Mark Zuckerberg : 2024లో ఇండియాలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్.. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం కోట్ల మంది నమ్మకాన్ని గెలుచుకుందని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ఈ వివాదంపై మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తూక్రాల్ స్పందిస్తూ.. జుకర్ బర్గ్ వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపారు.
ఇండియాలో 2024 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై మెటా అధినేత మార్క్ జుకర్గ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారానికి దారి తీశాయి. జనవరి 10న జరిగిన పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్… “కోవిడ్ మహమారి ప్రపంచవ్యాప్తంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేసింది. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదు. 2024 అతి పెద్ద ఎలక్షన్ ఇయర్. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎన్నికలు జరిగాయి అందులో భారత్ కూడా ఒకటి. ఇక్కడ కూడా అధికారంలో ఉన్నవాళ్లు ప్రతీ ఒక్కరి నమ్మకాన్ని కోల్పోయారు. అయితే ఇది ద్రవ్యోల్బనం లేదా ఆర్థిక విధానాల వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. అయితే ఏది ఏమైనా ప్రభుత్వాలు కోవిడ్ ను నియంత్రించడంలో వైఫల్యం చెందాయి. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపించింది..” అంటూ తెలిపారు.
జూకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఫ్యాక్ట్ చెక్ చేశారు. అనంతరం లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుందని పునరుద్ఘాటించారు.
“ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. ఇక్కడ జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో 640 మిలియన్స్ ఓటర్లు పాల్గొన్నారు. ఈ భారతీయ ఓటర్లందరూ ప్రధాని నరేంద్రమోదీ జీ నాయకత్వంలోని NDA ప్రభుత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించారు. 2024 ఎన్నికలలో భారత్ సహా కోవిడ్ సమయంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఓడిపోయాయని మిస్టర్ జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. కోవిడ్ తరువాత ప్రజల విశ్వాసం ప్రభుత్వం కోల్పోయిందని చెప్పటం అవాస్తవం..” – రైల్వే, ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్
‘కోవిడ్ సమయంలో 800 మిలియన్లకు పైగా ప్రజలకు ఉచిత ఆహారం, 2.2 బిలియన్ ఉచిత వ్యాక్సిన్‌లు, ప్రపంచవ్యాప్తంగా దేశాలకు సహాయం చేయడం, భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నడిపించడం వంటివి ప్రధాని మోడీ నిర్ణయాత్మక సుపరిపాలన విజయం. మూడోసారి ప్రధానిగా మోదీ గెలవటం ప్రజల విశ్వాసానికి నిదర్శనం. అలాంటిది మిస్టర్ జుకర్‌బర్గ్ నుంచి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వినటం చాలా నిరాశను మిగిల్చింది. ప్రతీ ఒక్కరం వాస్తవాలను సమర్థిద్దాం.. విశ్వసనీయత చాటి చెప్పుదాం..” – అశ్వీనీ వైష్ణవ్
As the world’s largest democracy, India conducted the 2024 elections with over 640 million voters. People of India reaffirmed their trust in NDA led by PM @narendramodi Ji’s leadership.
Mr. Zuckerberg’s claim that most incumbent governments, including India in 2024 elections,…
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 13, 2025
ఇక ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే భారత్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
“ప్రజాస్వామ్య దేశంపై తప్పుడు సమాచారం ప్రచారం చెయ్యటం ఆ దేశ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఈ తప్పుకు ఆ సంస్థ భారత్ పార్లమెంటుకు వచ్చి ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి..” – బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే
ఈ నేపథ్యంలో జుకర్ బర్గ్ మాటలపై స్పందించిన మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) శివనాథ్ తుక్రాల్ భారత్ కు క్షమాపణలు తెలిపారు.
“గౌరవ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. మార్క్ జుకర్ బర్గ్ గమనించిన పార్టీలు చాలా వరకూ ప్రజలను పట్టించుకోలేదు. 2024 ఎన్నికల్లో కొన్ని దేశాలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయన్న మాట నిజమే.. కానీ అందుకు భారత్ ఖచ్చితంగా మినహాయింపే. జుకర్ బర్గ్ వ్యాఖ్యలు అనుకోకుండా మాట్లాడినవే. మెటాకు భారత్ ఎప్పుడూ చాలా ముఖ్యమైన దేశంగానే ఉంటుంది. ఆ దేశ అభివృద్ధి కోసం మేమంతా ఎప్పుడూ ఎదురుచూస్తాం..” – మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ (పబ్లిక్ పాలసీ) శివనాథ్ తుక్రాల్