Spam Calls Block: మనం ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు లేదా ప్రశాంతంగా సాంగ్స్ వింటున్నప్పుడు తెలియని నంబర్ల నుండి వచ్చే ప్రమోషనల్ కాల్స్, మెసేజ్‌లు చాలా చిరాకు తెప్పిస్తాయి. ఈ మధ్యకాలంలో ఏఐ (AI) సాయంతో స్కామర్లు కొత్త తరహా మోసాలకు కూడా పాల్పడుతున్నారు. కాబట్టి.. ఇలాంటి అనవసరపు కాల్స్, మెసేజ్‌లను ఆపడం చాలా అవసరం. జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ యూజర్లు వీటి నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అన్ని నెట్‌వర్క్ యూజర్లు ట్రాయ్ (TRAI) అందిస్తున్న DND (Do Not Disturb) సేవలను ఉపయోగించుకోవచ్చు. దీనికోసం మీ ఫోన్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసి START 0 అని టైప్ చేసి 1909 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. లేదా 1909 కి కాల్ చేసి ఐవీఆర్ (IVR) సూచనలను పాటించినా సరిపోతుంది. ఈ సర్వీస్ యాక్టివేట్ అవ్వడానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. అంతేకాకుండా.. మీరు ట్రాయ్ DND యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మీ నంబర్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా స్పామ్ కాల్స్‌పై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది, దాని ద్వారా మీ కంప్లైంట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.
జియో కస్టమర్లు తమ మైజియో (MyJio) యాప్ ద్వారా చాలా సులభంగా DND సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ముందుగా యాప్ ఓపెన్ చేసి ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘సర్వీస్ సెట్టింగ్స్’ ఎంచుకోవాలి. అక్కడ కనిపించే ‘డూ నాట్ డిస్టర్బ్’ ఆప్షన్‌పై నొక్కితే ఫుల్ లేదా పార్షియల్ DND ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు అవసరమైన దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు.
Also Read: కొత్త గీజర్ తీసుకుంటున్నారా? సేఫ్టీ, కరెంట్ ఆదా కోసం ఈ 4 విషయాలు తప్పకుండా చెక్ చేయండి!
ఎయిర్‌టెల్ యూజర్లు తమ ఫోన్‌లోని ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ఓపెన్ చేసి ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ విభాగాన్ని ఎంచుకోవాలి. అందులో ‘సెట్ DND’ ఆప్షన్‌లోకి వెళ్లి ‘మేనేజ్’ పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు నచ్చిన DND ఆప్షన్ ఎంచుకుని చివరగా సబ్మిట్ బటన్ నొక్కితే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
వొడాఫోన్ ఐడియా (Vi) యూజర్లు వీఐ యాప్‌లోని ‘మై అకౌంట్’ విభాగానికి వెళ్లి, ‘ఫైండ్ సర్వీసెస్’ కింద ఉండే DND ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ ఫుల్ లేదా పార్షియల్ DND సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక బీఎస్ఎన్ఎల్ (BSNL) యూజర్లకు ఎస్ఎంఎస్, కాల్ ద్వారా ఈ సదుపాయం ఉంది. వీరు 1909 నంబర్‌కు START 0 అని మెసేజ్ పంపడం లేదా కాల్ చేసి ఐవీఆర్ సూచనలు పాటించడం ద్వారా స్పామ్ కాల్స్‌ను పూర్తిగా ఆపేయవచ్చు.
Also Read: పిడుగులు పడే సమయంలో వైఫై రూటర్, స్మార్ట్ టీవీ ప్లగ్స్ తీసేయాలా? స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుందా?