Zuckerberg on AI : సాఫ్ట్ వేర్ డెవలపర్స్ ఉలిక్కిపడేలా ఏఐ గురించి మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన విషయాల్ని వెల్లడించారు. రానున్న రోజుల్లో మనుషులతో ప్రమేయం లేకుండానే.. సొంతగా ప్రోగ్రామ్ రాయగల సామర్థ్యం ఏఐ సొంతం అవుతుందని తెలిపారు. ఇప్పటికే.. మెటా వద్ద ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) మధ్య స్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల సామర్థ్యాలను చేరుకుంటుందని వెల్లడించారు. యూట్యూబర్ జో రోగన్ నిర్వహించిన ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న జుకర్‌బర్గ్ కోడింగ్‌లో ఏఐ పాత్ర, ఉద్యోగ, ఉపాధీ అవకాశాలపై అది చూపించే ప్రభావం గురించి తన ఆలోచనల్ని పంచుకున్నారు.
ఇప్పటికే.. అంతర్జాతీయంగా దిగ్గజ ఐటీ సంస్థలు ఏఐ అభివృద్ధిపై దృష్టి పెట్టాయని తెలిపిన జుకర్స్ బర్గ్.. 2025 నాటికి మెటా సహా మిగతా సంస్థల్లోనూ ఏఐ ప్రమేయం పెరుగుతుందని తెలిపారు. కోడ్‌ను వ్రాసే మిడ్-లెవల్ ఇంజనీర్‌లను ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సమర్థవంతంగా భర్తీ చేయగలదని పేర్కొన్నారు. దీంతో.. అంతర్జాతీయంగా రానున్న రోజుల్లో సాధారణ డెవలపర్లు, ఇతర ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే ఆందోళనలు పెరిగిపోయాయి.
మోటా సంస్థకు చెందిన యాప్ లలో అన్ని కోడ్‌లను ఏఐ చాలా వరకు రాయగలదని, మరింత మెరుగ్గా రాసే స్థితికి చేరుకుంటామని జుకర్స్ బర్గ్ తెలిపారు. సంస్థలు సైతం ఏఐ వినియోగానికి మొగ్గు చూపే అవకాశాలున్నట్లు వెల్లడించారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఐటీ సంస్థలో మధ్య స్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సైతం ఆరు అంకేల జీతాన్ని అందుకుంటున్నారని, అదే ఏఐ ద్వారా అయితే వేగంగా పని పూర్తవడంతో పాటు ఖర్చును గణనీయంగా తగ్గించుకోవచ్చని అన్నారు.
గూగుల్, ఐబీఎమ్ వంటి ప్రముఖ టెక్ దిగ్గజాలు తమ కార్యకలాపాలకు ఏఐ సాంకేతికతను అనుసంధానం చేస్తున్న సమయంలో జుకర్‌బర్గ్ వ్యాఖ్యలు టెక్ ఉద్యోగుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. ఇటీవల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. తమ వద్ద ఉన్న మొత్తం కొత్త కోడ్‌లలో 25 శాతానికి పైగా ఏఐ ద్వారానే రూపొందిస్తున్నామని తెలిపారు. వాటిని కేవలం తుది సమీక్ష కోసమే మానవ ఇంజినీర్లకు పంపుతున్నట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ఐబీఎమ్ సీఈఓ అరవింద్ కృష్ణ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సంస్థల్లోని చాలా పనుల్ను ఏఐ 30 శాతం వరకు భర్తీ చేయగలదని ప్రకటించారు. ఇలా.. వివిధ రంగాల్లో ఏఐ తెస్తున్న మార్పులు.. సాంప్రదాయ కోడింగ్ ఉద్యోగాల భవిష్యత్తు గురించి చర్చకు దారి తీస్తోంది.
ఐటీ ఇంజినీర్ల ఉద్యోగాల సంగతేంటి..
జుకర్‌బర్గ్ తాజా ప్రకటన, ఏఐ కోడింగ్ గురించి గూగుల్ సంస్థ వ్యాఖ్యలు చూస్తే ఐటీ ఇంజనీర్ల పాత్ర మారుతున్నదని స్పష్టమవుతుంది అంటున్నారు విశ్లేషకులు. రానున్న రోజుల్లో కోడింగ్ ఉద్యోగాలు భారీగా తగ్గిపోయో అవకాశాలున్నట్లు కనిపిస్తోందంటున్నారు. ఏఐ కారణంగా జూనియర్, ఎంట్రీ-లెవల్ కోడింగ్ ఉద్యోగ స్థానాలు తగ్గిపోవచ్చని, డెవలపర్‌లు తమ కెరీర్ మార్గాలను పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో వేరే విభాగాల్లో ఉద్యోగాల సృష్టి పెరుగుతుందని అంటున్నారు. సాధారణ పనులపై సమయాన్ని వెచ్చించే బదులు, ఇంజనీర్లు ఉన్నత స్థాయి సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఆలోచించడం సహా.. ఏఐ రూపొందించే కోడ్ ల పర్యవేక్షణపై దృష్టి పెట్టే అవసరం ఏర్పడుతుందని అంటున్నారు.
Also Read : పాపం.. PM కిసాన్ కోసం ఆశపడితే ఏకంగా లక్షలే పోయాయి!
అయితే, ఇంజనీర్లకు ఇది పూర్తిగా నిరాశపరిచేది కాదంటున్నారు. కోడింగ్ అభివృద్ధి, వ్యూహాత్మక, సృజనాత్మక అంశాలపై దృష్టి కేంద్రీకరించడానికి డెవలపర్లకు అవకాశం కల్పిస్తుంది అంటున్నారు. మానవ ఇంజనీర్లను దీర్ఘకాలంలో భర్తీ చేయడం ఏఐ వల్ల కాదని అంటున్నారు. ఎందుకంటే.. ఒకే రకమైన పని చేసేందుకు మాత్రమే ఏఐ పనిచేస్తుంది కానీ.. సంక్లిష్ట సమస్యలను పరిష్కరించ లేదు. కాబట్టి..అలాంటి చోట్ల మనుషుల అవసరం తప్పకుండా ఉంటుందని అంటున్నారు.