ChatGPT Wrong Answers Kim Kardashian| ఇప్పుడు అందరి జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భాగమైపోయింది. చాలా మంది విద్యార్థులు, ఉద్యోగస్తులు చదువుకోవడానికి లేదా పని చేయడానికి AIని ఉపయోగిస్తున్నారు. కానీ AIపైనే పూర్తిగా ఆధారపడితే కొన్నిసార్లు ఊహించని సమస్యలు ఎదరవుతున్నాయి. ఇటీవల ఒక ప్రముఖ ఫ్యాషన్ సెలబ్రిటీ తాను రాసిన ఒక ముఖ్యమైన పరీక్షలో AI వల్ల ఫెయిల్ అయినట్టు తెలిపింది.
అమెరికా దేశానికి చెందిన సెలెబ్రిటీ ఫ్యాషన్ మోడల్స్ లో కిమ్ కార్డషియాన్ ఒకరు. ఆమె ప్రస్తుతం న్యాయ విద్య కోర్సు చేస్తోంది. అయితే పరీక్షల కోసం చాట్‌జీపీటీ (ChatGPT) సాయం తీసుకుంది. ఆమె తన లా క్లాస్ నోట్స్ ఫోటోలు తీసి చాట్‌జీపీటీకి పంపి, వాటికి సరళ పద్ధతిలో సమాధానాలు అడిగింది. అయితే చాట్‌జీపీటీ తప్పుడు సమాధానాలు ఇచ్చింది. కార్డషియాన్ మాత్రం వాటిని పూర్తిగా నమ్మింది. ఆ సమాధానాల ఆధారంగా పరీక్షలు రాసి చివరికి ఫెయిల్ అయింది.
కిమ్ 2019లో లా చదువు మొదలుపెట్టింది. సాధారణ కాలేజీ మార్గం కాకుండా ప్రత్యేకమైన ప్రోగ్రామ్‌లో చేరింది. 2021లో ‘బేబీ బార్’ పరీక్ష పాస్ అయింది. మే 2025 లో లా డిగ్రీ పూర్తి చేసింది. ఇప్పుడు బార్ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తోంది.
వానిటీ ఫెయిర్ అనే సెలెబ్రిటీ మేగజైన్ చేసిన ఇంటర్వ్యూలో భాగంగా కిమ్ కార్డషియాన్ ఒక లై డిటెక్టర్ టెస్ట్ లో పాల్గొనింది. ఆ సమయంలోనే పరీక్షలు ఫెయిల్ అయిన సంగతి వెల్లడించింది. “AIని స్నేహితుడిగా భావిస్తారా?” అని ప్రశ్నించగా.. కిమ్ నవ్వి “లేదు” అని దానికి గల కారణాల గురించి వివరిస్తూ.. తన చేదు అనుభవాలు చెప్పింది.
విద్యా నిపుణులు ఏఐ వినియోగంపై హెచ్చరిస్తున్నారు. విద్యార్థులు AIపై పూర్తిగా ఆధారపడకూడదు. AI సమాధానాలు సరైనవే అనిపించినా అందులో తప్పులు ఉండవచ్చు. ప్రతి సమాచారాన్ని తప్పనిసరిగా ఫ్యాక్ట్-చెక్ చేయాలి. సరైన విద్య అభ్యసించడానికి క్రిటికల్ థింకింగ్ అవసరమని సూచిస్తున్నారు.
చాట్‌జీపీటీ వంటి టూల్స్ బ్రెయిన్‌స్టార్మింగ్, ఐడియాలు రూపొందించడానికి మాత్రమే ఉపయోగపడతాయి. స్కూల్, కాలేజీ చదువులకు బదులుగా AIని ఉపయోగించకూడదు. AI ఇచ్చిన సమాచారాన్ని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు, తనిఖీ చేయాలి.
కిమ్ తనకు ఎదురైన చేదు అనుభవం తర్వాత AIని జాగ్రత్తగా ఉపయోగించి ఫైనల్ పరీక్ష పాస్ అయింది. ఆమె అనుభవం మిగతా వారికి ఒక హెచ్చరిక లాంటిది. టెక్నాలజీ మోసం చేయవచ్చు కాబట్టి, విద్యార్థులు సమాచారాన్ని స్వయంగా వెరిఫై చేసుకోవాలి.
ఇది ప్రపంచవ్యాప్త సమస్య. కోట్లాది మంది విద్యార్థులు చాట్‌జీపీటీతో హోంవర్క్ చేస్తున్నారు. తప్పుడు సమాచారం కారణంగా చాలా మంది నష్టపోతున్నారు. విద్యా వ్యవస్థలు AIని బాధ్యతాయుతంగా ఉపయోగించే మార్గాలు సూచించాల్సిన అవసరం ఉంది.
Also Read: సైబర్ మోసగాళ్లకు చెక్.. ఫేక్ కాల్స్, SMSలను ఇలా గుర్తించండి