Ponnam Prabhakar: గాంధీ భవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం చాలా సుదీర్ఘంగా సాగింది. పీసీసీ అధ్యక్షుడి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు సచిన్ సావంత్, ఆజ్మత్ హుస్సేన్, సంపత్ కుమార్‌తో పాటు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ భేటీ వివరాలను పంచుకున్నారు.
2027 జనగణనపై కీలక తీర్మానాలు
రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించాలని కోరారు. రూ.30 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని PAC నిర్ణయించింది. అలాగే 2027 జనగణన ప్రశ్నావళిలో ఓబీసీ కులగణన కోసం ప్రత్యేక కాలమ్ చేర్చాలని కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది.
ఇంచార్జ్ మార్పు, పార్టీ బలోపేతంపై ఫోకస్
నూతనంగా బాధ్యతలు చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ బి.ఎం. సందీప్‌కు కమిటీ స్వాగతం పలికింది. గత ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపింది. సందీప్ త్వరలో నేతలతో విడివిడిగా మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటారన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా రాష్ట్ర కృషిని ఆయన మెచ్చుకున్నారని పొన్నం చెప్పారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, మండల నుంచి వార్డు వరకు కమిటీలు, అనుబంధ సంఘాలను బలోపేతం చేయడం, ఢిల్లీ రాంలీలా మైదాన్ సభలో భాగస్వామ్యంపై చర్చించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటర్లపై అప్రమత్తత
డిసెంబర్ 7తో ప్రజా ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ ప్రజల్లోకి వెళ్లాలన్నారు. మళ్లీ అధికారంలోకి రావడానికి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లూ గెలుచుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు. కేంద్ర బీజేపీ నేతల పర్యటనల వేళ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్ రివిజన్‌లో అర్హుల పేర్లు తొలగించకుండా ఓటు హక్కును కాపాడాలని సూచించారు.
Also Read: ఓట్ల తొలగింపుపై పోరు, కరువు నిధుల కోసం డిమాండ్.. పీఏసీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!