భారత ప్రభుత్వ హెచ్చరిక..
గూగుల్ క్రోమ్ వినియోగదారులను భారత ప్రభుత్వం హెచ్చరించింది. హ్యాకర్లు మీ డెస్క్ టాప్ సిస్టమ్ లేదా, ల్యాప్ టాప్ పై అటాక్ చేసే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని అప్డేట్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల బారిన పడే ప్రమాదాన్ని తప్పించుకోవచ్చని కూడా తెలిపింది. ఇంతకీ గూగుల్ క్రోమ్ లో ఉన్న లోపాలేంటి..? వాటిని హ్యాకర్లు ఎలా ఉపోయగించుకుంటున్నారు..? ఒకవేళ హ్యాకింగ్ బారిన పడితే ఏం చేయాలి..? ఆ వివరాలన్నీ ఇప్పడు తెలుసుకుందాం..?
భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఈ హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ ని బ్రౌజర్ గా వాడేవారు జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ చేసింది. విండోస్, లినక్స్, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో క్రోమ్ ని బ్రౌజర్ గా వాడేవారు హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే మొబైల్ ఫోన్ లో ఉండే క్రోమ్ వెర్షన్ తో సమస్య లేదని స్పష్టం చేసింది.
లినక్స్ 136.0.7103.113 వెర్షన్
విండోస్, మ్యాకింతోష్ ఓఎస్ వాడేవారు 136.0.7103.113 లేదా 136.0.7103.114 వెర్షన్ల కంటే పాతవి వాడేవారు వాటిని అప్ గ్రేడ్ చేసుకోవాలి. అలా చేసుకోకపోతే వాటిని హ్యాకర్లు సులభంగా తమ అధీనంలోకి తెచ్చుకోగలుగుతారు అని CERT-In హెచ్చరించింది. గూగుల్ క్రోమ్ లో మనం మ్యాన్యువల్ గా అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం సహజంగా ఉండదు. గూగులు క్రోమ్ ఓపెన్ చేసి, కుడివైపు చివరన ఉన్న మూడు డాట్స్ ని క్లిక్ చేస్తే వెంటనే పాపప్ మెను కిందకు ఓపెన్ అవుతుంది. అందులో హెల్ప్ ఆప్షన్ ని ఓపెన్ చేసి అబౌట్ గూగుల్ క్రోమ్ అనేది క్లిక్ చేస్తే.. మన వెర్షన్ ఏంటి.. మనం అప్ టు డేట్ గా ఉన్నామా లేదా తెలిసిపోతుంది.
గూగుల్ క్రోమ్ అప్ డేట్ వెర్షన్ మనం ఇన్ స్టాల్ చేసుకోకపోతే హ్యాకర్లు మన సిస్టమ్ లోకి చొరబడే అవకాశం ఉంటుంది. హ్యాకింగ్ ద్వారా మన వ్యక్తిగత సమాచారాన్ని వారు తస్కరిస్తారు. ఒకవేళ హ్యాకింగ్ కి గురైనట్టు అనుమానం వస్తే మన బ్యాంకింగ్, సోషల్ మీడియా పాస్ వర్డ్స్ ని వెంటనే మార్చుకోవాలి. అయితే అంతకంటే ముందు గూగుల్ క్రోమ్ ని మనం అప్ డేట్ చేసుకోవాలి.
CERT-In గతంలో కూడా ఇలాంటి అలర్ట్ లు జారీ చేసింది. ప్రభుత్వం తరపున మన దేశంలోని వినియోగదారులకు CERT-In హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెబుతుంది. అధికారికంగా వచ్చే అలర్ట్ లను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. CERT-In హెచ్చరిక కాబట్టి దీన్ని అధికారికంగా మనం పరిగణించాలి.