RBI New Digital Payment Rules 2026: ప్రస్తుతం టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద షోరూమ్‌ల వరకు అంతా డిజిటల్ చెల్లింపులే. అయితే.. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత పెరిగాయో, సైబర్ మోసాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఓటీపీ (OTP) చోరీ, సిమ్ స్వాపింగ్ వంటి పద్ధతులతో కేటుగాళ్లు సామాన్యుల బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నేటి(ఏప్రిల్ 1) నుంచి డిజిటల్ పేమెంట్లకు సంబంధించి అత్యంత కఠినమైన భద్రతా నిబంధనలను అమల్లోకి తెచ్చింది.
ఇప్పటివరకు మనం ఏదైనా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు, మన మొబైల్ నంబర్‌కు వచ్చే 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోయేది. కానీ.. ఇకపై కేవలం ఓటీపీ మాత్రమే సరిపోదు. ప్రతి ట్రాన్షాక్షన్ కు తప్పనిసరిగా ‘టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ (2FA) లేదా ‘మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్’ (MFA) ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది.
ట్రాన్సాక్షన్ కన్ఫామ్ చేయడానికి కనీసం రెండు వేర్వేరు సెక్యూరిటీ లెవల్స్ ఉపయోగించడాన్నే 2FA అంటారు. ఇవి సాధారణంగా మూడు రకాలుగా ఉంటాయి.
1.మీకు తెలిసిన సమాచారం (Knowledge): పిన్ (PIN), పాస్‌వర్డ్ లేదా సీక్రెట్ క్వశ్చన్.
2.మీ దగ్గర ఉన్న పరికరం (Possession): మొబైల్ ఫోన్ (OTP), సెక్యూరిటీ టోకెన్ లేదా కార్డ్.
3. మీ శారీరక గుర్తింపు (Inherence): వేలిముద్ర (Fingerprint), ఫేస్ ఐడీ లేదా ఐరిస్ స్కాన్.
ఏప్రిల్ 1 నుంచి.. ఏవైనా రెండు రకాల గుర్తింపులను వాడితేనే ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ఉదాహరణకు.. ఓటీపీతో పాటు మీ వేలిముద్ర లేదా పిన్ ఎంటర్ చేయాల్సి రావచ్చు.
రిస్క్ : చిన్న చిన్న ట్రాన్సాక్షన్‌కు పాత పద్ధతే ఉండవచ్చు. కానీ.. కొత్త డివైజ్ నుంచి లాగిన్ అయినప్పుడు లేదా ఎక్కువ మొత్తంలో డబ్బు పంపేటప్పుడు బ్యాంకులు అదనపు సెక్యూరిటీని అడుగుతాయి.
డైనమిక్ ఫ్యాక్టర్: ప్రతి ట్రాన్సాక్షన్‌కు కనీసం ఒక లెవల్ సెక్యూరిటీ ‘డైనమిక్’గా (అప్పటికప్పుడు మారేది – ఉదాహరణకు OTP లేదా టోకెన్) ఉండాలి.
బ్యాంకుల బాధ్యత: సిస్టమ్ లోపాల వల్ల లేదా సెక్యూరిటీ లెవల్స్ పాటించకపోవడం వల్ల మోసం జరిగితే.. బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఇకపై బ్యాంకులదే.
Also Read: మీ పాత జీమెయిల్ ఐడి నచ్చడం లేదా? డేటా పోకుండా ఇలా కొత్తది మార్చుకోండి!
సైబర్ నేరగాళ్లు స్కామ్ కాల్స్ లేదా ఫిషింగ్ లింకుల ద్వారా యూజర్ల నుంచి ఓటీపీలను ఈజీగా రాబడుతున్నారు. ఒకవేళ ఓటీపీ దొరికినా.. రెండో లెవల్‌లో బయోమెట్రిక్ లేదా పర్సనల్ పిన్ అవసరం ఉంటుంది కాబట్టి. మోసాలు జరిగే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
యూపీఐ (UPI), కార్డ్ పేమెంట్స్:
యూపీఐ, డెబిట్/క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్లు.. ఇలా అన్ని రకాల ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లకు ఈ రూల్ వర్తిస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 1 నాటికి ఇతర దేశాల ట్రాన్సాక్షన్‌కు కూడా ఈ రూల్స్ పూర్తిస్థాయిలో వర్తింపజేయాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్బీఐ తెచ్చిన ఈ కొత్త రూల్స్ మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా.. మన కష్టార్జితాన్ని సైబర్ నేరగాళ్ల బారి నుంచి కాపాడటానికి ఇవి ఎంతో కీలకం. “ముందు జాగ్రత్తే మంచింది” అన్నట్లుగా.. డిజిటల్ చెల్లింపుల విషయంలో ఈ అదనపు భద్రతా అంచెలను స్వాగతించడం అవసరం.