5G Network Problems: కొన్నిసార్లు దగ్గర 5G సపోర్ట్ చేసే మంచి స్మార్ట్‌ఫోన్, యాక్టివ్ 5G రీఛార్జ్ ప్లాన్, అలాగే మన ఏరియాలో సిగ్నల్ కవరేజ్ ఉన్నా కూడా ఇంటర్నెట్ 4Gలోనే స్టక్ అయిపోతుంటుంది. మరికొన్నిసార్లు 4Gకి, 5Gకి మధ్య సిగ్నల్ మారుతూ ఇబ్బంది పెడుతుంటుంది. దీనికి ప్రతిసారీ మీ నెట్‌వర్క్ ఆపరేటర్‌ను తప్పుబట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే.. సమస్య మీ ఫోన్‌లోని చిన్న సెట్టింగ్ వల్ల కూడా కావచ్చు. పాత సిమ్ కార్డ్, బ్యాటరీ సేవర్ మోడ్ లేదా నెట్‌వర్క్ సెట్టింగ్స్ కారణంగా 5G కనెక్షన్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. మరి ఫోన్‌లో 5G సరిగ్గా పనిచేయాలంటే ఏం చేయాలి? ఏయే సెట్టింగ్స్ మార్చాలి? వంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
ముందుగా మీ ఫోన్ ఇండియాలోని నెట్‌వర్క్ బ్యాండ్స్‌కు సపోర్ట్ చేస్తుందో లేదో చూసుకోవాలి. ముఖ్యంగా విదేశాల నుంచి ఫోన్ కొనుగోలు చేసినప్పుడు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది. అలాగే మీ సిమ్ కార్డ్ మరీ పాతదైతే 5Gకి సపోర్ట్ చేయకపోవచ్చు. మీ నెట్‌వర్క్ యాప్‌లో మీ నంబర్‌కు 5G అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకుని, అవసరమైతే సిమ్ అప్‌గ్రేడ్ చేసుకోండి.
కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో డీఫాల్ట్‌గా 4G మాత్రమే సెట్ అయి ఉంటుంది. శాంసంగ్ ఫోన్ వాడేవారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి కనెక్షన్స్, ఆ తర్వాత మొబైల్ నెట్‌వర్క్స్‌పై క్లిక్ చేయాలి. అక్కడ నెట్‌వర్క్ మోడ్‌లో 5G ఆటో కనెక్ట్ ఎంచుకోండి. గూగుల్ పిక్సెల్ లేదా ఇతర ఫోన్‌లలో నెట్‌వర్క్ అండ్ ఇంటర్నెట్ విభాగంలోని సిమ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, ప్రిఫర్డ్ నెట్‌వర్క్ టైప్‌ను 5Gకి మార్చుకోవాలి.
Also Read: గతేడాది 70 వేలు.. ఈసారి 54 లక్షలు! భారత్‌లో మెటా ఇంత దూకుడుగా వ్యవహరించడానికి కారణం ఇదే!
ఐఫోన్ 12 లేదా ఆ తర్వాతి మోడల్స్ వాడేవారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి మొబైల్ డేటా, ఆ తర్వాత మొబైల్ డేటా ఆప్షన్స్ ఓపెన్ చేయాలి. అందులో వాయిస్ అండ్ డేటాపై క్లిక్ చేసి ‘5G ఆటో’ లేదా ‘5G ఆన్’ ఎంచుకోండి. 5G ఆటో పెట్టుకుంటే బ్యాటరీ సేవ్ అవుతుంది. అలాగే 5G ఆన్ పెట్టుకుంటే సిగ్నల్ ఉన్నంతసేపు స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది.
కొన్నిసార్లు ఇంటి లోపల 5G సిగ్నల్ బలహీనంగా ఉండవచ్చు. కాబట్టి ఒకసారి బయటకు వచ్చి చెక్ చేయండి. అలాగే పది సెకన్ల పాటు ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేసి ఆఫ్ చేయడం లేదా ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం వల్ల నెట్‌వర్క్ రీఫ్రెష్ అవుతుంది. బ్యాటరీ సేవర్ మోడ్ ఆన్‌లో ఉన్నా 5G ఆగిపోతుంది కాబట్టి.. దాన్ని ఆఫ్ చేయండి. అప్పటికీ పనిచేయకపోతే ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయండి, చివరి ప్రయత్నంగా నెట్‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్ చేసి చూడండి.