iPhone 17 sales| ఆపిల్ గత వారం ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉన్నాయి. భారతదేశం, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ 17 కొనుగోలు చేసేందుకు ఆపిల్ ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. ఆన్ లైన్ లో అయితే ఆర్డర్లు రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి.
ఐఫోన్ 17 కాస్మిక్ ఆరెంజ్ వేరియంట్ మూడు రోజుల్లో నో స్టాక్
ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లోని కాస్మిక్ ఆరెంజ్ రంగు అభిమానుల ఫేవరెట్‌గా నిలిచింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. ఈ రంగు వేరియంట్ ప్రీ-ఆర్డర్ మొదలైన మూడు రోజుల్లోనే అమ్ముడైపోయింది. ఆపిల్ ప్రతినిధి ఒకరు.. కాస్మిక్ ఆరెంజ్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్టాక్ మొత్తం క్లియర్ అయిపోయిందని ధృవీకరించారు.
ఈ రంగుకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో, ఆపిల్ ఇప్పుడు మరిన్ని యూనిట్లను తయారు చేయడానికి ప్రయత్నిస్తోంది. డీప్ బ్లూ, సిల్వర్ రంగులు కొన్ని ఎంపిక చేసిన స్టోర్లలో మాత్రమే లభిస్తున్నాయి. కానీ ఆరెంజ్ అత్యంత పాపులర్.
స్టోర్ పిక్-అప్ ఆప్షన్ లేదు
భారతదేశంలో ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అన్ని వెర్షన్లకు స్టోర్ పిక్-అప్ ఆప్షన్ ప్రస్తుతం లేదు. అయితే, సెప్టెంబర్ 19 నుంచి అధికారికంగా అమ్మకాలు మొదలైనప్పుడు, స్టోర్లలో చాలా తక్కువ యూనిట్లు లభించే అవకాశం ఉంది.
ప్రీ-ఆర్డర్లలో ఐఫోన్ 16ని మించిన ఐఫోన్ 17 సిరీస్
TF సెక్యూరిటీస్ విశ్లేషకుడు మింగ్-చి కువో సోషల్ మీడియాలో షేర్ చేసిన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 17 సిరీస్‌కు గత సంవత్సరం ఐఫోన్ 16 సిరీస్ కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ సిరీస్ ఓపెనింగ్ వీకెండ్‌లో గత ఏడాది కంటే ఎక్కువ ప్రీ-ఆర్డర్లను సాధించింది. ఈ భారీ డిమాండ్ కారణంగా.. ఆపిల్ ఈ సంవత్సరం మూడో త్రైమాసికంలో ఐఫోన్ 17 సిరీస్ తయారీని గత సంవత్సరం కంటే 25 శాతం పెంచుతోంది.
ఐఫోన్ ఎయిర్‌కు తక్కువ డిమాండ్
ఐఫోన్ 17 సిరీస్‌లోని ఇతర మోడల్స్‌కు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ.. ఐఫోన్ ఎయిర్ మాత్రం గత సంవత్సరం ఐఫోన్ 16 ప్లస్ స్థాయిలో ప్రీ-ఆర్డర్లను ఆకర్షించలేకపోయింది. కువో ప్రకారం, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఈ సిరీస్‌లో అత్యంత జనాదరణ పొందిన ఫోన్.
ఇప్పటికీ గ్లోబల్ సేల్స్‌లో ఐఫోన్ 16 టాప్
ఐఫోన్ 17 సిరీస్‌కు విపరీతంగా క్రేజ్ ఉన్నా.. ఐఫోన్ 16 ఈ ఏడాది Q2లో ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. Q1లో కూడా ఇది నెంబర్ వన్. ఫిబ్రవరిలో లాంచ్ అయిన ఐఫోన్ 16e, ఆల్-టైమ్ టాప్ 10 స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చోటు సంపాదించింది. భారతదేశంలో కూడా ఆపిల్ జోరు కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో ఆపిల్ భారత్‌లో.. 9 బిలియన్ డాలర్ల అమ్మకాల రికార్డును నమోదు చేసింది.
Also Read: అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్విగ్గీలో ఎక్కువ డిస్కౌంట్ కావాలా? ఈ క్రెడిట్ కార్డ్స్ ఉంటే సరి