Phone to Android Transfer: కొత్త ఫోన్ కొనగానే పాత ఫోన్‌లోని డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి వచ్చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఫోటోలు, కాంటాక్ట్స్, మెసేజ్‌లు, బ్యాంకింగ్ యాప్స్ ఇలా ముఖ్యమైన సమాచారం ఏదీ మిస్ కాకుండా బదిలీ అవుతుందా అనే సందేహం ఉంటుంది. ముఖ్యంగా ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారేటప్పుడు ఈ టెన్షన్ మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే గూగుల్ అందిస్తున్న ‘ఆండ్రాయిడ్ స్విచ్’ టూల్‌తో డేటా బదిలీని గతంలో కంటే సులభంగా చేసుకోవచ్చు. కాకపోతే ట్రాన్స్‌ఫర్ పూర్తయిందని చూపించినంత మాత్రాన డేటా మొత్తం సరిగ్గా వచ్చిందని అనుకోకూడదు. కొత్త ఫోన్‌లో ప్రతిదీ సరిగ్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. లేదంటే ముఖ్యమైన ఫోటోలు, చాట్స్ లేదా ఇతర వివరాలు మిస్ అయ్యే అవకాశం ఉంది.
డేటా మార్చే ముందు పాత ఐఫోన్‌ను ఐక్లౌడ్ లేదా కంప్యూటర్‌లో కచ్చితంగా బ్యాకప్ తీసుకోండి. కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో పాత ఫోన్ డేటా అంతా పట్టేంత స్టోరేజ్ ఉందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. అలాగే ఐఫోన్‌లో ఐమెసేజ్, ఫేస్‌టైమ్ ఆఫ్ చేయడం మర్చిపోవద్దు, లేదంటే తర్వాత వచ్చే మెసేజ్‌లు ఆగిపోయే ఛాన్స్ ఉంది. రెండు ఫోన్లలో ఫుల్ ఛార్జింగ్ ఉంచుకుని, మంచి వైఫై కనెక్షన్ దగ్గర పెట్టుకోండి.
Also Read: రూ.20 వేల నుంచే బెస్ట్ పర్ఫార్మెన్స్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో టాప్-5 శాంసంగ్ ఫోన్లు ఇవే!
ఆండ్రాయిడ్ స్విచ్‌లో పాత క్లాసిక్ విధానంతో పాటు కొత్త అప్‌గ్రేడెడ్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. కేబుల్ ద్వారా కనెక్ట్ చేస్తే కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోలతో పాటు టెక్స్ట్ మెసేజ్‌లు కూడా ఈజీగా వస్తాయి. అదే వైర్‌లెస్ పద్ధతిలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డేటా మార్చుకోవచ్చు. అయితే పిక్సెల్ 8, కొత్త శాంసంగ్ గెలాక్సీ వంటి లేటెస్ట్ ఫోన్లలో ఉండే అప్‌గ్రేడెడ్ ట్రాన్స్‌ఫర్ ద్వారా సేవ్ చేసుకున్న పాస్‌వర్డ్స్, కాల్ హిస్టరీ, వైఫై సెట్టింగ్స్ కూడా నేరుగా కొత్త ఫోన్‌లోకి వచ్చేస్తాయి.
సాధారణ ట్రాన్స్‌ఫర్‌లో వాట్సప్ చాట్స్, ఐక్లౌడ్ ఫొటోలు నేరుగా రావు. వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘మూవ్ చాట్స్ టు ఆండ్రాయిడ్’ ఆప్షన్ ద్వారా క్యూఆర్ కోడ్ సాయంతో చాట్ హిస్టరీని మార్చుకోవాలి. ఐక్లౌడ్‌లోని ఫొటోల కోసం యాపిల్ ప్రైవసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి గూగుల్ ఫొటోస్‌కు కాపీ చేయమని రిక్వెస్ట్ పెట్టాలి. గూగుల్ అకౌంట్‌లో తగినంత స్పేస్ ఉంటే మూడు నుంచి ఏడు రోజుల్లో ఫొటోలన్నీ అందులోకి చేరిపోతాయి.
స్క్రీన్ మీద ట్రాన్స్‌ఫర్ 100 శాతం పూర్తయిందని కనిపించగానే పాత ఐఫోన్‌ను ఫార్మాట్ చేయకండి. కొత్త ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫొటోలు, కాంటాక్ట్స్, వాట్సప్ మెసేజ్‌లు అన్నీ సరిగ్గా ఓపెన్ అవుతున్నాయో లేదో చూడండి. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ లాగిన్ అవుతున్నాయా, ఓటీపీలు వస్తున్నాయా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకున్నాకే పాత ఫోన్ క్లియర్ చేయడం మంచిది.
Also Read: 2027లో యాపిల్ సంచలనం.. ఒకేసారి మార్కెట్లోకి రాబోతున్న 6 కొత్త గాడ్జెట్స్ ఇవే!