Laptop screen cleaning: మనలో చాలామందికి స్క్రీన్ మీద చిన్న మరక కనిపించగానే.. వెంటనే వెట్ వైప్స్ లేదా డిస్‌ఇన్ఫెక్టెంట్ వైప్స్ గుర్తొస్తాయి. చేతులు తుడుచుకునే వైప్స్‌తోనో, కిచెన్ వైప్స్‌తోనో, లేదంటే.. ఆల్కహాల్ ఎక్కువగా ఉండే.. శానిటైజర్ వైప్స్‌తోనో ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను గట్టిగా తుడిచేస్తుంటారు. అప్పటికప్పుడు స్క్రీన్ మెరిసినట్లు కనిపించినా, లోపల పెద్ద నష్టం జరుగుతూ ఉంటుంది. ఇప్పటి లేటెస్ట్ ల్యాప్‌టాప్‌ల OLED, IPS LCD, రెటినా డిస్‌ప్లేల మీద యాంటీ-గ్లేర్, ఓలియోఫోబిక్ అనే ప్రత్యేక కోటింగ్స్ ఉంటాయి. బయట లైటింగ్ రిఫ్లెక్ట్ కాకుండా కళ్లకు హాయిగా ఉండటానికి, ఫింగర్‌ప్రింట్స్ అంత త్వరగా పడకుండా ఉండటానికి కంపెనీలు ఈ లేయర్స్ వేస్తాయి.
ఏ వైప్స్, క్లీనర్స్ అస్సలు వాడకూడదు?
1.ఆల్కహాల్, అమ్మోనియా, బ్లీచ్ వైప్స్: ఇవి స్క్రీన్ పై ఉండే ప్రొటెక్టివ్ కోటింగ్‌ను మెల్లగా కరిగేలా చేస్తాయి. కొన్ని రోజులకే.. స్క్రీన్ మీద తెల్లటి మచ్చలు, ప్యాచెస్ లేదా పొర ఊడిపోయినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా టచ్‌స్క్రీన్, హై-రిఫ్రెష్‌రేట్ డిస్‌ప్లేలకు ఇది చాలా ప్రమాదం.
2.టిష్యూ పేపర్, రఫ్ క్లాత్స్: ఇవి తాకడానికి మెత్తగా ఉన్నా..వాటిలోని చెక్క ఫైబర్స్ వల్ల స్క్రీన్ మీద కంటికి కనిపించని సన్నని గీతలు పడే అవకాశం ఉంటుంది.
3.గ్లాస్ క్లీనర్స్, సోప్ లిక్విడ్స్: అద్దాలు తుడిచే.. స్ప్రేలు లేదా డిష్ వాష్ లిక్విడ్స్‌లోని కెమికల్స్ డిస్‌ప్లే ప్యానెల్‌ను దెబ్బతీస్తాయి. అలాగే.. లిక్విడ్ నేరుగా స్క్రీన్ మీద స్ప్రే చేస్తే.. అంచుల గుండా లోపలికి వెళ్లి బ్యాక్‌లైట్ లేదా సర్క్యూట్ షార్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది.
స్క్రీన్‌ను సేఫ్‌గా క్లీన్ చేయడానికి పెద్ద ఖర్చు చేయాల్సిన పనిలేదు, కాస్త జాగ్రత్తగా ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.
షట్ డౌన్ & కూల్ డౌన్: ముందుగా ల్యాప్ టాప్‌ను పూర్తిగా ఆఫ్ చేసి, ఛార్జింగ్ కేబుల్ తీసేయండి. స్క్రీన్ వేడిగా ఉంటే.. కాసేపు చల్లారనివ్వండి. నల్లగా.. ఉన్న స్క్రీన్ మీద దుమ్ము, మరకలు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి.
డ్రై మైక్రోఫైబర్ క్లాత్: శుభ్రమైన, మెత్తటి మైక్రోఫైబర్ క్లాత్ తీసుకోండి. కళ్లద్దాలు తుడుచుకునే.. క్లాత్ లాంటిదైతే ఇంకా బెటర్. గట్టిగా ఒత్తకుండా..గుండ్రంగా మెల్లగా తుడవండి. రోజువారీ దుమ్ము, తేలిక పాటి వేలిముద్రలు దీనికే ఈజీగా పోతాయి.
మొండి మరకల కోసం డిస్టిల్డ్ వాటర్: పొడి క్లాత్‌కు పోని మరకలు ఉంటే, కొద్దిగా డిస్టిల్డ్ వాటర్ లేదా ఆల్కహాల్-ఫ్రీ స్క్రీన్ క్లీనర్‌ను క్లాత్ మీద స్ప్రే చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ.. నేరుగా స్క్రీన్ మీద స్ప్రే చేయకూడదు.క్లాత్ కేవలం తడితడిగా మాత్రమే ఉండాలి, నీళ్లు కారేలా ఉండకూడదు. తడి క్లాత్‌తో తుడిచిన వెంటనే మరో పొడి మైక్రోఫైబర్ క్లాత్‌తో ఆరనివ్వండి.
కీబోర్డ్ & ఎడ్జెస్ కేర్: స్క్రీన్ అంచులు, హింజెస్ దగ్గర దుమ్ము చేరకుండా బ్రష్ లేదా క్లాత్‌తో శుభ్రం చేయండి. ల్యాప్‌టాప్ మూసినప్పుడు కీబోర్డ్ మీద ఉండే జిడ్డు, దుమ్ము స్క్రీన్‌కు అంటుకుంటాయి కాబట్టి కీబోర్డ్‌ను కూడా తరచూ క్లీన్ చేస్తూ ఉండాలి.
Also Read: రూ.799కే ప్రీమియం ఇయర్‌బడ్స్..మార్కెట్‌ను ఊపేస్తున్న కొత్త మోడల్
ఈ రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్, కంటెంట్ క్రియేషన్, స్టడీస్ అన్నీ ల్యాప్‌టాప్ చుట్టూనే తిరుగుతున్నాయి. డిస్‌ప్లే ఒక్క సారి డ్యామేజ్ అయితే.. రిపేర్ లేదా రీప్లేస్‌మెంట్ కోసం వేలల్లో ఖర్చవుతుంది. పైగా ల్యాప్‌టాప్ రీసేల్ వాల్యూ కూడా పడి పోతుంది. అందుకే చేతికి ఏది దొరికితే దానితో స్క్రీన్‌ను తుడిచే.. అలవాటును ఇప్పుడే మార్చుకోండి. మీ ల్యాప్ టాప్ బ్యాగ్‌లో ఒక మంచి మైక్రో ఫైబర్ క్లాత్ పెట్టుకుంటే..ఎప్పుడైనా నిమిషంలో స్క్రీన్‌ను సేఫ్‌గా మెరిపించుకోవచ్చు. స్క్రీన్ క్లియర్‌గా ఉంటే మన పని కూడా అంతే ఫ్రెష్‌గా సాగుతుంది.