడా నవ్వులు పూయించాడు. ఎడిటింగ్ విషయంలో కొద్దిపాటి దృష్టి పెట్టి సినిమాను ట్రిమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది.
ప్లస్ పాయింట్స్
రైటింగ్
మౌళి కామెడీ టైమింగ్
సింజిత్ మ్యూజిక్
సాహిత్యం
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
పెద్దగా స్టోరీ ఏం లేదు
లాజిక్స్ మిస్
సినిమా ప్రీ క్లైమాక్స్
కొన్ని లాగ్ సీన్స్
మొత్తంగా : లాజిక్కులు విడిచిపెడితే, లిటిల్ హార్ట్స్ కనెక్ట్ అయినట్లే
Rating: 2.75