కర్బన ఉద్గారాలను తగ్గించడంతో పాటు గ్రీన్ ట్రాన్స్ పోర్టు వ్యవస్థ దిశగా కీలక అడుగులు పడేలా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఎలాక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రజలు మొగ్గు చూపేలా పలు రాయితీలను అందిస్తున్నది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం పలు కంపెనీలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నది. త్వరలోనే పెట్రో వెహికల్స్ ధరల్లోనే ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి రాబోతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ రీసెంట్ గా కీలక ప్రకటన చేశారు. మరికొద్ది సంవత్సరాల్లో దేశంలో పూర్తిగా పెట్రో వాహనాలు కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ దిశగా ప్రజల్లోనూ అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నది.
15 ఏండ్లు నిండిన పెట్రో వాహనాలపై నిషేధం
ఇక దేశ రాజధాని ఢిల్లీ కాలుష్య కోరల్లో చిక్కి కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలు, 10 ఏళ్లు నిండిన డీజిల్ వాహనాలపై పూర్తి నిషేధాన్ని ప్రకటించింది. ఈ విధానాన్ని అమలు చేసేందుకు రాజధాని అంతటా 500+ ఇంధన కేంద్రాలలో హైటెక్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. ఇది నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాలకు ఆటోమేటిక్ గా ఫ్యూయల్ నింపడాన్ని నిరాకరిస్తుంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 1 లక్ష జరిమానా
2010కి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న పెట్రోల్ వాహనలు, 2015కి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న డీజిల్ వాహనాలపై ఈ నిషేధం అమలు చేయనున్నారు. పెట్రోల్ బంకుల్లో కేంద్ర డేటా బేస్ కు అనుసంధానించబడిన ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి వాహనాలను ఆటోమేటిక్ గా గుర్తించి, పెట్రోల్ పోయ్యాలో? లేదో? నిర్ణయిస్తాయి. ఒకవేళ ఈ నిబంధనలను వాహనదారులు ఉల్లంఘిస్తే, రూ. 1 లక్ష వరకు జరిమానా విధించడంతో పాటు వాహనాన్ని జప్తు చేస్తారు.
వాహనాలను ఎలా తనిఖీ చేస్తారు?
ప్రతి పెట్రోల్ బంక్ ఎంట్రీ పాయింట్ల దగ్గర ANPR కెమెరాలు ఇన్ స్టాల్ చేస్తారు. ఈ కెమెరాలు వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లను స్కాన్ చేస్తాయి. వాహనం ఎప్పుడు తీసుకున్నారనే విషయాన్ని రవాణాశాఖ డేటాబేస్ తో ప్లేట్లను క్రాస్ రిఫరెన్స్ చేస్తుంది. నిబంధనలకు అనుగుణంగా లేదని గుర్తిస్తే, ఫ్యూయెల్ పోయకుండా అడ్డుకుంటాయి.
Read Also: ఇంటర్వ్యూలో 5వ తరగతి ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయిన అభ్యర్థులు.. జెన్ z ఇంతేనా?
పాత వాహనాలు 10 రెట్లు ఎక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తాయని ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఢిల్లీలో వాటిని నడవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ నడిపినా పెట్రోల్ పోసుకునే పరిస్థితి ఉండదన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఒకవేళ పరిసర రాష్ట్రాల్లో ఇంధనం నింపుకుని ఢిల్లీలో వాహనాలు నడుపుతూ.. పోలీసుకులకు పట్టుబడితే పెద్దమొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే సమయంలో వాహనం జప్తు చేయబడుతుంన్నారు. పెట్రో వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రజలు మొగ్గు చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 1 నుంచి నిషేధం అమలు కానుంది.
Read Also: 12,478 కోట్లు విలువచేసే కంపెనీని రూ.74కే అమ్మేసిన ఈ బిజినెస్ మ్యాన్ గురించి మీకు తెలుసా?