Escape From Scammers : టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో స్కామర్స్ రెచ్చిపోతున్నారు. ఫోన్, ఈమెయిల్, సోషల్ మీడియా సైట్స్ లో చెలరేగిపోతున్నారు. ఎప్పటికప్పుడు ఈ మోసాలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది 26లక్షల మంది సైబర్ వలలో చిక్కుకోగా… 10 బిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం ఎంతైనా అవసరం.
సైబర్ నేరగాళ్లు సైబర్ మోసాలకు పాల్పడినప్పుడు ఎదుటివారిని గందరగోళానికి గురి చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆలోచించకుండా వెంటనే నిర్ణయం తీసుకునేటట్టు, మనుషుల్ని ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తారు. ఆలోచనల్ని తారుమారు చేసి మార్చేస్తూ స్కామ్ లో మునిగిపోయేటట్టు చేసి తేలిగ్గా మోసం చేస్తారు. అయితే కొన్ని విషయాలు పాటిస్తే ఈ సైబర్ నేరగాళ్ల నుంచి తేలికగా తప్పించుకునే అవకాశం ఉంటుంది.
అధికారాన్ని ప్రశ్నించటం – సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులుగా నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని చెబుతూ ఏదో ఒక తప్పుని ఎదుటివారిపైన రుద్దే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా జరిమానా చెల్లించాలని లేదంటే అరెస్టు చేస్తామని చెప్పే వాళ్ళని అసలు నమ్మకూడదు. ఇలాంటి సమయంలో కంగారు పడకుండా ఎదుటివారిని తగిన రీతిలో ప్రశ్నిస్తూ సమాధానాలు బయటపెట్టించాలి.
సమయాన్ని పసిగట్టాలి – సైబర్ నేరగాళ్లు ఎక్కువగా ఉపయోగించే ఒకే ఒక పదం సమయం లేదు. ముఖ్యంగా ఎదుటివారి మానసిక పరిస్థితిని అంచనా వేసి ఆడుకుంటూ సమయం లేదని చెబుతుంటారు. పరిమిత కాలంలో మాత్రమే ఆఫర్స్ ఉన్నాయని చెబుతూ.. ఈ సమయంలోనే కొనుగోలు చేయకపోతే నష్టపోతారని భ్రమ పెడతారు. డెలివరీ స్కామ్స్, నకిలీ ఇన్ వాయిస్ వంటివి ఇందులో భాగంగానే జరుగుతూ ఉంటాయి. అధిక మొత్తంలో డబ్బులు వస్తాయని ఆశ చూపిస్తూ మోసాలకి పాల్పడతారు. తక్కువ సమయంలోనే ఆఫర్స్ ఉన్నాయని.. వెంటనే లింక్ ఓపెన్ చేయాలని చెబితే అలాంటి వారిని అస్సలు నమ్మకూడదు.
ఫుట్ ఇన్ ది డోర్ – ఈ స్కామ్ ను తేలికగా పసిగట్టవచ్చు. మీరు ఓ రెండు నిమిషాలు కేటాయిచవచ్చా అంటూ మాటలు ప్రారంభిస్తారు. ఇక చెప్పగలిగే తేలికపాటి ప్రశ్నలు వేస్తూ సంభాషణను కొనసాగిస్తారు. మీకు జంతువులంటే ఇష్టమా.. మీకు ఇష్టమైన హాబీస్ ఏంటి.. ఇలాంటి ప్రశ్నలతో మైండ్ ను ట్రాప్ చేసే పనిలో పడతారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే కట్ చేయటం మంచిది.
సోషల్ రెస్పాన్స్బిలిటీ – స్కామర్స్ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక రకమైన సోషల్ రెస్పాన్స్బిలిటీలోకి తీసుకెళ్లి మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ప్రత్యేక ధరతో స్పెషల్ యాక్స్సెస్ మీకు మాత్రమే ఇస్తున్నాం. మీరు మంచివారిలా కనిపిస్తున్నారు లాంటి మాటలతో మాయ చేసే ప్రయత్నం చేస్తారు.
లవ్ ట్రాక్ – ఎక్కువగా మోసపోయిన వారిని, బ్రేక్ అప్ బాధలో ఉన్నవారిని స్కామర్స్ టార్గెట్ చేస్తారు. మీరు బాధలో ఉన్నారా.. మీకు సహాయం చేస్తాం.. మీరు ఎలాంటి బాధనైనా మాతో పంచుకోండి వంటి మాటలతో మాయ చేసే ప్రయత్నం చేస్తారు. ఇలా ఎప్పుడూ తెలియని, కనిపించని వాళ్లు ఫోన్ చేసి ఇలా మాట్లాడితే అప్రమత్తంగా ఉండాలి.
ALSO READ : ఆహా ఐక్యూ హవా.. 6150mAh బ్యాటరీ, 512GB స్టోరేజ్ తో ఐక్యూ 13 వచ్చేది ఆ రోజే