Scams : నకిలీ ప్రభుత్వ అధికారుల పేరుతో జరుగుతున్న మోసాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ జాబితాలో చేరి ఎందరో బాధితులు కోట్లలో నష్టపోగా తాజాగా హాంకాంగ్ నుండి తిరిగి ముంబైకు వచ్చిన 81 ఏళ్ల వృద్ధుడు ఈ స్కామ్ లో ఇరుక్కున్నాడు. రూ. 10 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఇప్పటికే డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్స్ వంటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సైబర్ సెక్యూరిటీ ఎంతగా హెచ్చరిస్తున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి కేసులో ఇరుక్కుపోయాడు ముంబైకి చెందిన ఓ వృద్ధుడు. నిజానికి గత కొన్ని రోజుల క్రితమే ఈ వ్యక్తి హాంకాంగ్ నుంచి తిరిగి వచ్చాడు. చలి ఎక్కువగా ఉండటంతో హాంకాంగ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి… బొంబాయిలోని శాంతాక్రూజ్ లో ఒంటరిగా ఉంటున్నాడు. ఇతని వయసు 81 ఏళ్లు. ఇతనికి సిబిఐ అధికారులమంటూ ఫోన్ చేసిన కొందరు వ్యక్తులు రూ.10 లక్షలు దోచుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 9న బాధ్యతుడికి సిబిఐ నుండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్తూ ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. వీడియో కాల్ రావడంతో ఆ వ్యక్తి లిఫ్ట్ చేసి మాట్లాడాడు. ఇక్కడతో మొదలైన స్కామ్ మనుషుల్ని అక్రమంగా తరలిస్తున్నారు అంటూ తీవ్రమైన ఆరోపణలతో ఆ వ్యక్తిని భయపెట్టారు. మిమ్మల్ని వెంటనే అరెస్టు చేయమని ఆర్డర్స్ వచ్చాయని చెబుతూ అరెస్టును ఆపాలంటే డబ్బులు బదిలీ చేయాలని తెలిపాడు. మిమ్మల్ని హౌజ్ అరెస్ట్ చేశామని అక్కడి నుంచి ఎక్కడికి కదలొద్దని, ఎవరికి ఫోన్ చేయొద్దని, ఈ విషయం ఎవరికైనా చెబితే ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటూ స్కామర్స్ బెదిరించారు.
దీంతో భయపడిపోయిన ఆ వ్యక్తి స్కామర్స్ నుంచి తప్పించుకోవడానికి వారు చెప్పిన విధంగానే అన్ని విషయాలు చేశాడు. దీంతో హ్యాకర్స్ రూ.10 లక్షలు బదిలీ చేయమని చెప్పటంతో అదే విధంగా బదిలీ చేసి తిరిగి అదే నెంబర్ కు ఫోన్ చేస్తే ఫోన్ స్విచాఫ్ వచ్చింది. దీనితో సదరు వ్యక్తి తాను మోసపోయాననే విషయాన్ని గమనించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చాడు. ఇక బాధిత వ్యక్తి ఆర్‌టీజీఎస్ (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్)ని ఉపయోగించి బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు బదిలీ చేసినట్లు తెలుస్తుంది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎక్కడికి అక్కడ ఇలాంటి కేసులు పెరిగిపోవడంతో ప్రతిసారి హెచ్చరిస్తున్నామని, అయినప్పటికీ ప్రజల అప్రమత్తం కావడంలేదని తెలుపుతున్నారు. అందుకే తెలియని నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయకపోవడం మంచిదని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా వీడియో కాల్స్ ని ఎట్టి పరిస్థితుల్లోనే లిఫ్ట్ చేయొద్దని, సిబిఐ అధికారులమని నమ్మిస్తారని అందుకే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా ఎలాంటి ప్రభుత్వ అధికారులు కానీ సంస్థలు గాని కాల్స్, వీడియో కాల్స్, వాట్సాప్ కాల్స్ ద్వారా సంప్రదింపులు చేయవని ఇలాంటి విషయాలను నమ్మి మోసపోకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాలను ఫోన్లో పంచుకోవద్దని వీడియో కాల్ ద్వారా షేర్ చేయవద్దని, ఒకవేళ ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే పోలీసుల్ని సంప్రదించాలని తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు జరిగిన విషయం చెప్పి తగిన సలహా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ALSO READ : భీభత్సంగా పడిపోయిన MacBook Air M3 ధరలు.. అతి తక్కువ ధరకే బ్యాంక్ ఆఫర్స్ లేకుండానే!