Vikrant Massey: బాలీవుడ్‌లో బ్యాక్‌గ్రౌండ్ లేని హీరోల లిస్ట్ చాలా తక్కువే ఉంటుంది. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి కేవలం తన టాలెంట్‌తో తనకంటూ ఒక గుర్తింపు సాధించిన నటుడు విక్రాంత్ మాస్సే. ముందుగా సీరియల్ ఆర్టిస్ట్‌గా విక్రాంత్ ప్రయాణం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు హీరోగా తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ స్క్రిప్ట్ సెలక్షన్‌తో ముందుకెళ్తున్నాడు విక్రాంత్. అలా తను ఎంచుకున్న ఒక కథ, ఒక సినిమా తనకు ముప్పుగా మారాయి. తన సినిమా వల్ల తనకు ప్రాణహాని ఉందని విక్రాంత్ మాస్సేనే స్వయంగా ఒక ప్రెస్ మీట్‌లో ప్రకటించాడు.
ఏదైనా సిద్ధం
విక్రాంత్ మాస్సే అప్‌కమింగ్ మూవీ ‘ది సబర్మతి రిపోర్ట్’. ఈ సినిమా 2002లో జరిగిన సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఘటనపై ఆధారపడి తెరకెక్కింది. ఈ సినిమాలో తను నటించడం వల్ల బెదిరింపు కాల్స్ వచ్చాయని ఒక ఈవెంట్‌లో బయటపెట్టాడు విక్రాంత్ మాస్సే. అలా రాగానే దానికి తగిన చర్యలు తీసుకున్నానని, ఇలాంటివంటే తనకు భయం లేదని చెప్పేశాడు. ఒక ఆర్టిస్ట్‌గా ఒక మంచి కథను ప్రేక్షకులను అందించడమే తన లక్ష్యమని అన్నాడు. ‘ది సబర్మతి రిపోర్ట్’ (The Sabarmati Report) సినిమా నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిందని, ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి తాను సిద్ధమని అన్నాడు. నటీనటులకు సినిమాల వల్ల ఇలాంటి బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు.
Also Read: విడాకులు ఫిక్స్ అన్నారు.. ఇప్పుడేంటి ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.. ?
అవే ఉదాహరణ
నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ఇలాంటి ఇబ్బందులు రావడం సహజమే. గతంలో కూడా ఇలా చాలాసార్లు జరిగింది. అలా జరగడం వల్ల కొన్ని సినిమాలు అయితే థియేటర్లలో విడుదల అవ్వకుండా బ్యాన్ అయ్యాయి కూడా. ఇక బాలీవుడ్ చిత్రాల విషయానికొస్తే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పద్మావత్’ పెద్ద భీభత్సాన్నే సృష్టించింది. ఆ మూవీ విడుదల చేయకూడదని దర్శకుడిపై, హీరోయిన్ దీపికా పదుకొనెపై కూడా దాడులు జరిగాయి. దానికి ముందు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘బాజీరావ్ మస్తానీ’కి కూడా అదే సమస్య ఎదురయ్యింది. ఈ కాంట్రవర్సీల వల్ల ఆ సినిమాలకు సరిపడా ప్రమోషన్ కూడా జరిగింది.
స్పీడ్‌గా ప్రమోషన్స్
‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాను రంజన్ చందల్ డైరెక్ట్ చేశారు. ఏక్తా కపూర్, శోభా కపూర్ కలిసి ఈ మూవీని నిర్మించారు. విక్రాంత్ మాస్సే (Vikrant Massey)తో పాటు రాశి ఖన్నా, రిధి డోగ్రా లీడ్ రోల్స్‌లో నటించారు. తాజాగా ఈ సినిమా టీజర్, ట్రైలర్ విడుదలయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నవంబర్ 15న ఈ మూవీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుండగా మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. పలు ప్రాంతాల్లో ప్రెస్ మీట్స్ ఏర్పాటు చేస్తున్నారు. సినిమాలకు సంబంధించిన విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే ‘ది సబర్మతి రిపోర్ట్’పై బీ టౌన్ ఆడియన్స్‌లో భారీ అంచనాలే ఉన్నాయి.