Taara Technology: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో మరో విప్లవాత్మక ఆవిష్కరణ వచ్చేసింది. Google X సంస్థ అత్యాధునిక సిలికాన్ ఫోటోనిక్స్ టెక్నాలజీతో రూపొందించిన Taara చిప్ ఇప్పుడు మార్కెట్లోకి రాబోతోంది. ఇది ఓ చిన్న ఫింగర్‌నెయిల్ పరిమాణంలో ఉండి అద్భుతమైన సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈ చిప్, కేబుల్ అవసరం లేకుండా నేరుగా కాంతి కిరణాల (light beams) ద్వారా డేటాను ప్రసారం చేస్తుంది.
దూర ప్రాంతాల్లో కూాడా..
ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేయడం కష్టమైన లేదా ఖరీదైన ప్రాంతాల్లో, ఈ టెక్నాలజీ కొత్త మార్గాలను సృష్టించనుంది. ప్రత్యేకించి దూరమైన గ్రామాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో వేగవంతమైన, సమర్థవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్‌ను అందించడంలో Taara కీలక పాత్ర పోషించనుంది.
హై-స్పీడ్ ఇంటర్నెట్
Google X అభివృద్ధి చేసిన Taara చిప్, ప్రారంభ ఫీల్డ్ టెస్టుల ప్రకారం, ఒక కిలోమీటరు దూరంలో 10 Gbps వేగంతో డేటాను ప్రసారం చేయగలదు. ఈ టెక్నాలజీ ద్వారా ఇంటర్‌ఫియరెన్స్, కేబుళ్ల అవసరం లేకుండా ఇంటర్నెట్ సేవలు అందించడానికి గ్లోబల్ మెష్ నెట్‌వర్క్ రూపొందించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా, రిమోట్ సేవలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ను అందించడానికి ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడనుంది.
Read Also: Wireless Earbuds Offer: OnePlus వైర్లెస్ ఇయర్‌బడ్స్ పై …
Taara టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం రేడియో ఫ్రీక్వెన్సీలు లేదా ఫైబర్-ఆప్టిక్ కేబుళ్లు అవసరమవుతాయి. అయితే, Taara చిప్ డేటాను ప్రత్యేక లైట్ బీమ్‌ల ద్వారా సంకేతీకరించి ప్రసారం చేస్తుంది. దీని వల్ల సిగ్నల్ అంతరాయం తగ్గిపోతుంది. ఇదే సమయంలో పెద్దస్థాయిలో బడ్జెట్ ఖర్చులు తగ్గుతాయి.
గంటల్లోనే అమలు
ఈ టెక్నాలజీ వల్ల అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చని Taara ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ మహేష్ కృష్ణస్వామి అన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రయోజనం కలుగుతుందన్నారు. దీనిని అమలు చేయడంతోపాటు విస్తరించగల సామర్థ్యం ఈజీగా ఉంటుందని చెబుతున్నారు. సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్‌లను అమలు చేయాలంటే చాలా కాలం పడుతుంది. అవి సాధారణంగా భూగర్భంగా లైన్లు వేయడం, అధిక ఖర్చుతో కూడుకున్న నిర్మాణం చేయడం అవసరం. కానీ Taara సిస్టమ్‌ని కేవలం కొన్ని గంటల్లోనే అమలు చేయవచ్చు. ఇది ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌తో సమానమైన విధంగా పనిచేస్తుంది కానీ భౌతిక వైర్లు ఉండవు.
దీని వల్ల అనేక ప్రయోజనాలు
-తక్కువ ఖర్చుతో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించడం
-విస్తరించగల సామర్థ్యం ఎక్కువగా ఉండటం
-పర్యావరణానికి హాని లేకుండా అమలు చేయడం
-శరవేగంగా వ్యవస్థను ఏర్పాటు చేయగలగడం
ముందున్న ప్రయోగాలు
Google X Taara చిప్, అంతకుముందు అభివృద్ధి చేసిన Taara Lightbridge సిస్టమ్‌లో మరో అభివృద్ధిగా చెప్పుకోవచ్చు. Taara Lightbridge 20 Gbps వేగంతో 20 కిలోమీటర్ల దూరం వరకూ డేటాను ప్రసారం చేస్తుందని చెబుతున్నారు.
తదుపరి దశలు & కమర్షియల్ లాంచ్
ప్రస్తుత నివేదికల ప్రకారం, Google X 2026 నాటికి ఈ Taara చిప్‌ను కమర్షియల్ మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది. అలాగే, పరిశోధకులు ఈ టెక్నాలజీని మరింతగా ఉపయోగించేందుకు అనేక పరిశోధనలను ప్రోత్సహిస్తున్నారు.