Lost Phone Safety Tips: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించే పరికరం కాదు. మన ఫొటోలు, వీడియోలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, వ్యక్తిగత మెసేజ్‌లు.. ఇలా మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు అందులోనే ఉంటున్నాయి. అలాంటి ఫోన్ ఒక్కసారిగా కనిపించకుండా పోతే ఎంత టెన్షన్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్ ఎక్కడ పోయిందోనని వెతికేలోపే.. అందులోని వ్యక్తిగత సమాచారం ఎవరికైనా చేరుతుందేమోననే భయం మొదలవుతుంది.
అయితే ఇలాంటి సమయంలో కంగారుపడకుండా వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా చేస్తే మీ డేటా దుర్వినియోగం కాకుండా అడ్డుకోవడంతో పాటు, బ్యాంక్ ఖాతాలను కూడా సురక్షితంగా ఉంచుకోవచ్చు. మరి స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు ఆలస్యం చేయకుండా చేయాల్సిన ఆ 6 పనులేంటో తెలుసుకుందామా..
మీ ఫోన్ ఎక్కడ మిస్ అయిందో తెలుసుకోవడానికి ఆండ్రాయిడ్ యూజర్లు Google Find Hub, ఐఫోన్ వాడేవారు Apple Find My ఉపయోగించవచ్చు. ఫోన్‌లో ఈ ఫీచర్లు ముందుగానే ఆన్ చేసి ఉంటే, అది ప్రస్తుతం ఎక్కడుందో లేదా చివరిగా ఎక్కడ కనిపించిందో తెలుసుకోవచ్చు. దగ్గరలోనే ఉంటే రింగ్ చేయించి వెతకవచ్చు. ఒకవేళ తెలియని ప్రాంతంలో ఫోన్ లొకేషన్ కనిపిస్తే మాత్రం మీరే వెళ్లి తీసుకురావడానికి ప్రయత్నించవద్దు.
ఫోన్ దొరకడం లేదని తెలిసిన వెంటనే దాన్ని రిమోట్‌గా లాక్ చేయండి. Google Find Hub, Apple Find My ద్వారా ఈ పని చేయవచ్చు. కొన్ని ఫోన్లలో లాక్ స్క్రీన్‌పై మీ మరో ఫోన్ నంబర్‌ను చూపించే అవకాశం ఉంటుంది. దీంతో ఫోన్ ఎవరికైనా దొరికితే మిమ్మల్ని సంప్రదించవచ్చు. ఇలా చేయడం వల్ల ఇతరులు మీ ఫోన్‌లోని సమాచారాన్ని చూడకుండా అడ్డుకోవచ్చు.
ఫోన్ దొరికిన వ్యక్తి మీ సిమ్‌ను ఉపయోగిస్తే ఇబ్బందులు ఎదురుకావచ్చు. ముఖ్యంగా మీ నంబర్‌కు వచ్చే ఓటీపీలను ఉపయోగించి కొన్ని ఖాతాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ఆలస్యం చేయకుండా మీ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సిమ్ బ్లాక్ చేయించండి. ఆ తర్వాత అవసరమైన గుర్తింపు వివరాలు ఇచ్చి అదే నంబర్‌తో కొత్త సిమ్ తీసుకోవచ్చు.
Also Read: కెమెరా మార్కెట్‌లోకి వివో ఎంట్రీ? ట్రేడ్‌మార్క్‌తో బయటపడిన ఆసక్తికర విషయం!
మీ ఫోన్‌లో బ్యాంకింగ్ యాప్‌లు, గూగుల్ పే, ఫోన్‌పే వంటి యూపీఐ యాప్‌లు ఉంటే వెంటనే మీ బ్యాంక్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే మొబైల్ బ్యాంకింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయమని అడగండి. మీ ఖాతాలో ఏవైనా తెలియని లావాదేవీలు జరిగాయేమో కూడా చెక్ చేయండి. ఒకవేళ డబ్బు పోగొట్టుకుంటే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి.
ఫోన్ పోయిన తర్వాత మీ ఈ-మెయిల్, గూగుల్ లేదా యాపిల్ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ముందుగా మార్చేయండి. ఆ తర్వాత బ్యాంకింగ్, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను కూడా మార్చడం మంచిది. మీ ఖాతాల్లో ఎక్కడైనా గుర్తు తెలియని పరికరాలు లాగిన్ అయి ఉంటే వాటి నుంచి సైన్ అవుట్ చేయండి. ఒకే పాస్‌వర్డ్‌ను అన్ని ఖాతాలకు వాడుతున్నట్లయితే, ఒక్కో దానికి వేరే పాస్‌వర్డ్ పెట్టుకోండి.
ఫోన్ కనిపించకపోతే ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయండి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న Sanchar Saathi వెబ్‌సైట్‌లోని CEIR సేవ ద్వారా మీ ఫోన్ IMEI నంబర్‌ను బ్లాక్ చేయమని కోరవచ్చు. దీనికోసం ఫోన్ IMEI నంబర్, పోలీస్ ఫిర్యాదు కాపీ అవసరం కావచ్చు. ఈ నంబర్ ఫోన్ బాక్స్ లేదా కొనుగోలు బిల్లుపై ఉంటుంది. మరో ఫోన్‌లో *#06# డయల్ చేసినా IMEI నంబర్ తెలుసుకోవచ్చు. రెండు సిమ్‌లు ఉపయోగించే ఫోన్లలో రెండు IMEI నంబర్లు ఉండొచ్చు.
Also Read: నెల రోజుల ఇంటర్నెట్ ఉచితం.. BSNL ధమాకా ఆఫర్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?