బంగారం భూమిలో నిక్షిప్తం అయిన ఖనిజం. దాన్ని వెలికితీసి, శుద్ధి చేసి, మన అవసరాలకు తగినట్టుగా ఉపయోగించుకుంటాం. అయితే దీన్ని వెలికితీసే ప్రక్రియ చాలా ఖరీదైనది కావడంతో బంగారం విలువ కూడా ఎక్కువ. ఎందుకంటే బంగారం భూమిలోని అత్యంత లోపలి పొరల్లో దాగి ఉంటుంది.
ఉబికి వస్తున్న బంగారం
భూమి పొరల్ని కోర్, మాంటెల్, క్రస్ట్.. అనే మూడు రకాలుగా విభజిస్తారు. కోర్ అనేది అత్యంత లోపలి పొర. ఇందులో ఇన్నర్ కోర్, ఔటర్ కోర్ ఉంటాయి. దానిపైన మాంటెల్ ఉంటింది, ఆ పైన క్రస్ట్ ఉంటుంది. సహజంగా క్రస్ట్ లోనే మనకు లోహాలు లభిస్తుంటాయి. అయితే బంగారం, రుథేనియం వంటి విలువైన లోహాలు మాత్రం భూమిలోని అత్యంత లోపలి పొర కోర్ లో ఉంటాయని అంటారు. భూమి ఏర్పడినప్పుడే ఆ విలువైన లోహాలు కోర్ లో లాక్ చేయబడ్డాయనేది శాస్త్రవేత్తల వాదన. అలా లాక్ చేయబడిన గోల్డ్ ని కోర్ నుంచి బయటకు తీయడం కష్టసాధ్యం అని భావించేవారు. అయితే భూమి కోర్ నుంచి బంగారం ఇతర విలువైన లోహాలు లీక్ అవుతున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు గమనించారు. అది కూడా అన్ని ప్రాంతాల్లో కాదు. హవాయిలోని అగ్నిపర్వత శిలలపై తొలిసారిగా నిర్వహించిన విశ్లేషణలో భూమి లోపల ఉన్న కోర్ నుంచి బంగారం, ఇతర విలువైన లోహాలు పైకి ఉబికి వస్తున్నట్టు గమనించారు.
హవాయి ప్రాంతంలో..
అగ్నిపర్వతాలు పేలినప్పుడు భూమిలోపలనుంచి లావా బయటకు వస్తుంది. ఆ లావాతోపాటు.. ఆయా ప్రాంతాల్లో ఉన్న లోహాల మిశ్రమం కూడా బయటకు వస్తుంది. అయితే ఇందులో బంగారం వంటివి అవక్షేప రూపంలో ఉండటం చాలా అరుదు. కానీ హవాయి ప్రాంతంలో మాత్రం బంగారం, రుథేనియం ఇలా అగ్నిపర్వతం నుంచి బయటకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
గోట్టింగెన్ యూనివర్శిటీ పరిశోధన
హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలలలో రుథేనియం నిల్వలను ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ శిలలకు మూలం కోర్-మాంటెల్ సరిహద్దుల్లో ఉందని తెలుస్తోంది. హవాయిలోని అగ్నిపర్వత బసాల్ట్ శిలలకు మూలం మాంటెల్ పొరల్లో ఉంది. అయితే ఇందులో బంగారం, ఇతర విలువైన లోహాలు ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. వాస్తవానికి బంగారం కోర్ లో ఎక్కువగా ఉంటుంది. అంటే కోర్ నుంచి మాంటెల్ కి అది లీక్ అయిందని, అలా అగ్నిపర్వత బసాల్ట్ శిలలలో చేరి భూమి పై భాగానికి చేరి ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గోట్టింగెన్ విశ్వవిద్యాలయ పరిశోధన బృందం ఈ విషయాన్ని నిర్థారించింది. తమ పరిశోధన ఫలితాలు వచ్చినప్పుడు తాము బంగారాన్ని కనుగొన్నామని తెలిసిందని అన్నారు నిల్స్ మెస్లింగ్.
అగ్నిపర్వత శిలల ఆధారంగా..
కోర్-మాంటెల్ మధ్య ఉన్న సంబంధాలను అధ్యయనం చేయడానికి కూడా హవాయి ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత శిలలు ఉపయోగపడతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. హవాయి వంటి సముద్ర ద్వీపాలు కూడా ఇలా అగ్నిపర్వత శిలల వల్లే ఏర్పడ్డాయి. లావా పైకి ఉబికి వచ్చి గట్టిపడి ద్వీపాలుగా మారాయి. గోట్టింగెన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలు బంగారం కొత్త ఉనికిని చూపెట్టాయి. బంగారం పైకి ఉబికి వస్తుందని చెప్పిన ఈ పరిశోధనలు ఆసక్తిగా మారాయి.