Subscription Management Apps: ప్రతి నెలా ఫోన్‌లో ఎన్నో సబ్‌స్క్రిప్షన్లు ఆటోమేటిక్‌గా రెన్యూ అవుతుంటాయి. ఒకప్పుడు ట్రయల్ కోసం తీసుకున్న యాప్ అయినా.. అప్పుడప్పుడు మాత్రమే చూసే స్ట్రీమింగ్ సర్వీస్ అయినా, బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూనే ఉంటుంది. చిన్న మొత్తాలుగా కనిపించే ఈ చార్జీలు ఏడాది చివరికి పెద్ద ఖర్చుగా మారతాయి. ఏ సర్వీసుకు ఎంత చెల్లిస్తున్నామో గుర్తించడానికి, అవసరం లేని వాటిని ఆపడానికి కొన్ని యాప్స్ ఉపయోగపడతాయి. ఆ నాలుగు యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాకెట్ మనీ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలను పరిశీలించి రెగ్యులర్‌గా కట్ అవుతున్న సబ్‌స్క్రిప్షన్లను గుర్తిస్తుంది. ఉచిత వెర్షన్‌లో వాటిని ఒకే డాష్‌బోర్డ్‌లో చూడొచ్చు. ఖర్చులు అర్థమవుతాయి. అయితే యాప్ ద్వారా మన బదులు సబ్‌స్క్రిప్షన్ రద్దు చేయించే సదుపాయం ప్రీమియంలోనే ఉంటుంది. ధర నెలకు సుమారు రూ.580 నుంచి రూ.1,250 వరకు మారవచ్చు. బ్యాంక్ వివరాలను లింక్ చేయడానికి ప్లెయిడ్ సేవను ఉపయోగిస్తుంది. యాప్‌కు లావాదేవీలు చూసే అనుమతి మాత్రమే ఇవ్వాలి.
గతంలో ట్రిమ్ యాప్ వాడిన వారికి వన్‌మెయిన్ మైమనీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రెగ్యులర్ చెల్లింపులను గుర్తించి జాబితాగా చూపిస్తుంది. కేబుల్ లేదా ఇతర బిల్లులు ఎక్కువగా ఉంటే, ధర తగ్గించేందుకు సంస్థ తరఫున మాట్లాడే సదుపాయం ఉంది. అవసరం లేని సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేయడంలోనూ సాయం చేస్తుంది. అయితే ఈ సేవలు ఉచితంగా అందేది వన్‌మెయిన్ ఫైనాన్షియల్ లేదా బ్రైట్‌వే క్రెడిట్ కార్డు ఉన్నవారికే. మిగతావారు ఉచిత ట్రాకింగ్ ఫీచర్లను వాడుకోవచ్చు.
Also Read: లైవ్ ట్రాన్స్‌లేషన్ నుంచి నావిగేషన్ వరకు.. జెంటిల్ మాన్ ఏఐ గ్లాసెస్ విశేషాలివే!
హైయాటస్ సబ్‌స్క్రిప్షన్లతో పాటు నెలవారీ ఖర్చులు, బిల్లులను ఒకేచోట చూపిస్తుంది. గత లావాదేవీలను బట్టి మళ్లీ వచ్చే చెల్లింపులను గుర్తించి, రాబోయే ఖర్చులపై అంచనా ఇస్తుంది. ఉచిత వెర్షన్‌లో సబ్‌స్క్రిప్షన్లను ట్రాక్ చేయొచ్చు. ఆటోమేటిక్ రద్దు, వెంటనే ఖాతా వివరాలు అప్‌డేట్ అయ్యే సదుపాయాల కోసం ప్రీమియం అవసరం. దీనికి నెలకు దాదాపు రూ.830 ఖర్చవుతుంది. బ్యాంక్ లావాదేవీలను చదవడానికి ప్లెయిడ్ కనెక్షన్ అవసరం.
బ్యాంక్ వివరాలు ఇవ్వకూడదనుకునేవారికి రీ సబ్స్ మంచి ఎంపిక. ఇందులో మనమే సబ్‌స్క్రిప్షన్ల వివరాలు నమోదు చేయాలి. ఉచిత వెర్షన్‌లో ఐదు వరకు సబ్‌స్క్రిప్షన్లు చేర్చవచ్చు. ట్రయల్ ముగిసే ముందు లేదా రెన్యువల్‌కు ముందు నోటిఫికేషన్లు వస్తాయి. ఎక్కువ సబ్‌స్క్రిప్షన్లు, రసీదులను ఆటోమేటిక్‌గా స్కాన్ చేసే ఫీచర్లు కావాలంటే చెల్లింపు ప్లాన్ తీసుకోవాలి. ఇది బ్యాంక్ ఖాతాను లింక్ చేయదు కాబట్టి.. ఖర్చుల వివరాలు పంచుకోవాల్సిన అవసరం ఉండదు.
యాప్ ఎంచుకునే ముందు అనుమతులు, ప్రైవసీ పాలసీ చదవాలి. రీడ్-ఓన్లీ యాక్సెస్ అంటే లావాదేవీలు చూడగలగడమే గానీ డబ్బు బదిలీ చేయడం కాదు. ఫోన్‌లోని యాప్ స్టోర్ సబ్‌స్క్రిప్షన్ సెట్టింగ్స్ కూడా చెక్ చేయండి. దీంతో అవసరం లేని చార్జీలను గుర్తించి, ప్రతి నెలా ఖర్చు తగ్గించుకోవచ్చు.
Also Read: బోస్ సౌండ్ ట్విస్ట్‌తో మోటో కొత్త ఇయర్ బడ్స్.. మిగతా బ్రాండ్స్‌కు నిద్రలేకుండా చేసేలా ఫీచర్లు!