Wi-Fi Router: వర్షాకాలంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడటం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయంలో ఇంట్లో టీవీ, ఫ్రిజ్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ఆఫ్ చేయాలని పెద్దలు చెబుతుంటారు. చాలామంది టీవీని రిమోట్‌తో, వైఫై రూటర్‌ను స్విచ్‌తో ఆఫ్ చేసి ఊరుకుంటారు. కానీ ఇలా చేస్తే నిజంగా మీ గాడ్జెట్లు సురక్షితంగా ఉంటాయా? ముఖ్యంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న స్మార్ట్ టీవీలు, వైఫై రూటర్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
టీవీని రిమోట్‌తో ఆఫ్ చేసినా.. ప్లగ్ సాకెట్‌లోనే ఉంటే విద్యుత్ లైన్‌తో దానికి కనెక్షన్ ఉంటుంది. పిడుగులు పడినప్పుడు విద్యుత్ సరఫరాలో ఒక్కసారిగా అధిక వోల్టేజ్ రావచ్చు. దీన్నే పవర్ సర్జ్ అంటారు. ఈ ప్రభావం వల్ల టీవీ, రూటర్ లోపల ఉండే సున్నితమైన చిప్స్, సర్క్యూట్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఒక్కసారి ఇలా జరిగితే రిపేర్ ఖర్చు కూడా ఎక్కువ కావచ్చు. అందుకే స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు ప్లగ్ కూడా తీసేయడం మంచిది.
చాలామంది విద్యుత్ వైర్ వల్లే ప్రమాదం ఉంటుందని అనుకుంటారు. కానీ వైఫై రూటర్‌కు బయట నుంచి వచ్చే బ్రాడ్‌బ్యాండ్ కేబుల్ ద్వారా కూడా పిడుగు ప్రభావం ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే టీవీకి కనెక్ట్ చేసిన లాన్ కేబుల్, యాంటెన్నా, సెట్‌టాప్ బాక్స్ వైర్ల ద్వారా కూడా విద్యుత్ ఉప్పెన వ్యాపించవచ్చు. అందుకే ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు రూటర్ పవర్ ప్లగ్‌తో పాటు ఇంటర్నెట్ కేబుల్‌ను కూడా డిస్‌కనెక్ట్ చేయాలి.
Also Read: రూటు మార్చిన సైబర్ దొంగలు.. బ్యాంకులు కాదు, ఆ యాప్స్ ద్వారానే నిలువు దోపిడీ.. కేంద్రం హెచ్చరిక!
పిడుగులు పడుతున్నప్పుడు టీవీ, వైఫై రూటర్, కంప్యూటర్ వంటి పరికరాల ప్లగ్స్ తీసేయడం మంచిది. అయితే వర్షం మొదలైన తర్వాత బయటకు వెళ్లి కేబుల్స్ తీయడానికి ప్రయత్నించకూడదు. తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్స్ ముట్టుకోవద్దు. ఇంట్లో ముందుగానే మంచి సర్జ్ ప్రొటెక్టర్ ఏర్పాటు చేసుకోవడం కూడా ఉపయోగపడుతుంది.
సర్జ్ ప్రొటెక్టర్ ఒక్కసారిగా వచ్చే వోల్టేజ్ మార్పుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను కాపాడటంలో సహాయపడుతుంది. అయితే పిడుగు నేరుగా పడినప్పుడు లేదా బలమైన విద్యుత్ ఉప్పెన వచ్చినప్పుడు ఇది పూర్తిస్థాయి రక్షణ ఇవ్వకపోవచ్చు. అందుకే ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉన్న సమయంలో వీలైతే పరికరాల ప్లగ్స్, సంబంధిత కేబుల్స్ ముందుగానే తీసేయాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతో భారీ నష్టం జరగకుండా చూడవచ్చు. ముఖ్యంగా పిడుగులు పడుతున్న సమయంలో ప్లగ్స్ తీయడానికి ప్రయత్నించకుండా, వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడే ఈ పని చేయాలి. భద్రత విషయంలో తొందరపడటం కంటే జాగ్రత్తగా ఉండటమే ముఖ్యం.
Also Read: రూ.20 వేల లోపు బ్రాండెడ్ 5G ఫోన్ కొనాలా? ఈ 4 శాంసంగ్ మోడల్స్‌పై ఓ లుక్కేయండి, ఫీచర్లు అదుర్స్!