Vallabhaneni Vamsi: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారం కీలక ములుపు తిరిగింది. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగాని పోలీసులకు చిక్కాడు. గతరాత్రి గన్నవరంలో ఆయన్ని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ల తరబడి వంశీకి కుడి భుజంగా వ్యవహరిస్తూ వచ్చారు మోహన్ రంగా. ఆయన అరెస్టుతో అన్నికేసులు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు పోలీసులు.
వంశీకి కుడి భుజం మోహనరంగా
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఫిర్యాదు వెనక్కి తీసుకుంటే ఈ కేసు వీగిపోతుందని భావించాడు వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు మోహన్‌రంగా. ఈ క్రమంలో సత్య వర్ధన్ గురించి వివరాలు తెలుసుకున్నాడు. చివరకు సత్యవర్ధన్ బంధువు ద్వారానే అతడ్ని పిలిపించి తెర వెనుక మంత్రాంగం నడిపించాడు. ఆ తర్వాత మోహన్ రంగాతోపాటు మరొకరు కలిసి సత్యవర్ధన్‌ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు.
మోహన్ రంగా చిక్కడంతో రేపోమాపో మరొకరు పట్టుబడడం ఖాయమని అంటున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుల్లో వల్లభనేని వంశీ కీలక అనుచరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వంశీకి కుడి భుజం లాంటివాడు ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్ రంగా.
సత్యవర్థన్ వ్యహారం డీల్ ఆయనదే
వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన వ్యవహారాలు, సెటిల్మెంట్లు, ఆర్థిక లావాదేవీలను చక్కబెట్టడానికి చుట్టూ ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వాటిలో కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు, మోహన్‌రంగా కీలక వ్యక్తులు. వంశీ ఏది అనుకుంటే అది వీరి ద్వారా చేయిస్తారనే ప్రచారం సైతం లేకపోలేదు. ముఖ్యంగా వంశీ రాజకీయ వ్యవహారాలను దగ్గరుండి అతడే చూస్తాడు.
ALSO READ: పాస్టర్ ప్రవీణ్‌ది ప్రమాదమా? హత్యా?
సత్యవర్ధన్ అంశాన్ని ఆయనే డీల్ చేసినట్టు తెలుస్తోంది. వంశీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గన్నవరంలో కార్యకలాపాలు నిర్వహించేవాడు మోహన్ రంగా. బాస్ ఓటమి తర్వాత ఏలూరుకు మకాం మార్చేసినట్లు సమాచారం. ఇక సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి వేధించిన వ్యవహారంలో విజయవాడ పోలీసులు నమోదు చేశారు. అందులో 11 మంది నిందితులు ఉన్నారు.
ఇప్పుడు మోహన్‌రంగా అరెస్టు కావడంతో నిందితుల సంఖ్య పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు పోలీసులు. మధ్య తరగతికి చెందిన సాదాసీదా వ్యక్తి మోహన్‌రంగా. తక్కువ సమయంలో కోట్లకు పగడలెత్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే బీఎండబ్ల్యూ కారులో తిరిగే స్థాయికి చేరాడు.
మారిన రంగా రేంజ్
గన్నవరం రాజకీయాల్లో వంశీ అడుగుపెట్టిన తర్వాత ఆయన దగ్గర చేరి అత్యంత విశ్వాసపాత్రుడిగా మారిపోయాడు. వైసీపీ హయాంలో కుదిపేసిన సంకల్ప సిద్ధి స్కామ్‌లో రంగా పాత్ర ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. రూ.500 కోట్ల స్కామ్‌ని రంగా నడిపించినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు ఈ వ్యవహారం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై బుధవారం తుది విచారణ జరగనుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో బెయిల్ పిటిషన్‌పై మంగళవారం విచారణ ముగిసింది. మోహన్‌రంగా పట్టుబడడంతో వంశీకి బెయిల్ రావడం కష్టమేనని అంటున్నారు. ఇప్పటివరకు విచారణలో పోలీసులు సేకరించిన ఆధారాలతో రంగాని విచారిస్తున్నారు పోలీసులు. సాయంత్రం ఆయన్ని న్యాయమూర్తి ముందు హాజరుపర్చనున్నారు.