డిజిటల్ మార్గాల ద్వారా ఆర్థిక నేరాలను గుర్తించే పనిలో పడింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు కేవలం డాక్యుమెంట్స్ ఆధారంగా ఆర్థిక అవకతవకలను దర్యాప్తు చేయగా, ఇకపై వాట్సాప్, ఫేస్ బుక్, జీ మెయిల్, ఇన్ స్ట్రా గ్రామ్ సందేశాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. కొత్త ఆదాయన పన్ను బిల్లు-2025 ప్రకారం డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడానికి సంబంధించిన నింబంధనలు ప్రభుత్వం ప్రతిపాదించింది. తాజా నిర్ణయం ప్రకారం, ప్రతిపాదిత చట్టంలో నిర్దిష్ట మార్పులను ప్రవేశపెట్టినట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. “ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టం డిజిటల్ ఆస్తులను తనిఖీ చేయడానికి చట్టపరమైన సపోర్టు ఇవ్వడం లేదు. ఇప్పుడు, ఆ విధానానికి అనుమతిస్తూ ప్రతిపాదనలు చేశాం. ఆదాయపు పన్ను చట్టంలో డిజిటల్ అంశాల తనిఖీని జోడించాం” అని సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు.
వాట్సాప్ ద్వారా రూ. 250 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
ఇక లెక్కల్లో చూపించని డబ్బును వెలికితీయడంలో డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషించిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. “మొబైల్స్ లోని ఎన్ క్రిప్ట్ చేసిన మెసేజ్ ల ద్వారా రూ. 250 కోట్ల లెక్కల్లో లేని డబ్బును గుర్తించారు. వాట్సాప్ మెసేజ్ ల ద్వారా క్రిప్టో కరెన్సీ వివరాలను కనుగొన్నారు. వాట్సాప్ కమ్యూనికేషన్ రూ. 200 కోట్ల లెక్కల్లో లేని డబ్బును వెలికితీయడానికి సహాయపడింది” అని వెల్లడించారు. డబ్బులను దాచుకోవడానికి తరచుగా సందర్శించే ప్రదేశాలను గుర్తించడానికి అధికారులు గూగుల్ మ్యాప్స్ హిస్టరీని ఉపయోగించారని చెప్పారు. బినామీ ఆస్తులను గుర్తించేందుకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ ను కూడా విశ్లేషించినట్లు ఆమె తెలిపారు.
డిజిటల్ తనిఖీల ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట
డిజిటల్ తనిఖీల ద్వారా అక్రమాస్తులను గుర్తించేందుకు ఇకపై మార్గం సుగమం అయ్యిందని నిర్మలా సీతారామన్ తెలిపారు. క్రిప్టోకరెన్సీ లాంటి వర్చువల్ కరెన్సీ, డిజిటల్ ఆస్తులు పరిశీలన నుంచి తప్పించుకోలేవని వెల్లడించారు. కొత్త బిల్లు.. దర్యాప్తు అధికారులకు ఇమెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి కమ్యూనికేషన్ ప్లాట్ ఫారమ్ లతో పాటు ఆర్థిక లావాదేవీలను దాచడానికి ఉపయోగించే ఎంటర్ ప్రైజ్ సాఫ్ట్ వేర్, స్టోరేజ్ సర్వర్ లను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుందన్నారు. కోర్టు ముందు పన్ను ఎగవేతను నిరూపించడానికి మాత్రమే కాకుండా, పన్ను ఎగవేత మొత్తాన్ని కచ్చితంగా లెక్కించేందుకు డిజిటల్ ఖాతాల నుంచి ఆధారాలను సేకరించే అవసరం ఉందని నిర్మలా వెల్లడించారు. ఆదాయపు పన్ను బిల్లు- 2025 ప్రస్తుతం పార్లమెంటు ఎంపిక కమిటీ సమీక్షలో ఉందని నిర్మలా సీతారామన్ తెలిపారు. దీన్ని చట్టంగా మార్చేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం-1961 ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేయనున్నట్లు తెలిపారు.
పెరిగిన ప్రత్యక్ష పన్ను వసూళ్లు
ఇక గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో గణనీయమైన వృద్ధిని కనిపించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక అంచనాలపై ఆమె విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Read Also: షాకింగ్.. మీ వాహనం ఎంత పాతది? ఇకపై మీకు పెట్రోల్ పొయ్యరు!