HP OmniBook Ultra 16: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో.. పని చేసే డెవలపర్లు ,హై-ఎండ్ కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ ఒక పవర్ ఫుల్ ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో విడుదల చేసింది. అదే సరి కొత్త హెచ్‌పీ ఆమ్నిబుక్ అల్ట్రా 16. సాధారణ ల్యాప్ టాప్లలా కాకుండా, క్లౌడ్ ఇంటర్నెట్పై ఆధార పడకుండా నేరుగా డివైజ్‌లోనే భారీ ఏఐ మోడల్స్‌ను రన్ చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్ ప్లాట్‌ఫామ్‌తో.. వచ్చిన ఈ అల్ట్రా-ప్రీమియం ల్యాప్‌టాప్ ధర, బ్యాంక్ ఆఫర్లు , మైండ్ బ్లోయింగ్ స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ కొత్త హెచ్‌పీ ఆమ్నిబుక్ అల్ట్రా 16 ల్యాప్‌టాప్‌లో లేటెస్ట్ ఎన్విడియా ఆర్టీఎక్స్ స్పార్క్ ఎన్1ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. ఇందులో.. 20-కోర్ సీపీయూతో పాటు 6,144-కోర్ బ్లాక్వెల్ ఆర్టీఎక్స్ జీపీయూ ఉండటం వల్ల.. ఏకంగా ఒక పెటాఫ్లాప్ స్థాయి ఏఐ పెర్ఫార్మెన్స్ లభిస్తుంది. అంటే.. కోడింగ్ చేసే డెవలపర్లు భారీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఏఐ ఏజెంట్లను ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే.. తమ ల్యాప్‌టాప్‌లో లోకల్‌గా ట్రైన్ చేయెచ్చు, రన్ చేయవచ్చు. ఇందులో 64జీబీ నుంచి గరిష్టంగా 128జీబీ వరకు యూనిఫైడ్ ర్యామ్ ఆప్షన్లు , ఒక టీబీ స్టోరేజ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ , హెవీ కంప్యూటింగ్ పనులు రెప్పపాటులో పూర్తవుతాయి.
వీడియో ఎడిటర్లు, త్రీడీ డిజైనర్లు , గ్రాఫిక్ క్రియేటర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇందులో 16-అంగుళాల 3కే ఓలెడ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేను ఇచ్చారు. ఇది 120 హెర్ట్జ్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్, ఫాస్ట్ రెస్పాన్స్ టైమ్ , వంద శాతం కలర్ కవరేజీతో వస్తుంది. అంతేకాకుండా.. ట్రూ బ్లాక్ సర్టిఫికేషన్ ఉండటం వల్ల రంగులు అత్యంత సహజంగా, స్పష్టంగా కనిపిస్తాయి. ఎన్విడియా స్టూడియో టెక్నాలజీ, రే ట్రేసింగ్ సపోర్ట్ ఉండటం వల్ల 8కే వీడియో ఎడిటింగ్ ,పెద్ద త్రీడీ రెండరింగ్ ప్రాజెక్టులను కూడా ఇది ఈజీగా హ్యాండిల్ చేయగలదు.
ఎక్కువ సేపే వాడినప్పుడు ల్యాప్‌టాప్ వేడెక్కకుండా హెచ్‌పీ ప్రత్యేకమైన టవర్ హింజ్ , థర్మల్ కూలింగ్ డిజైన్‌ను ఇందులో వాడారు. కేవలం 2.22 కిలోల బరువుతో అల్యూమినియం బాడీతో ఇది చాలా స్టైలిష్‌గా ఉంటుంది. రోజంతా పని చేయడానికి వీలుగా 99 వాట్-అవర్ భారీ బ్యాటరీని వాడారు. దీన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి బాక్స్‌తో పాటే 140 వాట్ల ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఐఆర్ కెమెరా, పాలీ స్టూడియో ట్యూనింగ్‌తో కూడిన క్వాడ్-స్పీకర్ సెటప్ , జెస్చర్ కంట్రోల్స్ ఉన్న హాప్టిక్ టచ్‌ప్యాడ్ ఉన్నాయి. కనెక్టివిటీ కోసం.. లేటెస్ట్ వై-ఫై 7, రెండు యూఎస్బీ టైప్-సీ పోర్టులు, రెండు యూఎస్బీ టైప్-ఏ పోర్టులు, హెచ్డీఎంఐ 2.1 , మైక్రో ఎస్డీ కార్డ్ రీడర్ ఇచ్చారు.
Also Read: నథింగ్ బడ్స్‌కు చెక్ పెట్టేలా JBL కొత్త స్ట్రాటజీ..ట్రాన్స్పరెంట్ డిజైన్‌తో కొత్త మోడల్ లాంచ్!
లేటెస్ట్ ఏఐ వర్క్‌స్టేషన్ స్థాయి ఫీచర్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్ ధర కూడా ప్రీమియం రేంజ్‌లోనే ఉంది. మన దేశంలో హెచ్‌పీ ఆమ్నిబుక్ అల్ట్రా 16 ప్రారంభ వేరియంట్ ధర రూ.5,49,999 గా కంపెనీ నిర్ణయించింది. అలాగే టాప్-ఎండ్ 128జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.6,99,999 గా ఉంది. ప్రస్తుతం ఇది ఎక్లిప్స్ గ్రే రంగులో హెచ్‌పీ అధికారిక ఆన్లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉంది.