WhatsApp Contacts Tab: వాట్సప్ యూజర్లకు మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటివరకు మనకు కావాల్సిన వ్యక్తితో చాట్ చేయాలంటే చాట్స్ విభాగంలో పేరు వెతకాల్సి వచ్చేది. అయితే ఇకపై ఆ పని మరింత సులభం కానుంది. కాంటాక్ట్స్ కోసం ప్రత్యేకంగా ఓ కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చేందుకు మెటా పరీక్షలు చేస్తోంది. ఇందులో సేవ్ చేసిన నంబర్లను ఒకేచోట చూడటంతో పాటు, కొత్త కాంటాక్ట్స్‌ను యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉండనుంది. ప్రస్తుతం కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ కనిపిస్తోంది. అందరికీ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
WABetaInfo నివేదిక ప్రకారం.. వాట్సప్ బీటా ఆండ్రాయిడ్ 2.26.45.2 వెర్షన్‌లో ఈ ఫీచర్ కనిపిస్తోంది. యాప్ దిగువన ఉండే నావిగేషన్ బార్‌లోని కమ్యూనిటీస్ ట్యాబ్ స్థానంలో కొత్తగా Contacts ట్యాబ్‌ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్స్ జాబితా కనిపిస్తుంది. అక్కడి నుంచే ఒక వ్యక్తిని ఎంచుకుని నేరుగా చాట్ ప్రారంభించవచ్చు. దీంతో ప్రతిసారీ Chats విభాగానికి వెళ్లి పేరు వెతకాల్సిన అవసరం తగ్గుతుంది.
కొత్త విభాగంలో ముందుగా ఫేవరెట్ కాంటాక్ట్స్ కనిపించే అవకాశం ఉంది. వాటి తర్వాత మిగతా సేవ్ చేసిన నంబర్లు జాబితాలో ఉంటాయి. కాంటాక్ట్స్‌ను పేర్ల అక్షర క్రమంలో అమర్చుకోవచ్చు. అలాగే పుట్టినరోజుల ఆధారంగా లేదా యాక్టివిటీ ప్రకారం కూడా జాబితాను సర్దుకునే ఆప్షన్లు ఉండొచ్చని నివేదిక చెబుతోంది. యాక్టివిటీని ఎంచుకుంటే ఆన్‌లైన్‌లో ఉన్నవారు ముందుగా కనిపిస్తారు. వారి పేరు పక్కన గ్రీన్ డాట్ కనిపించవచ్చు. ఇతరుల లాస్ట్ సీన్ వివరాలు మాత్రం వారి ప్రైవసీ సెట్టింగ్స్‌ను బట్టి చూపిస్తారు.
Also Read: సబ్‌స్క్రిప్షన్ ఖర్చులకు చెక్ పెట్టే 4 బెస్ట్ యాప్స్.. నెలకు ఎంత ఆదా చేయవచ్చో తెలుసా?
ఈ ట్యాబ్‌లో Meta AI షార్ట్‌కట్ కూడా ఉండొచ్చని సమాచారం. వాట్సప్ ఆహ్వాన లింక్‌ను షేర్ చేయడం, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను వాట్సప్‌లో చాట్‌కు ఆహ్వానించడం వంటి ఆప్షన్లు కూడా పరీక్షలో ఉన్నట్లు తెలుస్తోంది. దిగువన ఉండే బటన్‌తో పేరు, యూజర్‌నేమ్ లేదా ఫోన్ నంబర్ ద్వారా కొత్త కాంటాక్ట్‌ను యాడ్ చేసుకోవచ్చు. ఫోన్ నంబర్‌తో జోడించిన వివరాలను మొబైల్ అడ్రస్ బుక్‌లో సేవ్ చేసుకునే అవకాశం కూడా ఉండొచ్చు.
ప్రస్తుతం ఈ ఫీచర్ Google Play బీటా ప్రోగ్రామ్‌లో ఎంపిక చేసిన కొంతమంది యూజర్లకు మాత్రమే అందుతోంది. 2.26.45.2 వెర్షన్ ఇన్‌స్టాల్ చేసిన ప్రతి ఒక్కరికీ కూడా ఇది వెంటనే కనిపించకపోవచ్చు. వాట్సప్ సాధారణంగా కొత్త మార్పులను దశలవారీగా పరీక్షించి, తర్వాత విస్తృతంగా విడుదల చేస్తుంది. ఈ ఫీచర్ స్టేబుల్ వెర్షన్‌కు ఎప్పుడు వస్తుందో కంపెనీ వెల్లడించలేదు. కాబట్టి.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. పరీక్షలు పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్‌లో కొన్ని ఆప్షన్లు మారే అవకాశం కూడా ఉంది. అని నివేదిక చెబుతోంది.
Also Read: యూట్యూబ్ యాప్‌లో భారీ మార్పులు.. సబ్‌స్క్రిప్షన్స్ ట్యాబ్ మాయం.. కొత్తగా ఏమొచ్చాయంటే?