Google Gmail’s New Feature: ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా మీ జీమెయిల్ చదవడం, పంపడం, కంపోజ్ చేయడం సాధ్యమైతే ఎంత బాగుంటుంది కదా ? గూగుల్ ఈ అవసరాన్ని గుర్తించి.. ఆఫ్‌లైన్ జీమెయిల్ (Offline Gmail) అనే అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రత్యేకించి ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని ప్రదేశాల్లో ఉన్నప్పుడు లేదా నెట్‌వర్క్ సమస్యలు ఎదురైనప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌ను ఎలా ఎనేబుల్ చేసుకోవాలో, ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆఫ్‌లైన్ జీమెయిల్ అంటే ఏమిటి ?
ఆఫ్‌లైన్ జీమెయిల్ అనేది గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా పనిచేసే ఒక ఫీచర్. మీరు ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు, మీ జీమెయిల్ ఖాతాలోని నిర్దిష్ట సంఖ్యలో ఇమెయిల్‌లు (ఉదాహరణకు, గత 7, 30 లేదా 90 రోజులలోనివి)సేవ్ చేయబడతాయి. దీనివల్ల ఇంటర్నెట్ లేకపోయినా మీరు ఆ సేవ్ చేయబడిన ఇమెయిల్‌లను చదవగలరు. వాటికి బదులు కూడా తిరిగి ఇవ్వగలరు లేదా కొత్త ఇమెయిల్‌లను కంపోజ్ చేయగలరు. మీరు ఆన్‌లైన్‌లోకి వచ్చిన వెంటనే.. మీరు పంపిన ఇమెయిల్‌లు ఆటోమేటిక్‌గా వెళ్తాయి. మీకు వచ్చిన కొత్త ఇమెయిల్‌లు డౌన్‌లోడ్ అవుతాయి.
ఆఫ్‌లైన్ జీమెయిల్‌ను సెటప్ చేయడం ఎలా?
గూగుల్ క్రోమ్ బ్రౌజర్: ఈ ఫీచర్ కేవలం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో మాత్రమే పనిచేస్తుంది.
ఆఫ్‌లైన్ జీమెయిల్ వెబ్‌సైట్: మీరు mail.google.com ద్వారానే జీమెయిల్‌ను యాక్సెస్ చేయాలి. G Suite Sync for Microsoft Outlook వంటి అప్లికేషన్ల ద్వారా కాదు.
స్టోరేజ్: మీ ఫోన్‌లో ఇమెయిల్ సేవ్ చేసుకోవడానికి తగినంత స్టోరేజ్ ఉండాలి.
స్టెప్- 1: జీమెయిల్ సెట్టింగ్‌లకు వెళ్ళండి.
ముందుగా.. మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో mail.google.comకి వెళ్లి మీ జీమెయిల్ ఖాతాలోకి లాగిన్ అవ్వండి.
కుడి ఎగువ మూలలో ఉన్న సెట్టింగ్స్ ఐకాన్ (గేర్ సింబల్ ⚙️) పై క్లిక్ చేయండి.
డ్రాప్-డౌన్ మెను నుంచి “See all settings” ఎంచుకోండి.
స్టెప్- 2: ఆఫ్‌లైన్ ట్యాబ్‌ను ఎంచుకోండి.
సెట్టింగ్స్ పేజీలో.. మీరు అనేక ట్యాబ్‌లు కనిపిస్తాయి (General, Labels, Inbox మొదలైనవి). వాటిలో “Offline” (ఆఫ్‌లైన్) అనే ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
స్టెప్- 3: ఆఫ్‌లైన్ మెయిల్‌ను ఎనేబుల్ చేయండి
“Offline” ట్యాబ్‌లో, “Enable offline mail” అనే చెక్‌బాక్స్‌ను సెలక్ట్ చేయండి.
మీరు ఈ చెక్‌బాక్స్‌ను సెలక్ట్ చేసిన తర్వాత, సింక్ సెట్టింగ్‌లు కనిపిస్తాయి.
స్టెప్- 4: సింక్ సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి
“Sync settings” (సింక్ సెట్టింగ్‌లు) కింద, మీరు ఎంత కాలం నాటి ఇమెయిల్‌లను ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోండి. మీకు 7 రోజులు, 30 రోజులు లేదా 90 రోజులు వంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎక్కువ రోజులు సెలక్ట్ చేసుకుంటే.. ఎక్కువ స్టోరేజ్ అవసరం అవుతుంది.
“Download attachments” అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు అటాచ్‌మెంట్లను కూడా ఆఫ్‌లైన్‌లో యాక్సెస్ చేయాలంటే దీన్ని సెలక్ట్ చేయండి. ఇది కూడా ఎక్కువ స్టోరేజ్ తీసుకుంటుంది.
“Keep offline data on my computer” లేదా “Remove offline data from my computer” అనే రెండు ఆప్షన్లు ఉంటాయి. మీరు పబ్లిక్ కంప్యూటర్‌లో సెటప్ చేస్తుంటే.. “Remove offline data” ఎంపిక చేసుకోండి. ఫోన్ అయితే.. “Keep offline data” ఎంచుకోండి.
Also Read: సముద్రంలో కూలిన మనుషులు లేని అంతరిక్ష విమానం.. అందులో 166 మంది అస్తికలు, గంజాయి
స్టెప్- 5: మార్పులను సేవ్ చేయండి.
అన్ని సెట్టింగ్‌లను సెలక్ట్ చేసిన తర్వాత, కింద ఉన్న “Save changes” బటన్‌పై క్లిక్ చేయండి.
తర్వాత “Allow” పై క్లిక్ చేయండి.
ఆఫ్‌లైన్‌లో జీమెయిల్‌ను ఎలా ఉపయోగించాలి ?
ఒకసారి సెటప్ పూర్తయిన తర్వాత మీరు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు, మీ క్రోమ్ బ్రౌజర్‌లో mail.google.comకి వెళ్లండి.
ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా మీ ఇమెయిల్‌లను చూడొచ్చు.