SpaDeX : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO).. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసి స్పేడెక్స్ ఉపగ్రహాల అనుసంధానాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.
ఇస్రో.. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇక నూతన ఏడాది ప్రారంభంలోనే మరో ఘనత సాధించి చరిత్ర సృష్టించింది. ఇటీవల ఇస్రో నింగిలోకి పంపించిన రెండు ఉపగ్రహాలు విజయవంతంగా అనుసంధానం అయ్యాయి. దీంతో స్పేడెక్స్ (SpaDeX) డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని ఇస్రో (ISRO) ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
స్పేడెక్స్ కు శ్రీకారం –
ఇస్రో.. డిసెంబరు 30, 2024న తిరుపతి జిల్లాలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్‌సెంటర్ (SHAR) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-C60 (PSLV)లో జంట ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. ప్రయోగ వేదిక నుంచి PSLV బయలుదేరిన 15.09 నిమిషాలకు SpaDeX-1B, 15.12 నిమిషాలకు SpaDeX-1A రాకెట్ నుంచి విడిపోయాయి. ఆపై వీటి డాకింగ్ (Docking) కోసం ఇప్పటికే ఇస్రో మూడుసార్లు ప్రయత్నించింది. అయినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.
చివరకు గురువారం వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టింది ఇస్రో. ఈ క్రమంలోనే రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇక 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు దూరాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ (Docking) ప్రక్రియ మొదలుపెట్టారు. ఆపై ఈ పక్రియ విజయవంతమైంది.
ఈ విజయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన ఇస్రో…. ఈ ప్రయోగం కోసం శ్రమించిన సాంకేతిక బృందానికి, యావత్ భారతీయులకు అభినందనలు తెలిపింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే ఈ ఘనత సాధించాయని.. ఇప్పుడు ఈ రెండు ఉపగ్రహాలను డాకింగ్ తో భారత్ సైతం వాటి చెంత చేరిందని ఇస్రో వెల్లడించింది.
ప్రధాని శుభాకాంక్షలు –
ఇస్రో సాధించిన ఈ ఘనతపై భారత ప్రధాని మోదీ స్పందించారు. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసి భారత్ అంతరిక్ష రంగాన్ని మరో మెట్టు ఎక్కించిన ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక బృందానికి అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో భారత్ సాధించబోయో అంతరిక్ష ప్రయోగాలను ఇదే కీలక మెట్టుగా నిలిచిపోతుందన్నారు.
Congratulations to our scientists at @isro and the entire space fraternity for the successful demonstration of space docking of satellites. It is a significant stepping stone for India’s ambitious space missions in the years to come.
— Narendra Modi (@narendramodi) January 16, 2025