JioTag 2 vs Apple AirTag 2: నిత్యం వాడే బైక్ తాళాలు, పర్స్, ఆఫీస్ బ్యాగ్స్ వంటివి ఎక్కడో పెట్టి మర్చిపోవడం చాలామందికి అలవాటే. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా మార్కెట్లోకి బ్లూటూత్ ట్రాకర్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా రిలయన్స్ జియో తన సెకండ్ జనరేషన్ ‘జియోట్యాగ్ 2’ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది యాపిల్‌కు చెందిన ‘ఎయిర్‌ట్యాగ్ 2’కి గట్టి పోటీ ఇస్తోంది. బెనిఫిట్స్ పరంగా రెండింటి లక్ష్యం ఒక్కటే అయినా.. ధర, నెట్‌వర్క్, బ్యాటరీ, సాంకేతికత విషయంలో వీటిలో చాలా తేడాలు ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
జియోట్యాగ్ 2లోని అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని క్రాస్ ప్లాట్‌ఫామ్ సపోర్ట్. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలోని గూగుల్ ‘ఫైండ్ హబ్’ (Find Hub) నెట్‌వర్క్‌తో పాటు ఐఫోన్లలోని ఆపిల్ ‘ఫైండ్ మై’ (Find My) నెట్‌వర్క్‌తో కూడా పనిచేస్తుంది. అంటే ఇంట్లో ఆండ్రాయిడ్, IOS డివైజ్లు ఉన్నవారెవరైనా దీనిని సులువుగా వాడుకోవచ్చు. కానీ ‘యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2’ మాత్రం కేవలం యాపిల్ ఈకోసిస్టమ్‌కు మాత్రమే సపోర్ట్ చేయనుంది. ఇది కేవలం ఐఫోన్, ఐప్యాడ్ యూజర్లకు మాత్రమే పనికొస్తుంది.
జియోట్యాగ్ 2 పూర్తిగా బ్లూటూత్ లోని ఎనర్జీ (BLE) సాంకేతికతపై ఆధారపడి పనిచేస్తుంది. దగ్గరలోని బ్లూటూత్ పరికరాల ఆధారంగా ఇది వస్తువు ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుంది. అయితే ‘యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2’ లో బ్లూటూత్‌తో పాటు సెకండ్ జనరేషన్ ‘అల్ట్రా వైడ్‌బాండ్ (U2)’ చిప్‌ను అమర్చారు. దీనివల్ల వస్తువు ఎక్కడ ఉందో అత్యంత కచ్చితంగా కనుక్కోవచ్చు.
సౌండ్ విషయంలో ‘జియోట్యాగ్ 2’ స్పష్టమైన పైచేయి సాధిస్తోంది. ఇందులో ఏకంగా 120 dB వరకు శబ్దం చేసే బజర్ ఉంది. కాబట్టి కాస్త దూరంలో ఉన్నా, ఇంట్లో ఏ మూలన దాగున్న వస్తువును ఈజీగా గుర్తించొచ్చు. అయితే యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2 శబ్దం 85 dB వరకు మాత్రమే ఉంది. దీని వల్ల వస్తువు శబ్దం ఆధారంగా వస్తువును గుర్తించడం కాస్త కష్టమయ్యే ఛాన్స్ ఉంది.
జియోట్యాగ్ 2 పాలీకార్బోనేట్ బాడీతో రూపొందింది. దీనికి కీచైన్ తగిలించడానికి నేరుగా హోల్ సైతం ఇచ్చారు. అలాగే దీనికి IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ను సైతం అందించారు. మరోవైపు ఆపిల్ ఎయిర్‌ట్యాగ్ 2 ప్లాస్టిక్ టాప్, స్టెయిన్‌లెస్ స్టీల్ బాటమ్‌తో ప్రీమియం లుక్‌లో ఉంది. ఇది IP67 రేటింగ్ కలిగి ఉండటం వల్ల 1 మీటరు లోతు నీటిలో 30 నిమిషాల వరకు ఉన్నా పాడవదు.
రెండు పరికరాల్లోనూ మార్చుకోగలిగే CR2032 బటన్ సెల్ బ్యాటరీలనే ఉపయోగించారు. జియోట్యాగ్ 2 బ్యాటరీ 8 నుండి 12 నెలల వరకు వస్తుందని సంస్థ చెబుతోంది. దీనికి తోడు జియో బాక్స్‌లోనే మరో స్పేర్ బ్యాటరీని కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఇక ‘యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2’ ఒకసారి బ్యాటరీ వేస్తే దాదాపు రెండేళ్ల వరకు పనిచేయనుంది. అయితే బాక్స్‌లో అదనంగా మరో బ్యాటరీ ఏమీ లభించదు.
ధర విషయానికి వస్తే రెండింటి మధ్య చాలా పెద్ద వ్యత్యాసం ఉంది. జియోట్యాగ్-2 రూ. 1,249లకే లభిస్తుంది. ఇది నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో అందుబాటులో ఉంది. కానీ ‘యాపిల్ ఎయిర్‌ట్యాగ్-2’ ధర రూ. 3,790గా ఉంది. ఇది కేవలం వైట్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభిస్తోంది.
Also Read: రూ.400 కే లైవ్ టీవీ, వైఫై, ఓటీటీ.. జియో నుంచి సరికొత్త ‘జియోహోమ్’ ప్యాక్‌లు!
ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతూ.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ శబ్దం చేసే మంచి ట్రాకర్ కావాలనుకుంటే జియోట్యాగ్ 2 బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా మీరు పూర్తిగా యాపిల్ ప్రొడక్ట్స్ వాడుతూ.. బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మాత్రం హ్యాపీగా యాపిల్ ఎయిర్ ట్యాగ్ – 2 కొనుగోలు చేయవచ్చు. అత్యంత కచ్చితమైన లొకేషన్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ దీని అడ్వాంటేజీలుగా చెప్పవచ్చు.
Also Read: BSNL మరో సంచలనం.. రూ. 897 కే 6 నెలల వ్యాలిడిటీ.. ఈ ప్లాన్ ఎంత బాగుందో..!