Corona Virus : అంతా మర్చిపోయారు. భయమనేదే లేకుండా బతుకుతున్నారు. మాస్కులు లేవు. శానిటైజర్లు రాసుకోవడాలు లేదు. సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు. అంతా మామూలుగానే నడుస్తోంది జీవితం. ఇలాంటి సమయంలో మళ్లీ సడెన్‌గా ఊడిపడింది కరోనా రక్కసి. ఆ పేరు వినబడగానే అంతా ఉలిక్కిపడ్డారు. వామ్మో.. మళ్లీ కరోనానా అంటూ హడలిపోయారు. గూగుల్‌లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడా ఇక్కడా కేసులంటూ వార్తలు చూసి.. హాంకాంగ్, సింగపూర్ అట, ఇంకా మనదాకా రాలేదులే.. వచ్చాక చూద్దాంలే అని అనుకున్నారు. అంతలోనే.. మీ రాష్ట్రానికొచ్చా.. మీ నగరానికొచ్చా.. అంటూ కొవిడ్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూశాయి.
తెలుగు స్టేట్స్ అలర్ట్
ప్రస్తుతానికైతే ఏపీలో రెండు, హైదరాబాద్‌లో ఒకటి. ఈ న్యూస్ మీరు చదివే టైమ్‌కి కొవిడ్ కేసులు ఇంకా పెరిగినా ఆశ్చర్యం అవసరం లేదు. దెబ్బకు బెదిరిపోతున్నారు అంతా. కరోనా పీడకల జనాల్ని ఇంకా వదిలిపెట్టలేదు. మళ్లీ మాస్కుల కోసం వెతుకుతున్నారు. డోలో షీట్లు కొనితెచ్చుకుంటున్నారు. కరోనా కేసులు ఎన్ని? అంటూ ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో 30 పడకలతో ప్రత్యేక వార్డు స్టార్ట్ చేశారు అధికారులు. ఏపీ సైతం కొవిడ్‌కు సన్నద్ధంగా ఉంది. ప్రజలు భయపడాల్సిన పని లేదని.. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రమాదమూ లేదని అభయం ఇస్తోంది వైద్య శాఖ. అయినా, ఎవరి భయం వారిదే.
కరోనా వేగంగా..
ఢిల్లీ, ముంబై, కేరళలో కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తమిళనాడు, కర్నాటక, ఏపీ, తెలంగాణలోనూ కరోనా కాలు పెట్టింది. దేశ రాజధానిలో 23 కేసులు నమోదవగా. ముంబైలో 95 కేసులు పాజిటివ్‌గా తేలాయి. అత్యధికంగా కేరళలో 273 కేసులు ఫైల్ అయ్యాయి. గత కొవిడ్ టైమ్‌లోనూ కేరళలోనే కేసులు అత్యధికం. ఈసారి కూడా కేరళలనే ముందుండటంతో.. పాత రోజులు తిరిగొస్తాయేమోననే భయం.
కరోనా రెండు వేరియంట్లు..
కొవిడ్ కేసులు ఉన్న రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. వైరస్ టెస్టింగ్ కిట్స్, ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో జేఎన్ 1 రకం వేరియంట్ వ్యాపిస్తోందని తెలిపింది. జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, నీరసం, ముక్కు కారడం లాంటి లక్షణాలు ఉంటాయని అంటోంది. నాలుగైదు రోజుల్లో బాధితులు కోలుకుంటారని వెల్లడించింది. ఇదేమీ ఆందోళన కలిగించే రకం కాదని, భయపడాల్సిన పని లేదని చెబుతోంది కేంద్ర ఆరోగ్య శాఖ. కొవిడ్ కొత్త వేరియంట్లు NB.1.8.1 .. LF.7.. రకాలను భారత్‌లో INSACOG వెల్లడించింది. ఈ రెండూ జేఎన్ 1 కు ఉపరకాలని తెలిపింది. వీటి వ్యాప్తి అధికంగా ఉందని చెబుతోంది. హాంకాంగ్, సింగపూర్, థాయ్‌లాండ్, చైనాలో వారానికి వేల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేరియంట్లలో కలిగే సహజ మార్పులే ప్రస్తుత కేసుల వ్యాప్తికి కారణం అని చెబుతున్నారు సైంటిస్టులు.
Also Read : మళ్లీ గోల్డ్ రన్.. లక్ష రెండోసారి..!
జర జాగ్రత్త..
ఎవరేం చెప్పినా.. మన జాగ్రత్తలో మనం ఉండటమే మనకు రక్ష.. అనే విషయం గత కొవిడ్ అనుభవంతో బాగా తెలిసొచ్చింది. అందుకే, తరుచూ చేతులు కడుక్కోవడం, ఇమ్యూనిటీ పెంచుకోవడం, అవసరమైతే మాస్కులు ధరించడం.. లాంటివి ఇప్పుటినుంచే మొదలుపెట్టేస్తే మంచిదేమో. భయపడకుండా, జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది.