La Nina affect On India’s Climate: తరచుగా మనం వాతావరణ వార్తలు వింటుంటాం. ఆ సమయంలో ఎల్ నినో, లా నినా అనే పదాలు వినిపిస్తుంటాయి. ఇంతకీ ఎల్ నినో, లా నినా అంటే ఏంటి? అనేది చాలా మందికి తెలియదు. ముందుగా వీటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఆ తర్వాత లా నినా ఎఫెక్ట్ ఈసారి భారత్ మీద ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.
ఎల్ నినో, లా నినా అంటే..
ఎల్ నినో: ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు అతిగా ఉండడాన్ని ఎల్ నినో అంటారు. దీని ప్రభావంతో కొన్ని దేశాల్లో తీవ్ర ఉష్ణోగ్రతల వల్ల కరువు కాటకాలు, మరికొన్ని దేశాల్లో అతి, అకాల వర్షాలతో వరదలు వస్తాయి. భారత్ లో దీని ప్రభావం వల్ల రుతుపవన వ్యవస్థ దెబ్బతింటుంది. వర్షపాతం భారీగా తగ్గిపోతుంది. కరువు కాటకాలకు కారణం అవుతుంది. అమెరికాల లాంటి దేశాల్లో అధిక వర్షపాతానికి కారణం అవుతుంది.
లా నినా: ఇక సముద్ర ఉపరితల జలాలు సగటు కంటే చల్లగా ఉండటాన్ని లా నినా అంటారు. లా నినా కారణంగా భారత్ లో రుతుపవనాలు చక్కగా విస్తరిస్తాయి. సాధారణం లేదంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. అదే సమయంలో ఆఫ్రికన్ కంట్రీస్ లో కరువు కాటకాలకు కారణం అవుతుంది.
గత ఏడాది భారత్ మీద ఎల్ నినో ఎఫెక్ట్!
గత ఏడాది వాతావరణ అధికారులు ఎల్ నినో, లా నినో గురించి కీలక విషయాలు వెల్లడించారు. జులై 2024 లోగా ఎల్ నినో ప్రభావం తగ్గి, లా నినా ఏర్పడుతుందని అంచనా వేశారు. కానీ, ఈ అంచనాలు తప్పాయి. ఆ తర్వాత భారత వాతావరణ శాఖ ఈ అంచనాలను సవరిస్తూ.. 2024 చివరి నాటికి లేదంటే 2025 ప్రారంభంలో లా నినా వస్తుందని వెల్లడించింది. దీని ప్రభావంతో తేలికపాటి శీతాకాలం ఉంటుందని అంచనా వేసింది. ఈ దశాబ్దంలో ఇప్పటి వరకు 2020, 2022లో లా నినా రాగా, ఈసారి కూడా లా నినా ఏర్పడితే.. ట్రిపుల్ డిప్ లా నినాగా పిలిచే అవకాశం ఉంటుంది.
నిజానికి తూర్పు, మధ్య పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చల్లగా మారినప్పుడు లా నినా ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్ని దేశాల్లో సమృద్ధిగా వర్షపాతం నమోదైతే, మరికొన్ని ప్రాంతాల్లో కరువు కాటకాలు ఏర్పాడుతాయి. ముఖ్యంగా భారత్ లో లా నినా కారణంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. వ్యవసాయానికి మరింత మేలు కలుగుతుంది. చక్కటి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో కరువు ఏర్పడుతుంది. అట్లాటిక్ మహా సముద్రంలో తుఫానులు తీవ్రతరం అవుతాయి. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదవుతుంది.
భారత్ మీద లా నినా ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే?
⦿ లా నినా ప్రభావం వల్ల భారత్ లో శీతాకాలం తీవ్ర చలిగాలులకు కారణం అవుతుంది. పగటి ఉష్ణోగ్రతలు కాస్త ఎక్కువగా ఉంటాయి.
⦿ లా నినా ప్రభావం వల్ల కాలుష్యం తగ్గి, గాలి నాణ్యత పెరుగుతుంది.
⦿ లా నినా కారణంగా రుతుపవనాలు చురుగ్గా విస్తరిస్తాయి. సాధారణం నుంచి అధిక వర్షాపాతం నమోదు అవుతుంది.
⦿ లా నినా వేసవి తీవ్రతను తగ్గిస్తుంది. ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలకు ఉపశమనం కలిగిస్తుంది.
లా నినా భారత్ కు ఎందుకు మంచిదంటే?
⦿ వ్యవసాయం: లా నినా కారణంగా రుతుపవనాలు బలంగా విస్తరిస్తాయి. మంచి వర్షాలు కురిసి వ్యవసాయానికి మేలు చేస్తుంది. పంటలు సమృద్ధిగా పండుతాయి.
⦿ జల వనరులు: సరిపడ వర్షాలు కురవడం వల్ల జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతుంది.
⦿ సరిపడ విద్యుత్: ఎక్కువ వర్షపాతం వల్ల సరిపడ జల విద్యుత్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿వేడి నుంచి ఉపశమనం: లా నినా కారణంగా వేసవిలో తీవ్రమైన వేడి గాలుల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.
ఈ ఏడాది (2025) ప్రారంభంలో లా నినా ఏర్పడితే, భారత్ కు మేలు కలిగే అవకాశం ఉంటుంది. చక్కటి రుతపవన సీజన్ ను ఏర్పడే అవకాశం ఉంటుంది.
Read Also: భూమ్మీద మానవులు అంతరిస్తే? మన స్థానంలోకి వచ్చే తెలివైన జంతువు ఏదో తెలుసా?