Allu Arjun’s Case In Detail:ప్రముఖ స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar)దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప(Pushpa)..ఈ సినిమా సీక్వెల్ గా మూడేళ్ల నిర్విరామ కష్టం తర్వాత ‘పుష్ప2’ సినిమాను విడుదల చేశారు. డిసెంబర్ 5వ తేదీన విడుదల అవ్వగా.. ఒకరోజు ముందుగానే అనగా డిసెంబర్ 4 అర్థరాత్రి నుంచే బెనిఫిట్ షోలు మొదలయ్యాయి. అందులో భాగంగానే అభిమానులతో కలిసి సినిమా చూడడానికి అల్లు అర్జున్(Allu Arjun)హైదరాబాదులో సంధ్య థియేటర్ కి వచ్చారు. అయితే అల్లు అర్జున్ ను చూడడానికి అభిమానులు ఎగబడగా.. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి(39) అనే యువతి అక్కడికక్కడే మరణించింది. ఆమె కొడుకు(9) అపస్మారక స్థితిలోకి వెళ్ళగా.. ఇప్పుడిప్పుడే మెరుగైన వైద్యం తీసుకొని ఆరోగ్యంగా కోలుకున్నారు.
బన్నీ అరెస్ట్.. మినిట్ టూ మినిట్ ఏం జరిగిందంటే..
ఇకపోతే సంధ్య థియేటర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది దీనికి తోడు రేవతి కూడా మరణించడంతో మరో కేసు ఆయనపై ఫైల్ అవ్వడం గమనార్హం. అయితే తాజాగా ఈరోజు ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఇకపోతే ఈరోజు ఉదయం నుంచి అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు అయ్యే వరకు అసలు ఏం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఉదయం 11:40 గంటలకు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు సడన్ గా ఆయన బెడ్ రూమ్ కి వెళ్ళిపోయి, బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా 12:00 గంటలకు అరెస్ట్ చేస్తామని అల్లు అర్జున్ తో తెలిపారు. అయితే ఈ విషయంపై అల్లు అర్జున్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అరెస్టు చేయడాన్ని ఆయన తప్పు పట్టలేదు కానీ నేరుగా బెడ్ రూమ్ కి వచ్చి బట్టలు కూడా మార్చుకోవడానికి సమయం ఇవ్వకపోవడంతోనే అల్లు అర్జున్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక పోలీసులు చెప్పినట్టుగానే 12 గంటలకు ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించి విచారణ జరిపారు. అటు నుంచి 2:50 గంటలకు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, 3:00 గంటలకు గాంధీ హాస్పిటల్ నుండి నాంపల్లి కోర్టుకు తరలించారు. ఆ తర్వాత 3:25 గంటలకి నాంపల్లి కోర్టులో 9వ అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. 3:30 గంటలకు అల్లు అర్జున్ కేసును జడ్జికి ప్రభుత్వ న్యాయవాది వివరించారు. విచారణ అనంతరం అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. జ్యుడీషియల్ రిమాండ్ ఖైదీగా అల్లు అర్జున్ ఉండనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు అల్లు అర్జున్ పై 105(B), 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనను చంచల్గూడా జైలుకు తరలించారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం భారీ ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే హైకోర్టులో అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర తీర్పును ఉదాహరణగా చూపిస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసి, అత్యవసర కేసు విచారణ చేపట్టాలని కోరారు. అలా సాయంత్రం 4:00 గంటలకు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఇకపోతే ఈ విషయంపై విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసులో పెట్టిన సెక్షన్ లు అల్లు అర్జున్ కి వర్తించమని తెలిపింది. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమని కూడా తెలిపింది. అంతేకాదు అల్లు అర్జున్ కి కూడా జీవించే హక్కు ఉందని, కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్ కు ఆపాదించాలా? రేవతి కుటుంబం పై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేము కదా అంటూ వ్యక్తిగత పూచీకత్తు పైన రూ. 50వేల పర్సనల్ బాండ్ తో నాలుగు వారాలపాటు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ చంచల్గూడా జైలు సూపరిండెంట్ కు అందివ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
చంచల్గూడా జైలు నుంచి రిలీజ్ కాబోతున్న బన్నీ..
ఇకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీని తీసుకొని ఒక కానిస్టేబుల్, లేడీ సిఐ టూ వీలర్ లో చంచల్గూడా జైలుకు తాజాగా చేరుకున్నారు.. ఇక ప్రాసెస్ జరిగేసరికి మినిమం అర్థగంట పడుతుంది. కాబట్టి మరో 30 నిమిషాలలో చంచల్గూడా జైలు నుంచి అల్లు అర్జున్ మద్యంతర బెయిల్ మీద విడుదల కాబోతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇది భారీ సెలబ్రేషన్స్ టైం కాబట్టి అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా భారీ బందోబస్తుతో వచ్చారు. మొత్తానికి మరికొన్ని నిమిషాలలో అల్లు అర్జున్ చంచల్గూడా జైలు నుంచి విడుదల కాబోతున్నారు.