Geyser Buying Tips: చలికాలం వచ్చిందంటే చాలు.. ఉదయం నిద్రలేవగానే చన్నీళ్లతో స్నానం చేయాలంటేనే చాలామందికి వణుకు పుడుతుంది. అందుకే వేడి నీళ్ల కోసం కొత్త గీజర్ కొనాలని చూస్తుంటారు. అయితే ఆన్‌లైన్‌లో మంచి ఆఫర్ కనిపించిందనో, తక్కువ ధరకు వస్తుందనో హడావుడిగా గీజర్ కొనేయకండి. ఎందుకంటే.. సరైన గీజర్ ఎంచుకోకపోతే ప్రతి నెలా కరెంట్ బిల్లు జేబుకు చిల్లు పెట్టడమే కాకుండా, కొన్ని సందర్భాల్లో భద్రతాపరమైన సమస్యలు కూడా ఎదురుకావచ్చు.
మార్కెట్లో ఇన్‌స్టంట్, స్టోరేజ్ వంటి రకరకాల గీజర్లు అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో మీ ఇంటికి ఏది సరిపోతుంది? ఎంత లీటర్ల కెపాసిటీ ఉండాలి? కొనేముందు ఎలాంటి ఫీచర్లు చెక్ చేయాలి? ఈ విషయాలు ముందే తెలుసుకుంటే డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు అనవసరమైన ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకోవచ్చు. అందుకే కొత్త గీజర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఈ విషయాలపై ఓ లుక్కేయండి!
గీజర్ కొనే ముందు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి. చిన్న ఫ్యామిలీ అయితే లేదా కిచెన్‌లో గిన్నెలు కడగడానికి మాత్రమే వేడినీళ్లు కావాలంటే 1 నుంచి 3 లీటర్ల ఇన్‌స్టంట్ గీజర్ సరిపోతుంది. ఇది తక్కువ స్థలంలో పట్టేస్తుంది, నీళ్లు కూడా త్వరగా వేడెక్కుతాయి. కానీ, ఇంట్లో నలుగురైదుగురు ఉండి అందరూ స్నానం చేయాలంటే మాత్రం 15 నుంచి 25 లీటర్ల స్టోరేజ్ గీజర్ తీసుకోవడం ఉత్తమం. చిన్నది తీసుకుంటే నీళ్లు వేడెక్కడానికి చాలాసేపు వెయిట్ చేయాలి, మరీ పెద్దది తీసుకుంటే కరెంట్ వృథా అవుతుంది. అలాగే మీరు అపార్ట్‌మెంట్లలో లేదా ఎత్తైన బిల్డింగ్‌లలో ఉంటుంటే.. ఎక్కువ వాటర్ ప్రెజర్‌ను తట్టుకునే గీజర్లనే తీసుకోవాలి, లేదంటే త్వరగా లీకయ్యే ప్రమాదం ఉంది.
చలికాలంలో ఇంట్లో కరెంట్ ఎక్కువగా లాగే వస్తువుల్లో గీజర్ ఒకటి. అందుకే గీజర్ కొనేటప్పుడు దానిపై ఉన్న బీఈఈ (BEE) స్టార్ రేటింగ్ తప్పకుండా చూడాలి. ఎప్పుడూ 4 లేదా 5 స్టార్ రేటింగ్ ఉన్న మోడల్స్ ఎంచుకోవాలి. ఇవి కొనేటప్పుడు కాస్త ధర ఎక్కువగా అనిపించినా.. ఆ తర్వాత కరెంట్ బిల్లు రూపంలో చాలా డబ్బులు ఆదా చేస్తాయి. అలాగే లోపల ఉండే హీటింగ్ ఎలిమెంట్ క్వాలిటీ కూడా చూడాలి. కాపర్ లేదా గ్లాస్ కోటింగ్ ఉన్న ఎలిమెంట్స్ నీటిని త్వరగా వేడి చేయడమే కాకుండా తుప్పు పట్టకుండా ఉంటాయి. మీ ఏరియాలో ఉప్పు నీరు వస్తుంటే.. సాధారణ ట్యాంక్ ఉన్న గీజర్లు కొన్ని నెలల్లోనే పాడైపోతాయి. కాబట్టి యాంటీ-కరోజివ్ కోటింగ్, పాలిమర్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ ఉన్న వాటినే ఎంచుకోండి.
Also Read: పిడుగులు పడే సమయంలో వైఫై రూటర్, స్మార్ట్ టీవీ ప్లగ్స్ తీసేయాలా? స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుందా?
కరెంట్, నీళ్లు రెండూ కలిసే చోట సేఫ్టీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు. కొత్త గీజర్ కొనేటప్పుడు అందులో ఆటోమేటిక్ థర్మల్ కట్-అవుట్ ఫీచర్ ఉందో లేదో చెక్ చేయండి. ఇది నీళ్లు ఒక స్థాయి వరకు వేడెక్కాక ఆటోమేటిక్‌గా పవర్ ఆఫ్ చేస్తుంది. దీనివల్ల ఓవర్ హీట్ అవ్వకుండా కరెంట్ ఆదా అవుతుంది. అలాగే ఐఎస్ఐ (ISI) మార్క్, ప్రెజర్ రిలీజ్ వాల్వ్ తప్పనిసరిగా ఉండాలి. ట్యాంక్ లోపల ఆవిరి ఎక్కువై ప్రెజర్ పెరిగినప్పుడు ఈ వాల్వ్ దాన్ని బయటకు పంపి, ట్యాంక్ పేలిపోయే ప్రమాదాన్ని అరికడుతుంది.
ధర మాత్రమే చూసి గీజర్ కొనొద్దు. ట్యాంక్, హీటింగ్ ఎలిమెంట్‌కు ఎంతకాలం వారంటీ ఇస్తారో విడిగా తెలుసుకోండి. కొన్ని బ్రాండ్లు ఎలిమెంట్‌కు రెండు లేదా మూడు ఏళ్లు, ట్యాంక్‌కు ఐదు నుంచి ఏడు ఏళ్ల వరకు వారంటీ ఇస్తాయి. మోడల్‌ను బట్టి నిబంధనలు మారతాయి కాబట్టి.. ఏ భాగాలు కవర్ అవుతాయో అడిగి తెలుసుకోండి. ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, మీ ప్రాంతంలో సర్వీస్ సెంటర్ వివరాలు తెలుసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అనవసర ఖర్చులు తప్పుతాయి. అవసరానికి సరిపోయే సామర్థ్యం, భద్రత, వారంటీ ఉన్న గీజర్‌ను ఎంచుకోవడం ముఖ్యం.
Also Read: రూటు మార్చిన సైబర్ దొంగలు.. బ్యాంకులు కాదు, ఆ యాప్స్ ద్వారానే నిలువు దోపిడీ.. కేంద్రం హెచ్చరిక!