BigTV English

YS Jagan : అలిగిన జగన్.. అసెంబ్లీకి రానంటే, రానంటూ పంతం

YS Jagan : అలిగిన జగన్.. అసెంబ్లీకి రానంటే, రానంటూ పంతం

YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరమే. టీడీపీ, వైసీపీలు బద్ధ శత్రువులుగా మారి.. అన్ని విషయాల్లోనూ కలహించుకుంటాయి. రాష్ట్రంలోని ఏ చిన్న సంఘటన దగ్గర నుంచి మొదలు పెట్టినా ఈ రెండు పార్టీలది చెరో దోవే. ఇక పెద్ద, పెద్ద నిర్ణయాలు, విషయాల్లో అయితే వైరమే వీరి విధానం. ఈ పద్ధతినే.. అసెంబ్లీ సమావేశాలకు వర్తింపజేస్తున్నాయి ఈ పార్టీలు. అధికార పక్షం విధానాలకు, నిర్ణయాలను ప్రజల సమక్షంలో ప్రశ్నించేందుకు మంచి వేదికైన.. అసెంబ్లీని నిత్యం బహిష్కరిస్తూ, వింత పోకడలు అనుసరిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు పెట్టడాన్ని తప్పుబడుతూ మీడియాతో మాట్లాడిన జగన్.. ఇకపై తాను అసెంబ్లీకి రానని తేల్చేశారు. అసెంబ్లీలో కేవలం అధికార, ప్రతిపక్షాలే ఉంటాయన్న జగన్.. రాష్ట్రంలో ఉందే రెండు పక్షాలు అయినప్పుడు.. తమ పార్టీని ప్రతిపక్ష పార్టీగా ఎందుకు గుర్తించరు.? అని ప్రశ్నించారు. తమ గొంతు నొక్కేందుకే.. అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే ఇబ్బందులే..
వైసీపీకి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కల్పించకపోవడం వెనుక పెద్ద కుట్రే ఉందన్న జగన్.. వైసీపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే, తప్పనిసరి పరిస్థితుల్లో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఇలా చేస్తే.. సభానాయకుడికి ఎంత సమయం మైక్ ఇచ్చారో, ప్రతిపక్ష నాయకుడికి కూడా అంతే సమయం మైక్ హక్కుగా వస్తుందని అన్నారు. అలా వస్తే.. వివిధ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామనే ప్రతిపక్ష నేతగా గుర్తించడం లేదని ఆరోపించారు.
తమకు ప్రతిపక్ష హోదా కల్పించనప్పుడు తామెలా చర్చల్లో పాల్గొనాలని ప్రశ్నించారు. తమను ఎవరూ ప్రశ్నించేందుకు వీలు లేకుండా చేసేందుకు అధికార పక్షం ఇలా కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

అసెంబ్లీలో కాదు.. ప్రజల కోసం అక్కడి నుంచి పోరాడుతా..
తనని ఎవరూ ప్రశ్నించకూడదు.? అసెంబ్లీలో మాట్లాడకూడదు.? ఎవరూ రోడ్లపైకి రాకూడదూ.? అనే విధానం కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోందన్న జగన్.. రాష్ట్ర అసెంబ్లీలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వరని అన్నారు. అలాంటప్పుడు.. అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, వెళ్లినా ప్రయోజనం లేదని తెలిపారు. అందుకే.. తాను ఇకపై అసెంబ్లీ జరిగినప్పుడల్లా.. ప్రెస్ మీట్ పెడతానని తెలిపారు. మీడియా ద్వారానే ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని, అక్కడే ప్రజల గొంతును వినిపిస్తానంటూ వెల్లడించారు.


మొదటి నుంచి ఇదే ఒరవడి..
ఎన్నికల ఫలితాల్లో జగన్ పార్టీకి కేవలం 11 సీట్లే రావడంతో అసెంబ్లీ స్వీకర్.. వైసీపీ ప్రధాన ప్రతిపక్షం హోదాకు అర్హతలేదని చెప్పారు. నిబంధనల ప్రకారం వైసీపీ సాధారణ సీట్లే పొందిందని, ప్రతిపక్ష హోదాకు కావాల్సిన సీట్లు రాబట్టుకోలేకపోయిందని అన్నారు. ఈ విషయమై.. ఇప్పటికే జగన్ హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయినా ఉపయోగం లేకపోవడంతో బహిష్కరణ అస్త్రాన్ని ప్రయోగించారు. ఇప్పుడే కాదు.. గత రెండు ప్రభుత్వాల సమయాల్లోనూ వైసీపీ, టీడీపీ లు ఇదే తరహా వ్యూహన్ని అమలు చేశాయి. మొదటిసారి టీడీపీ హయాంలో తనకు సభలో మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వడం లేదని.. జగన్ అసెంబ్లీని బహిష్కరించాడు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి.. ఓట్ల వేట సాగించాడు. అందులో మంచి ఫలితాలు సాధించి, ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు.

రెండో సారి.. జగన్ పాలనలో చంద్రబాబు అదే పద్ధతిని అవలంభించాడు. కొన్ని అసెంబ్లీ సెషన్లకు హాజరైన చంద్రబాబు, ఆ పార్టీ నేతలు.. సభలో చంద్రబాబు సతీమణి గురించి తప్పుగా మాట్లాడారు అని ఆగ్రహించి.. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేశారు. తాను మళ్లీ ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానంటూ ప్రతిజ్ఞ చేసి.. ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబు, అనుకున్న తీరుగానే మొన్నటి ఎన్నికల్లో సత్తా చాటి.. విభజిత ఏపీలో రెండో సారి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇప్పుడు.. జగన్ అసెంబ్లీకి వెళ్లనూ అనడం ఇది మూడోసారి.

ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతేనా..?
ఇలా అన్నింటిలో కలహించుకునే పద్ధతి రాజకీయాల్లో మంచి సంస్కృతి కాదన్నది చాలా మంది అభిప్రాయం. ఓ పార్టీ పాలనలో ఐనా కొన్ని మంచి నిర్ణయాలుంటే, మరికొన్ని వ్యతిరేకించాల్సిన నిర్ణయాలుంటాయి. వాటన్నింటినీ పక్కనపెట్టి.. పాలక పక్షం తీసుకునే అన్ని విషయాలనూ వ్యతిరేకించడం ప్రజలకు, ప్రభుత్వాలకు మంచిది కాదు. కానీ.. ఈ పద్ధతి, ఆంధ్రప్రదేశ్ విభజన నాటి నుంటి ఏపీలో కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ అంటే కోట్ల మంది ప్రజలు.. అన్ని విషయాలను తెలుసుకునే వేదిక. అలాంటి చోట.. వివిధ అంశాలు, నియోజకవర్గాల సమస్యలపై చర్చించుకోవాల్సిన నేతలు.. ఇలా బహిష్కరణల పాట పాడడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. అగ్రనేతల మాట పక్కన పెడితే.. కనీసం సాధారణ, మొదటి సారి గెలిచిన ఎమ్మెల్యేలను సైతం అసెంబ్లీకి వెళ్లకుండా ఆపేయడం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×